Thursday, September 2, 2010

నాయకుడు – వినాయకుడు

తెల్లదొరల గుప్పిట్లో బందీనైపోయి నేను
అష్ట కస్టంబులతోడ అవమానం బొందినాను

నాదు బాధ జూడలేక వీరులెందరొ జనియించిరి
గాంధీ నెహ్రూలవంటి నేతలెందరొ ఉదయించిరి

ఝాన్సీ అల్లూరి వంటి విప్లవ వీరులుద్భవించి
దాస్య సృంఖలాలను త్రెంచివేసి నిస్క్రమించిరి

వీర పుత్రులెందరినోగని స్వతంత్రమ్ము బొందినాను
నా బిడ్డల భవిష్యత్తుకై బోలెడు కలలుగన్నాను

ఏదీ ఆ వీరత్వం ఎక్కడుంది ఉడుకు రక్తం
నరనరంబులలోన మిగుల స్వార్థంబే నిండుకుంది

కుటిల రాజకీయాలతొ కపట వేషధారణతో
చిలుక పలుకులెన్నొ పలికి చిత్రంగా బతుకుచుండిరి

వర్తకంబున నీతిదప్పి సరుకును నల్లబజారు చేర్చి
సామాన్యుడి గుండెలపై బరువెంతో మోపినారు

సరస్వతిని పూజిస్తూనె చదువులమ్ము కొనుచుండిరి
విద్యాలయాలన్నింటిని వ్యాపారంగ మార్చేస్తిరి

చదువుకున్న మేధావులంత విదేశాల కేగుచుంటె
వట్టిపోయిన పొదుగువోలె కృశియించి పోయినాను

తెల్లవలువలు ధరిస్తూనె ఎర్రటి నెత్తుటి మరకలు
శాంతిమంత్రం జపిస్తూనె షఠగోపు కుతంత్రాలు

విదేశీయులు తంతె తప్ప దేశభక్తి పుట్టదు మరి
అవమానిస్తేనె తప్ప విప్లవంబు లేవదేమొ

భరత మాతనని నేను ఏమి జూసి గర్వించను
కన్నతల్లి కంట్లోనె కారంజల్లు కొడుకులుంటె

గాంధీయే నేడుంటే గుండెబగిలి చచ్చెటోడు
బోసుగనక బతికుంటే భోరున విలపించెటోడు

సత్యాహింసలన్న జాతిపిత మాట మరచి
ఉగ్రవాదమంటు లెస్స ఉన్మత్తుడవైతివోయి

భవిష్యత్తు తలచుకొని భారంగా నిట్టూర్చితి
కరుగని హృదయాల గాంచి కన్నీటిని కార్చుచుంటి

నేను నాది అన్నంతసేపు నాయకుడు వినాయకుడౌను
మనం మనకు అనుకుంటే వెల్లివిరియు సౌభాగ్యం

చదువుకున్న యువకులంత రాజకీయాలలొ చేరి
చదువుసంధ్యలు లేనట్టి వృద్ధనాయకుల నావలనెట్టి

ఆదర్శ భారతాన్ని అందంగా తీర్చిదిద్ది
భరతమాత నైన నాకు బహుమానంగా ఇవ్వండి

- నాగులవంచ వసంతరావు