Saturday, June 19, 2010

ఏకలవ్య జ్ఞానం

మానవునికి అన్ని విషయాలలో స్పష్టమైన అవగాహన, అనుభూతి లభిస్తుంది. కాని దేవుని విషయంలో మాత్రం స్పష్టత లేదు. రకరకాల మనుషులు రకరకాలుగా దేవుని గురించి ఊహిస్తూ, భావిస్తూ, భ్రమిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఏ ఒక్కరూ దేవుని ఉనికిని గురించి, అనుభూతిని గురించి స్పష్టంగా చెప్పలేకపోతున్నారు. ఉదాహరణకు ఒక దేవాలయంలో ఇష్టదైవంగా కొలిచే దేవతామూర్తి విగ్రహాన్నే అమాంతం దొంగలు ఎత్తుకు పోతూ ఉంటే స్వయాన దేవుడు అని చెప్పుకునే ఆ విగ్రహం కూడా ఏమీ చేయలేకపోవడం విడ్డూరంగా అనిపిస్తుంది. హేతుబద్ధమైన ఆలోచనగల ఏ వ్యక్తి యైనా ఈ విధంగానే ఆలోచిస్తాడు. నిజంగా ఆ విగ్రహమే దేవుడైతే, లేదా ఆ విగ్రహానికే గనక శక్తి ఉన్నట్లైతే దొంగ చెంపలు వాయించి, తగిన గుణపాఠం నేర్పి దొంగతనం మానిపించ గలిగేది. కాని మానవుడిచే తయారుచేయబడిన ఆ విగ్రహం అశక్తతను ప్రదర్శిస్తూ ఉంది. దీనినిబట్టి చూస్తే విగ్రహం దేవుని ప్రతిరూపమేగాని దేవుడు మాత్రం కాదు. మనిషి సృష్టించుకున్న వాటికే మానవుడు తిరిగి అద్భుత శక్తులను ఆపాదిస్తున్నాడు తప్ప, తనలోగల దివ్య శక్తులను తెలుసుకోలేకపోతున్నాడు.

ఈ దివ్య శక్తులను అనుభూతి పొందడానికి తగిన సాధన సంపత్తిని సమకూర్చుకోవడంలో విఫలమైన మానవుడు అడ్డదారుల్లో పయనిస్తూ శ్రమలేకుండానే సులువుగా మోక్షాన్ని సంపాదించుటకు బూటకపు గురువులను తెలియక ఆశ్రయిస్తున్నాడు. వారు చూపించే మంత్ర, తంత్ర, యంత్ర గారడీ విద్యలు, మహిమలు, మహత్తులు, హిప్నటిజం లాంటి విచిత్ర ప్రక్రియలతో తమకేదో దివ్య శక్తులున్నట్లుగా ప్రజలను భ్రమింపజేస్తూ తమ పని కానిచ్చుకుంటున్నారు నేటి బూటక స్వాములు. నిజానికి శక్తి అంటూ ఉంటే అది దైవ సృష్టిలోని ప్రతి జీవికి చెందినదై ఉంటుంది. అన్ని జీవులలో మానవుడు ఉత్తమమైన జీవి కాబట్టి ఆ దివ్య శక్తిని ఉద్దీపన చేసుకునే అవకాశం ఉంది. దానికి సుశిక్షితులైన యోగాచార్యులు, గురువులు ఉండవలసిందే. కాని నేటి స్వార్ధపరులైన గురువులు, యోగులు మానవాళి క్షేమం మరిచి, స్వప్రయోజనాలకై ప్రాకులాడుతూ కపటంగా జీవిస్తూ, అమాయకపు ప్రజలను వంచన చేస్తున్నారు. వీరు చెపే నీతులు వినడానికి చాలా వినసొంపుగా ఉంటాయి. కాని ఆచరణ దగ్గరకు వచ్చేసరికి భిన్నంగా ప్రవర్తిస్తూ ఉంటారు. చేతలకు, మాటలకు చాలా వ్యత్యాసం కనబరుస్తారు. తాను ఆచరించకుండా ఇతరులకు చెప్పే అధికారం ఎవ్వరికి లేదు. అందుకే మహాత్ములైన వారు ఆచరించిన తర్వాతే ఇతరులకు నీతి వాక్యాలు బోధించారు. అప్పుడే మనిషి మాటలకు విలువ వస్తుంది.

మంచిగా ఉండు – మంచినే చేయి. ఈ రెండు వాక్యాలు చాలు జీవితాన్ని సార్ధకం చేసుకోవడానికి. చూడడానికి ఈ వాక్యాలు చిన్నగా అనిపించినా నిజ జీవితంలో వాటిని ఆచరించాలంటె చాలా క్రమశిక్షణ, సమయ పాలన, దూరదృష్టి, ఆత్మ నిగ్రహం కావాలి. మంచి చెడుల మధ్యగల అంతరాన్ని గ్రహించగల సూక్ష్మ బుద్ధి కావాలి. మానవతా విలువలలోని మాధుర్యాన్ని గ్రహించ గలగాలి. త్యాగ గుణంలోని గొప్పదనాన్ని, ఆత్మానందాన్ని అందిపుచ్చుకోగలగాలి. తనకున్న దానిలో ఇతరులకు సహాయం చేసి, కృతజ్ఞతా భావంతో వారి కళ్ళలో మెరిసే ఆనంద భాష్పాలను చూసి పులకించి పోగలగాలి. మంచితనమనే మానవతా పరిమళాలను పదిమందికి వెదజల్లగలగాలి.

మోసం నుండి తప్పించుకోవాలంటే కేవలం మంచి పుస్తకాలే మనిషికి శరణ్యమని చెపాక తప్పదు. మనిషి మతం ముసుగులో మోసం చేసే అవకాశం ఉంది కాని మంచి పుస్తకం మనిషిని మోసం చేసే అవకాశమే లేదు. ఎందరో మహానుభావులు తమ జీవితంలో ఆచరించి బోధించిన అమూల్య జ్ఞాన రత్నాలు మన పురాతన గ్రంధాలలో లభ్యమౌతాయి. వాటిని చదివి ఆచరిస్తే అంతకుమించిన ఆత్మోన్నతి మరొకటి లేదు. ఇదంతా ఎందుకు రాస్తున్నానంటే ఎంతోమంది పైకి నీతులు చెబుతూనే లోన మాత్రం కపటంగా కుట్రలు చేస్తూ వక్ర మార్గంలో ఆలోచిస్తూ ఉంటారు. వారు చెప్పేవన్నీ నిజమని నమ్మితే మీరు మోసపోయినట్లే. పైకి మాత్రం నీతులు చెబుతూ ఉంటారు. ఆచరణలోకి వచ్చేసరికి వారికి లాభదాయకమైన పనిని, దానివల్ల ఇతరులకు కీడు జరిగినా సరే స్వార్ధంగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇతరులలోని తప్పులను ప్రతి ఒక్కరు వేలెత్తి చూపెడుతూ ఉంటారు. కాని వాటికి పరిష్కారం మాత్రం సూచించటం లేదు.

ఈ సమస్యకు పరిష్కారం మనిషి ఎవరినో నమ్మడం కన్నా తనను తాను నమ్ముకోవడం అన్ని విధాలా శ్రేయస్కరం. ముక్కోటి దేవతల మీద నమ్మక్మున్నా తనమీద తనకు నమ్మకం లేనిచో ప్రయోజనం శూన్యం. ఆత్మ విశ్వాసంలో ఉన్న గొప్పతనం ఇదే. తనను తాను నమ్ముకున్న వాడు ఎన్నటికీ చెడిపోడు. ఇతరులను నమ్మితేనే వేషాలు, మోసాలు. మరెందుకింక ఆలస్యం. ఏకలవ్యునివలె మంచి పుస్తకాన్నే గురువుగా భావించి, ఆదర్శాలను ఆచరణలో చూపించి మోక్షగాముల మౌదాం. మోసాల బారినుండి మనల్ని మనం కాపాడుకుందాం.

- నాగులవంచ వసంత రావు, సచివాలయం.

0 Comments:

Post a Comment

Subscribe to Post Comments [Atom]

<< Home