Thursday, June 26, 2008

వేదాంతం

ఈ ప్రపంచంలో జరిగే అన్ని అన్యాయాలకు, అక్రమాలకు, అనర్ధాలకు “అజ్ఞానమే” మూలం. కనుక మానవుడు ముందుగా “జ్ఞానం” సంపాదించాలి. అనగా అన్ని ప్రాణులలో ఉన్నది నేనే అనే విషయాన్ని అర్ధంచేసుకుని, అనుభూతి చెందాలి. అన్నీ తానే ఐనప్పుడు, అన్నింటిలో ఉన్నది తానే అని తెలుసుకున్నప్పుడు మరొకర్ని ఎలా బాధపెట్టగలడు? ఇతరులను ఎలా మోసం చేయగలడు? నీవలెనే నీ ఎదుటివారికి కూడా కొన్ని ఆశలు ఉంటాయని గ్రహించగలిగితే వారి ఆశలను అడియాశలు చేయలేవుగదా! అంతటి ఉన్నతమైన స్ధితికి మానవుని ఆలోచనా విధానం ఎదగాలి. ఈ విషయం బాగా అర్ధమై వంటబట్టాలంటే మనం ఎల్లప్పుడూ సాధన చేయాలి. అంటే, సదాచారము, మంచి మంచి పుస్తకాలు, ఆధ్యాత్మిక గ్రంధాలు చదవటం, సజ్జన సాంగత్యం లాంటివి చేయాలి. మంచి ఆలోచనలు చేస్తూ, పదిమందికి ఉపయోగపడే పనులు చేస్తూ ఉండాలి.

వేదాంతం అనగానే కంగారుపడవలసిన అవసరంలేదు. నిన్ను నీవు తెలుసుకోవడమే వేదాంతం. నీ నిజస్వరూపాన్ని చక్కగా అర్ధం చేసుకోవడమే అసలైన ఆధ్యాత్మిక విద్య. లౌకిక విద్యలు విజ్ఞానాన్ని, ధనాన్ని, కీర్తి ప్రతిష్టలను కలిగిస్తే ఆత్మవిద్య అమరత్వాన్ని ప్రసాదిస్తుంది. నీవు ఎంత గొప్ప చదువు చదివి ఎంత పెద్ద ఉద్యోగం చేసినా, ఎన్ని కోట్లు సంపాదించినా చివరకు మృత్యువాత పడక తప్పదు. చివరకు అప్పుడైనా ఆత్మ విద్యను ఆశ్రయిం చక తప్పదు. కాబట్టి లౌకిక విద్యలతోపాటు ఆధ్యాత్మిక విద్యను, అంటే నీ అసలు స్వరూపాన్ని నీవు చక్కగా అర్ధంచేసుకొని, అర్ధవంతంగా, పదుగురికి ఆదర్శవంతంగా జీవించాలి. అప్పుడే మానవ జన్మ ఎత్తినందుకు సార్ధకత లభిస్తుంది. కన్న తల్లి, ఉన్న ఊరు, పుట్టిన దేశం రుణం తీర్చుకున్నవాళ్ళం ఔతాం.

వేదాంతమంటే ముసలితనంలో నేర్చుకునే విద్య అసలే కాదు. శరీరంలోని అన్ని అంగాలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే, మనస్సు స్ధిరంగా, స్ధిమితంగా ఉంటుంది. అప్పుడే మన శరీరం ఆధ్యాత్మిక సాధనకు చక్కగా సహకరిస్తుంది. మనం తెలుసుకున్న విషయాలు హృదయసీమలో హత్తుకుని చక్కటి ఆచరణకు దోహదం చేస్తుంది. తద్వారా సత్ఫలితాలను సాధించడానికి చక్కగా సహకరిస్తుంది.

వేదాంతసారమును సంక్షిప్తముగ చెప్పాలనిన “అజ్ఞానిగ ఉండిన జీవుడు – సుజ్ఞానిగ నిలిచిన దేవుడు. భ్రమలో ఉండిన జీవుడు – భ్రమలుడిగిన దేవుడు. సాకారుడైన జీవుడు – నిరాకారుడైన దేవుడు. శరీరభావన గలవాడైన జీవుడు – అశరీరాత్మ భావన గలవాడైన భగవంతుడు. సంకుచిత పరిధిలో జీవుడు – సర్వాత్మ స్ధితిలో దేవుడు. వ్యష్టిగ ఆలోచించిన జీవుడు – సర్వ సమిష్టి భావముతో దేవుడు. పలికినంతసేపు జీవుడు – పలుకులేనివాడే దేవుడు. పూనక శిగములు ఊగినంతకాలం జీవుడు – ఊరకుండిన (అచలం) దేవుడు. చూచినంతకాలం జీవుడు – చూడబడేవాడు దేవుడు. చపల చిత్తుడు జీవుడు – స్ధితప్రజ్ఞుడు దేవుడు. మాయాలోలుడు జీవుడు-మాయాతీతుడు దేవుడు. ఖండ దృష్టిలో జీవుడు – అఖండ దృష్టిలో దేవుడు. ద్వైత దృష్టి లో జీవుడు – అద్వైత స్ధితిలో దేవుడు. కావున మనం ఏ అంతస్తులో ఉన్నామో తెలుసుకోవాలి.

వేదములయొక్క అంతమును “వేదాంతము” అందురు. ఇది ఆధ్యాత్మిక రంగంలో జ్ఞాన కాండ. యజ్ఞ, యాగ, క్రతు కర్మలన్నియూ చిత్తశుద్ధికి తోడ్పడి, ఆధ్యాత్మిక స్ధితికి చేర్చే సోపానములు మాత్రమే. సమస్త యుగజగంబులు, సర్వలోకములు, సమస్త భక్తులు, సమస్త ముక్తులు, సమస్త శక్తులు, సమస్త ప్రాణులు, సమస్త దేవులు, సమస్త కాలములు, సృష్టి, స్ధితి, లయ, పరమాణువు మొదలు పరమేశ్వర పర్యంతం సర్వ సమిష్టిగ గాంచినపుడే “నేను” బోధపడగలదు. తెలుసుకో… తలుసుకో… కలుసుకో… ఆత్మ విషయంలో తెలుసుకోవటం, దర్శించటం ద్వైతం. ఆత్మ తానని గ్రహించటం అద్వైతం. తానైన ఆత్మయే సర్వ భూతాంతరాత్మ యనెటి ఆత్మౌపమ్య భావనిష్ట నొందుటయే కేవలాద్వైత పూర్ణ స్ధితి. ఇదియే వేదాంతసారం.

ఒకనాడు వేదములు, ఉపనిషత్తులు, తత్త్వ శాస్త్రము, వాస్తు శాస్త్రము, జ్యోతిష్య శాస్త్రము మున్నగు విద్యలు అతి రహస్యంగా ఉంచబడినవి. కొద్దిమంది వేద పండితులు, విద్వాంసులు, సిద్ధాంతుల గుప్పిట్లో బంధింపబడి, వారు ఏది చెబితే అదే వేదంలా చెలామణి అయ్యేది. కాని నేటి కంప్యూటర్ యుగంలో ప్రతి శాస్త్రము బట్టబయలు గావింపబడినవి. ఒకనాడు మునీశ్వరులు ముక్కుమూసు కొని అడవులలో సంవత్సరాలకొద్ది తపస్సు చేసేవారు. కాని ప్రస్తుతం సమాజంలో చాలామంది ధ్యానం, యోగం, వ్యాయామం లాంటి శరీరక, మానసిక ఆరోగ్యప్రదాలైన కార్యక్రమాలను నిర్వహిస్తూ, అనేక ఆధ్యాత్మిక సాధనలు చేస్తూ ఆత్మోద్ధరణ నిమిత్తం పాటుపడుతున్నారు. మనమూ అదే మార్గంలో పయనించి మన నిజస్ధితిని గ్రహించాలి.

ఒకప్పుడు ఆధ్యాత్మిక మార్గం కొంతమందికే అందుబాటులో ఉండేది. కాని నేడు అధికశాతం ప్రజలు ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకొని, ఆచరించి, ఫలితాలను సాధించాలని తాపత్రయపడుతున్నారు. దేవుడు, జీవుడు, ప్రపంచానికి మధ్య గల సంబంధాన్ని క్షుణ్ణంగా తెలుసుకుంటున్నారు. మానవ సేవయే మాధవ సేవ యని గ్రహించి మనిషిలో దైవాన్ని దర్శిస్తున్నారు. ఫ్రతినిత్యం ప్రాత:కాలంలో కొన్ని టి.వి. చానళ్ళు, మరియు సంస్కృతి చానల్ రోజంతా ఆధ్యాత్మిక గురువుల, స్వామీజీల, ఆధ్యాత్మికవేత్తల బోధనలను, దివ్య సందేశములను ప్రసారం చేస్తున్నాయి. నేటికాలంలో దాదాపుగా అన్ని వార్తాపత్రికలు ఆధ్యాత్మిక విషయాలపై విస్తృతమైన సమాచారాన్ని, సమగ్రమైన సందేశాలను అందజేస్తు న్నాయి.

ఆత్మపరిజ్ఞానముపై అభిరుచిగల చాలామంది జిజ్ఞాసువులు వివిధ సాధనా ప్రక్రియలద్వారా ఆత్మదర్శనం చేసుకొని నేను పాంచభౌతిక దేహమును కాదు, సాక్షాత్తు దైవ స్వరూపుడను అనే స్ధితికి రావడం నిజంగా సంతోషించదగ్గ శుభపరిణామం అని చెప్పవచ్చు. వ్యక్తులు, సంస్థలు ఎవరికి వీలున్నపరిధిలో వారు ఆధ్యాత్మిక శిక్షణలనిస్తున్నారు. తమ అధ్యాత్మిక సాధనానుభవాలను గ్రంధరూపంలో ప్రచురించి అనేకమంది జిజ్ఞాసులకు అందజేసి ఆత్మోధరణకై అహర్నిషలు కృషిచేస్తున్నారు. మనవంతు సాధన మనమూ చేసి, ఆత్మ సాక్షాత్కారాన్ని పొంది పరమాత్మలో లీనమౌదాం.

నాగులవంచ వసంత రావు, సచివాలయం.

Sunday, June 22, 2008

దైవ అనుభూతి

సత్యాన్వేషణ బయటలేదు. అది నీతో నీలోనే తెలియబడాలి. సత్యాణ్వేషణ నిమిత్తం అరణ్యములు తిరగటం, కొండగుహలలో పడియుండటం అవసరంలేదు. ప్రతిదినము వీలున్నంత సమయంలో ఆత్మ విచారణ సలుపవలయును. ఇక కర్మ క్షేత్రంలో ఏ ఆటంకములు, విఘ్నములు ఏమి చేయలేవు. క్రమంగ సర్వత్ర ఆత్మానుభూతి సిద్ధిస్తుంది. ఈ దశలో అంతయు యోగశక్తిగ మీ పనులు సాగిపో గలవు. అడవులపాలై తిరిగినంత మాత్రమున లాభంలేదు. మిధ్యా నేనును, సైతాన్ భ్రాంతిని వదలాలి. ఇది అసలైన సన్యాసం, పరివ్రాజక స్ధితి. ముందుగ నిన్ను నీవు సన్యసించుకో. నిన్ను విసర్జించిన అసలైన నేను శేషిస్తుంది. ఆ నేనే సర్వలోకములకు వెలుగు. ఇదియే విశ్వగర్భ దైవ నేను. సంకుచిత, పరిమిత నేను అంతర్ధానమైనపుడు ఆత్మ కేంద్రంలో నిజమైన సత్య దైవ నేను వెలుగును. అరణ్య మధ్యంలో యున్నను కల్లోలిగ మనసుకు శాంతిలేదు. ఎటు వ్యవహరించినా శిరస్సును ప్రశాంతంగ ఉంచినచోట ఏకాంతం మానసికా వస్ధ. సర్వకాలాలకు చెందిన సత్యాత్మ స్వరూప స్వభావమే నిజముక్తి. ఇది ఫలానా వారికనే నిబంధనలేదు. మనో పరిపక్వత ననుసరించి ఎవ్వరైనను పొందవీలున్నది. ప్రతివారి చరమ లక్ష్యం ఇది. మోక్షానికి అడ్డు నిలిచే మిధ్యా నేనును తొలగించాలి. మానసిక అభ్యంతరాలు రహితం కావాలి. పరిస్దితుల మార్పుకన్న మనో మార్పు ముఖ్యం. ఈ మారు మనసే ఆత్మదర్శనకారి. ఏ వ్యక్తిగాని బహిర్గతమైన ప్రవర్తనవల్ల హక్కులను పొందలేడు. అతనెంతవరకు సత్యస్వరూపుడో అంతవరకే అతని హక్కులు పరిమితమై యుండును. అతని సత్యానికి కొలబద్ద అతని చైతన్యమే. ఈ చైతన్య స్వాతంత్ర్యము పొందడానికి ప్రతివ్యక్తి తన క్షుధ్ర అహమును విసర్జించాలి. గీతాసారమంతయు ఇందులోనే గలదు.

భారతీయులు భావించి, భాషించే అనంతం అనేది లోన సరకులేని శూన్యం కాదు. అనంతుని ఈ జీవితంలో తెలుసుకోవటమే ముక్తి. అన్నిట, అంతట ఆ విశ్వ విధాత స్వరూప స్వభావమును గుర్తించటమే నిజమైన దృష్టి. శైశవదశ లోని పిల్లలకు నడక నేర్పునట్లు యాత్రలన్నియును సదుద్దేశ్యముతో ఏర్పరుచ బడినవే. ఐనను అవియే సర్వస్వములు కావు. యాత్రలతో ఆగిపోరాదు. భూలొక యాత్రలన్నియును కర్మకాండలోనివే. ఆపై ఉపాసన, జ్ఞాన కాండలు గలవు. త్రికాండముల మీరినపుడే పరిపూర్ణ సిద్ధి. అంతొ ఇంతో గొప్పతనము, మహిమ, ప్రభావం లేనిదే లక్షలమంది యాత్రలు చేయటం ఎందుకని అనేవారుంటారు. అది నిజమేగాని “యద్భావం తద్భవతి” యన్నట్లు ఎవరి భావన ఎట్లుండునో బయట అలాగే కనిపిస్తుంది. అలాగే జరుగుతుంది. యాత్రలు చేయువారు దైవ భావనతో వెళ్ళెదరు. అదే ప్రభావం చూపుతుంది. ఆందరి వ్యక్తుల దైవభావం ఎక్కడ కేంద్రీకరించబడునో అక్కడ అమోఘ ప్రభావం గోచరించును. యాత్రలన్నియును ఒకింత ఆధ్యాత్మిక మార్గ సాధనలేగాని, జన్మ రాహిత్య సిద్ధి తన్ను తా తెలియక ఏ యాత్రలలో లేదు. అలాగని యాత్రలు నిరర్ధక ములు, చేయరాదని కాదు. అవి ప్రాధమిక దర్జాలని తెలియాలి. ఆ అంగడి గోలలు తగ్గించి మౌన ప్రకాశమును దర్శించవలయును. ఈ భూలోకంలోని సర్వమత సంబంధ క్షేత్రములు, యాత్రలన్నియును ‘నేను’ యనెటి కేవలఖండ ‘దైవ నేను’ ఉనికిలోనివేనని తెలియాలి. మీరు చేయు యాత్రలు మీలో పరివర్తన తేవాలి. దుష్ట తలంపులను విసర్జించి దివ్య భావ శక్తి ప్రేరణతో ఇల్లు చేరాలి. అంతేగాని తల నీలాలు ఇచ్చి రాగానే సరిపోదు. చివరకు సంచారముల బందుచేసి నిలుకడపొంది, తానున్న చోటనే ఆత్మ తత్త్వం దర్శించాలి. ఆత్మనిష్ఠ చిక్కిన వానికి వేరే యాత్రలతో పనిలేదు. అన్ని యాత్రలు వారిలోనే దర్శించ గలరు. దైవ భావంతో గాంచినపుడు విగ్రహముగాని, మరెట్టి ప్రతిమగాని పరమాత్మ స్వరూపంగ భాసిల్లుతుంది. దేవుని రాతిగ మార్చుటకన్న, రాతిని దేవునిగ చేయుట మిన్న. ఇదియే భారతీయుల విగ్రహారాధనలోని అమోఘ రహస్యము. ద్రోణాచార్యుని విగ్రహమును సజీవమూర్తియైన ఆచార్యునిగ నిలుపుకొని ఏకలవ్యుడు విలువిద్యలో అర్జునుని మించిపోయాడు. ఇదియే ఆత్మ విశ్వాసములోని బలము. వరములనిచ్చే విశ్వేశ్వరుడు బయటలేడు. మానవుని హృదయాంతరంగమున గలడు. అందులకే హృదయశుద్ధిగలవారు ధన్యులు. వారు దేవుని చూచెదరనెటి క్రీస్తువాణి సత్యము. విద్యార్ధులందరు పాఠశాలలో ఎవరి మేధాశక్తి ననుసరించి వారు చదివినా చివరకు ఐ.ఏ.ఎస్,, ఐ.పి.ఎస్., కోర్సులలో చేరుటకు ప్రతిభయే ప్రధానం కావున చాలామంది తప్పిపోయి ప్రవేశ పరీక్షలోనే ఆగిపోగలరు. అతి మేధా సంపన్నులే పై చదువులకు ఎంపిక కాబడునట్లు యాత్రలెన్ని చేసినను, అతిమానస భూమిక నధిరోహించి మోక్ష సిద్ధికి అర్హులైనవారి సంఖ్య స్వల్పాతి స్వల్పమని విజ్ఞులు గ్రహించాలి. ఊరికే ఉండకుండ అనుభవసిద్ధికై, నేత్రానంద పరవశమునకై యాత్రలు చేయాలి. అందువల్ల దోషంలేదుగాని అంతటితో మా బాధ్యత తీరిందని భ్రమపడరాదు. నిజంగా ఆలోచిస్తే నిన్ను మించిన యాత్రలేదు. అట్టి నీవనగ ఎవరో ఉన్నది ఉన్నట్లుగ తెలుసుకో. సమస్త భగవంతులు నా ఆత్మ స్వరూపులేయనెటి ఈ అతీత భావనిష్ఠను పొందిననాడు అనంతవిశ్వం నీదిగ భాసిల్లుతుంది. అందులకే క్షుధ్ర వ్యక్తిత్వ హద్దులనుమీరి అఖండ భావ సమాధి నిమగ్నులు కావాలి. దర్శనాంతర్ధానములు సముద్రము మీది తరంగముల వంటివి. జీవాత్మకు వినాశం లేదు. శక్తి పూరించబడునది తగ్గేది కాదు. శక్తి నశించదు, చావదు. హెచ్చు తగ్గులు దీనికి లేవు.

సప్త జ్ఞాన భూమికలను అధిరోహించటమే నిజమైన సప్తాహం. ఏడుకొండలపైనున్న సప్తగిరి వాసుడు తిరుమల వేంకటెశ్వర స్వామి దర్శనం. దీనికి మరియొక ఆంతర్యం సహస్రార ప్రవేశం. భేద భావము ఎంతమాత్రం కానరానిదే నిష్కళంక ప్రేమ. ఈ ప్రేమవల్ల ఆత్మ తన పరిధులను దాటి అనంతంవైపు పయనించి, పరిపూర్ణతను సిద్ధించుకుంటుంది. ఇట్టి మహత్తర ప్రేమశీలురకు శరీరధారులమనే దృష్టి అంతరించి, సర్వాంతర్యామితో తమకు అతి సన్నిహితమైన సంబంధముగలదని నిండా గ్రహించగలరు. ప్రతివారు ఈ స్ధితికి ఎదగాలి. ఐక్యత, ఏకత్వము అనెటి భావము మానవ ఆత్మలో సదా ప్రచురితమయ్యే యున్నది. ప్రేమభావంతో ఆత్మయొక్క సత్య స్వరూపాన్ని దర్శించి విపులీకరించ వీలున్నది. మనము ఎవరిని ప్రేమించినప్పటికి వారిలో దర్శించేది ఉన్నత స్ధాయిలో మన ఆత్మయే. ఆత్మ మూలముననే సర్వం విశ్వాసపరిధిలో వర్ధిల్లుచున్నదని తెలియాలి. నీ కుమారుడు నీ ఆత్మయే గనుక ప్రేమించుచున్నావు. మమాత్మా సర్వ భూతాంత రాత్మ. ఈ ప్రేమే కొత్త శక్తిని, అంతర్దృష్టిని, మానసిక సౌందర్యాన్నిస్తుంది. మనసు వ్యాకోచము చెందగలిగినంత మేర సౌందర్యమే నిండుకుంటుంది. నిజముగ ఇతరులతో మనం ఐక్యత పొందటంలోనే పరిపూర్ణమైన ఆనందం గలదు. ఆత్మను తెలుసుకొనుట యే అమరత్వమునకు దారి. మానవుని నిరంతర కృషికి ఇదియే దోహదం చేస్తుంది. ఆత్మ జ్యోతియొక్క సహాయంలేకుండ గమ్యాన్ని చేరుకోవడం అసాధ్యం. శిశువు తల్లిగర్భంలో ఉన్నపుడు తల్లి ప్రాణంతో ప్రాణాన్ని జోడించి జీవించునట్లు జీవాత్మ, పరమాత్మల సంబంధం అంతేనని తెలియాలి.

మానవుని ఆత్మ పరమాత్మతో ఏకత్వమును సాధించినపుడే మానవుడు పరి పూర్ణుడు ఔతాడు. ఇట్టి ఆత్మ పరిజ్ఞానమే ఆతనిని అనంతస్ధితి వైపు నడిపిస్తుంది. అజ్ఞానియైన మానవుడు తన కోర్కెలలో కూరుకుపోయి అట్టి ఊబిలో నుండి బయటికి రాలేకపోవుచున్నాడు. ఇదియే కడు దౌర్భాగ్యము. ఈ దీన, హీన స్ధితినుండి బయటపడుటకే యిన్ని రకముల అర్చన, ఆరాధన, ప్రార్ధనాలయములు కావలసి వచ్చినది. ఎవరి మానసిక స్ధాయి, అభిరుచి ననుసరించి వారి ఆరాధన క్రియలుండును. మానవాత్మ దైవార్పితమైనపుడు తన ద్వారా దైవేచ్చ ధరణిపై క్రీస్తువలె నెరవేరుతుంది. శ్రీరామచంద్రుడు తాను బోధించిన ఆత్మజ్ఞానము ఆంజనేయునిలో ఎంతవరకు సఫలమైనదో గ్రహించనెంచి ప్రశ్నించినపుడు హన్మంతుని సమాధానము: 1. దేహ బుద్ధ్యా దాసోహం 2. జీవ బుద్ధ్యా త్వదంశకం 3. ఆత్మ బుద్ధ్యా త్వమేవాహం. ఇది విని రాముడు సంతసించి నీకిక చెప్పవలసినది ఇంకేమియును లేదనెను. మీలో ఎవరు ఏదశలో ఉన్నారో పరిశీలించుకొని ఆత్మ బుద్ధ్యావతరణ గావించుకో వాలి. సమస్త సాధనల సారం ఇదియే. సర్వం ఆత్మే ఐనపుడు ఇక ఆత్మకు తావేది. నేను ఎక్కడ పుడుతుందో చూడటమే ఆత్మ విచారణ. ఆత్మకు శరీరంలో తావు హృదయం. ఆత్మ హృదయంలో ఉన్నదనుటకన్న హృదయమే ఆత్మయని గ్రహించవలసి యున్నది. హృదయం ప్రకాశిస్తుంది. హృదయమ్నుండి వెలుగు మనసుకు వస్తుంది. హృదయశుద్ధి గలవారు ధన్యులు. వారు దేవుని చూచెదరు. ఈ వాక్యంలోని ఆంతర్యం గ్రహించండి. ఇది ఆత్మ దర్శనమునకు ముక్కుసూటి దారి.

(బాబా సర్వకేంద్రుల స్వహస్త లిఖిత దివ్య భాష్యాల నుండి)
సేకరణ: నాగులవంచ వసంత రావు, సచివాలయం.

Wednesday, June 18, 2008

దైవ నేను

ఆత్మే దేవుడు. నేనున్నాను అనేది భగవంతుడు. ఆత్మను తెలుసుకోవడానికి సులువైన మార్గం ఏమనగా, సకలేంద్రియముల సంచలనాన్ని నిలిపి తాను తానుగ ఉండడమే ఆత్మ విద్య. గాఢ నిద్రలో దేహ స్మృతిలేదు. ఆ స్ధితిలో నీవు నిరాకార చైతన్యమై యున్నావు. తమను నిరాకారంగ భావించలేని వారలు నిరాకారముగ దైవమును ధ్యానించలేరు. పాలలోని వెన్నకు ప్రత్యేక నామరూపములు లేనట్లు సర్వత్ర అంతర్లీనముగనున్న సర్వేశ భగవత్ స్ధితికి నామరూపములు లేవని తెలియాలి. నామ రూపములున్నవాడు దేవుడు కాడు. రూపమున్నపుడే నామము ఏర్పడును. పూర్ణత్వమును పరిచ్చిన్నము చేస్తేనేగాని రూపం ఏర్పడదు. నామ రూపములు కేవలం వ్యవహారికం మాత్రమే.

తలంపులున్నంత కాలం ప్రయత్నం తప్పదు. ఇతర తలంపులను ఎగురజిమ్మిన నేను నేను అంటూ ఆత్మ భాసిల్లటం తధ్యం. దీనిని ఏ పేరుతో పిలిచినా తేడా రాదు. ఎల్లప్పుడు ఏ ప్రయత్నం లేకుండ అందేది జ్ఞానం. ప్రయత్నమే ఉపాసన. జ్ఞానమనునది లక్ష్యం. ఫ్రయత్నములన్నియును ఈ లక్ష్యం యొక్క స్వరూపాలే. ఆత్మ సదా నేను నేను అంటూ ఉంటుంది. అంతరింద్రియ పంచకముగాని, బాహ్యేంద్రియ పంచకముగాని, స్ధూలభూత పంచకముగాని ఆ మహా సత్తా కన్న భిన్నంగాదు. సముద్ర నామముగ సముద్ర జలము అంతట యున్నట్లు అలలుగ కొద్ది భాగము, నురుగుగ కొద్ది భాగము, బుడగగ త్వరలో లయించిపోవునట్లు గ విశ్వ విరాడ్రూప తేజోమయ చేతన సత్తా సదా ఉనికిని పొందును. దేవ, తిర్యగ్మనుష్య, పశు పక్ష్యాదులుగను, జనన మరణములుగను, పాప పుణ్యము లుగను, శుభాశుభములుగను, నామ రూపములుగను, గురు శిష్యులుగను, జీవేశ్వరులుగను, నిత్యానిత్యములుగను తోచుచు ఒకటి శాశ్వతమని, మరొకటి క్షణికమని చెప్పబడుచున్నది.

ఆత్మలేని భగవంతుడుండడు. ఆత్మే దేవుడు. నేను ఆత్మనై యున్నాను. కృష్ణుడు అర్జునునికి జీవుడు దేవునికి వేరుగ బయట ఉండుటకు వీలులేదని బోధించెను. శరీరం, ప్రపంచం, భగవంతుడు సర్వాత్మనుండి ఉద్భవించి అందే లయించుచున్నవి. నేను అనగా శరీర ధ్యాస వచ్చినచో నీవు వేరు, భగవంతుడు వేరు. ఆత్మ జ్ఞానంతో అతడే నీవు. చూచేవాణ్ణి చూడ నేర్వాలి. అప్పుడు సమస్యలన్ని మాయమగును. నాది అన్నపుడు నీవు, శరీరం వేరే అవుతుంది. అలాగే నా శరీరం అన్నపుడు నీవు శరీరం కాదు. నీవు వేరే, శరీరం వేరేయని అర్ధం. నా ఇల్లు అన్నపుడు నేను ఇల్లుకాదు. ఇల్లు నాకు వేరుగ యున్నది. అట్టి నీలో వైకుంఠం, కైలాసం, స్వర్గం, ముక్తి, మోక్షం, బ్రహ్మ, విష్ణు, ఈశ్వరుడు నీలోనివారే. సమస్త లోకాలు భావనలే. వాటికి కర్తవు నేవే. అన్నో కల్పిత సత్యాలు. బహురూపములుగ భాసిల్లుచున్నది ఒకే విశ్వరూపం. ఆ వైకుంఠపురం నీలోనిదే.

చూచే నేనును చూచేవారు ధన్యులు. నేనును (శరీరం) చూస్తూ అసలు ‘నేను’ను విస్మరించరాదు. శరీర భ్రాంతిని వీడి నా ‘నేను’లో విశ్వసించి నిలువాలి. సర్వమత సంబంధ, సమస్త జ్ఞానబోధల సారం ఇందే ఇమిడియున్నది. ‘ఆ నేనే’ సర్వమయం, సర్వప్రియం, సర్వలయం, సర్వాధారం, సర్వాధిష్టానం, సర్వోన్నతం, సర్వ స్వతంత్రం, నిష్క్రియం, నిష్కళంకం, నిత్యపూజ్యం, నిత్యశుద్ధం, నిర్గుణం, నిర్ద్వంద్వం, నిరామయం, నిర్వాణ నిలయం, నిష్ప్రపంచం, కేవలచల పరమాద్వైతం, పరాత్పరం, పరిపూర్ణ పరబ్రహ్మం.

ఎంతటి పామర లౌకిక చిత్తులైనను ఏదో ఒకనాడు సంఘటన, సమస్యల ప్రభావంతో ఆధ్యాత్మిక జీవనమును కోరక తప్పదు. ప్రతి జీవి ఘనీభ వించిన మోక్ష స్వరూపమే. కాల పరిపాకమున ప్రతి పిందె కాయగ, పండుగ మారగలదు. పామర చిత్తులే పూత. ఫరిపక్వ హృదయులే ఫలములు. లేవండి! అలౌకిక దైవరాజ్యమును వెదకండి. అది బయట లేదు. మీలోనేగలదు. ఆత్మ విశ్వాసులై అఖండ దైవ సామ్రాజ్యమును మీలోనే స్వస్వరూపముగ దర్శించనేర్వండి.

సకల చరాచర జీవ సమూహమును, తరులు, గిరులు, నరులు, సురులు అనే తార తమ్యం లోకుండా సమస్త ప్రవక్తలను, సమస్త గురువులను, బోధకులను, సమస్త పీఠాధిపతులను, బాబాలను, స్వాములను, మాతలను, సమస్త దైవావ తారముల ఏకావస్ధలో, ఏకాత్మస్ధితిలో నిలిపి గాంచినపుడే నీ నిజస్వరూ పం బట్టబయలుగ గ్రాహ్యమై అనుభూతి కాగలదు. మనసు చైతన్యమై, పరిపూర్ణమైన బ్రహ్మానుభూతిని చవిచూస్తుంది. ప్రజ్ఞానం బ్రహ్మ. పరిశుద్ధ మానసమే పరమాత్మ స్వరూపం. ఈ దశలో మనసు బ్రహ్మాకారం గ వర్ధిల్లుతుంది. జాగ్రదావస్ధలో సుషుప్తి అనుభవమే సమాధి. నేను అనే అహం మూలంలో అణగిపోయినపుడు ఎంతకాలమైనా ఆత్మయొక్క అవిచ్చిన్న పరిపూర్ణ ఆనందమును అనుభవించవచ్చు. ఆతడు ఏదశలోయున్నను లక్ష్యం నుండి వైదొలగడు.

ఆత్మనుండి ఉద్భవించిన ప్రాణమును తిరిగి అందులో లయపర్చటమే ప్రాణా యామము. నిఘావేసి పరిశీలిస్తుంటే తలంపులన్ని ఎగిరిపోగలవు. పూర్ణశాంతి తప్పక లభ్యమౌతుంది. అదియే నీ స్వరూపం. మనస్సును నిస్సంకల్పముగా ఏకాగ్రపరచుటయే మనోలయ ధ్యానం. అనంత చైతన్య స్రవంతి నీ స్వరూపం. ఈ జ్ఞానం సమస్తం స్పష్టంకాగలదు. శాస్త్రాలను మించినది ప్రత్యక్షానుభవం. నీలో నిన్ను లోతుగ వెళ్ళి తరచి చూచుకో. ఇదియే అసలైన మార్గం. మిధ్యా నేనుతో ఏకత్వం విడనాడవలయును. సంకల్పాల సమూహమే మనస్సు. అన్నియును మిధ్యా నేను తలంపులపై ఆధారపడియున్నవి. అందులకే ఈ నేను యొక్క జన్మస్ధానం అన్వేషిస్తే మిధ్యా అహం తలంపు అంతరించి, అదృశ్యమై నిజమైన నేను నిర్విరామంగ స్వయంప్రకాశమై తేజరిల్లుతుంది. సమస్త ముక్తి మార్గములకు నిలయమిది. నిజమైన నేనే దైవం. ప్రతి నేను దైవ నేను స్వరూపమేనని గ్రహించవలయును.

ఆనందం బయట విషయాలలో లేదు. ఉన్నదని తలంచినా అది క్షణికం. ఆత్మలో నిజమైన ఆనందం గలదు. అందులకే ఆత్మానందులు కండి. బాహ్య విషయాలను స్మరిస్తూ ఉన్నంతకాలం మనసుంటుంది. అందులకే అంతర్దృష్టిని అలవర్చుకొని ఆత్మదర్శనం పొందనేర్వాలి. మనో నిలకడ పొందగనే దీని ఆట ఆగుతుంది. ఇక పాడే పాట నేను నేనే నేనైన సత్య దైవ నేను. ఇది తగ్గేది కాదు. హెచ్చేది కాదు. ఆత్మే హృదయం. ఈ స్ఫురణతో మానవుడు ఉండాలి. హృదయమునుండి వెలుగు మెదడునకు ప్రసరిస్తుంది. ఇదే మనసుకు స్ధానం. ఈ వెలుగు సహాయంతో మనసు ప్రకాశించుచు ప్రపంచమును చూస్తుంది. ఆత్మ ప్రకాశ పరివర్తనతో మనసు పనిచేస్తుంది. మనసు అంతర్ము ఖం కాగానే ఆత్మ తేజం ప్రవాహంగ వెల్లువై ప్రవహిస్తుంది. నేను అనే ప్రధమ సంకల్పమునుండి మనసును వేరుచేసి, దాని మూలమైన ఆత్మలో లయపరచిన మిగిలేది ఆత్మే. అదియే సత్య నేను. బాహ్యాంతర చైతన్యంగ నిలచిన వెలుగే పర:బ్రహ్మం.

విచక్షణ కలిగించే ఆలోచన మనసులోని దీపం. ఈ దీప దర్శనమే పాపనాశనం. పండుగల వెనుకగల కీలక రహస్యం తెలుసుకో. సత్యం సర్వత్ర నిండియున్నది. మానవుడు తన చైతన్యాన్ని విస్తృతపరచుకొని పరిసరాలతో తాదాత్మ్యం పొందుచు తన అంతరంగ శక్తులను విశ్వాంతరంగ శక్తులతో సమన్వయ పరచుకోవాలి. వ్యక్తి తన మనో తేజాన్ని తన కార్యకలాపముల వరకే కేంద్రీకరించు దశలో వ్యక్తికి, విశాల విశ్వానికి మధ్యన అగాధం ఏర్పడుతుంది. ఇది సరియైన ఆలోచనా విధానం కాదు. కేవలం అవగాహనా లోపం మాత్రమే. దీనివలన కృత్రిమమైన ఎడబాటు ఏర్పడుతుంది. విశ్వం లోని మానవుడు పరమ సత్యంగా ఆవిర్భవించాలి. వ్యక్తి శక్తి విశ్వావృత అనంత శక్తితో మిళితమైనపుడు సాధించలేనిది సృష్టిలో ఉండదు. కేవలం శాస్త్ర జ్ఞానంతో సృష్టిని కొలవాలని ప్రయత్నంచేసే మానవునకు, ఆధ్యాత్మిక దృష్టిగల మానవుడు గాంచగల దివ్యదర్శనం కాదు. విశ్వ గురుత్వము వహించిన భారతీయుని దృష్టిలో ఉదయించే సూర్యుడు, వీచే గాలి, పూసే పూలు, ప్రవహించే జలము, ఫలవంతమైన భూమి పవిత్ర అంశాలుగ భాసిల్లును. ఉప్పునీటిలో తేలికగ కరిగిపోవటానికి కారణం అది దాని సహజ స్వరూపము. అలాగే మనసు దాని సహజస్ధితియైన ఆత్మలో లయించగలదు.

బాహ్యాకారమునుబట్టి కాదు విలువ. లోన సరుకు, సత్తా ఉండవలయును. మానవుడు తన అంతర్గత శక్తులను మరిచి పైకి కనిపించే శరీరంవరకే తనదని భావించి ఆ పరిధివరకే మురిసిపోతున్నాడు. అనంత స్వరూపంతో తన అనుబంధాన్ని ఎంతమాత్రం స్ఫురణకు తెచ్చుకోవడం లేదు. అందులకే సాగరమునుండి వేరైన జలబిందువు వలె క్రుళ్ళిపోవలసి వస్తుంది. ఇకనైనా సర్వాత్మ దైవ మహా సాగరంలో గ్రుంకులిడాలి. అదియే మీ సహజస్ధితి. అణువునుండి అనంత పర్యంతం చిన్మయ పరతత్త్వ అంశమే గనుక భిన్నదృష్టి ఏనాడు తగదు. ఏందరో స్ధితప్రజ్ఞులు, అవధూతలు, సర్వసంగ పరిత్యాగులు, సాధువులు, వివేకవంతులు, విజ్ఞానవంతులు, ఉత్సాహవంతులు, నీతికోవిదులు, రాజులు, రారాజులు, ఎంకెన్ని తరహాలవారున్నను మహర్షులకే భారతదేశంలో ప్రధమ పీఠం. ఆత్మానుభూతిపొంది, నిస్వార్ధ చిత్తులై అన్నింటితో తాదాత్మ్యం చెంది, విశ్వజీవనంలో ప్రవేశించినవారే మహర్షులు. సర్వవిధములైన చైతన్యముతో సంబంధముగలిగి ఉండటమే మానవత్వానికి పరమావధి. ఇదియే జీవన్ముక్తి మార్గమని భారతీయుల ప్రగాఢ విశ్వాసము. ఇది అక్షరాల సత్యము.

సర్వ పరిపూర్ణ దైవజ్ఞానికి ప్రత్యేకించి యనకుండ సమస్త ప్రాణులపట్ల పవిత్ర ప్రేమానురాగములు గోచరిస్తాయి. కేవలం ఆలయాలలోనే గాకుండ విశాల విశ్వంలో ఎక్కడ చూచినా అక్కడ పూజార్హమైన వస్తువు గోచరిస్తుంది. పవిత్ర ప్రేమకు అసహ్యమనునది లేదు. నీ శక్తిని దైవ శక్తితో జోడించి చూడు. ఎవడు శాశ్వతుడో, సర్వ పరిపూర్ణుడో, సర్వోన్నతుడో, ఎవని శక్తిచే సూర్యుడు చైతన్యవంతుడై ప్రకాశించు చున్నాడో, ఎవని మూలమున పంచభూతములు, గ్రహమండలములు చలించుచున్నవో అట్టి సర్వకేంద్ర స్వామి నీలో అంతర్యామిగ ఉన్నాడు. ప్రాణవాయువు సర్వాంతర్యామి స్వరూపమే. అందులకే ఈ కాంతి, ఈ ప్రాణము, ఈ సర్వము మన ఆత్మలో అంతర్లీన మై ఉన్నవని ప్రతివారలు భావించవలయును.

(బాబా సర్వకేంద్రుల స్వహస్త లిఖిత దివ్య భాష్యాల నుండి)
సేకరణ: నాగులవంచ వసంత రావు, సచివాలయం.

Tuesday, June 17, 2008

పర్యావరణ పరిరక్షణ

మాట కల్తి మనసు కల్తి
నీరు కల్తి బీరు కల్తి
మానవ ప్రాణంబు నిలిపె
మందులలో మరీ కల్తి

బియ్యంలో రాళ్ళాయె
పాలల్లో నీళ్ళాయె
అన్నంలో సున్నమాయె
అన్నిట అనుకరణలాయె

నీడనిచ్చె చెట్టుగొట్టి
గోడకు దిగ్గొట్టినావు
అడవంతా నరికివేసి
కాలుష్యం బెంచినావు

జనాలుండె ఇళ్ళల్లో
రసాయనాల పొగలాయె
భూగర్భ జలమందున
మందుల వ్వర్ధంబులాయె

భూమాత గుండెల్లో
బోరులెన్నొ గుచ్చి గుచ్చి
జలమంతా లాగినావు
భూకంపం దెచ్చినావు

లెక్కలేని వాహనాలు
ఒక్కసారి రోడ్డునెక్కి
గుప్పు గుప్పుమను పొగలతొ
కాలుష్యం చిమ్ముచుండె

ఉత్తచేతులు ఊపుకుంటు
సరుకులకై సంతకెల్లి
పలు ప్లాస్టిక్ సంచులతో
పరుగులెత్తి ఇంటికొచ్చి
పర్యావరణం పాడుజేసి
పాపం మూటగట్టినావు

నాగులవంచ వసంతరావు, సచివాలయం.

Monday, June 16, 2008

స్వనిష్ఠ

అష్తాదశ పురాణములను, సర్వమత శాస్త్రములను, రామాయణ, భారత, భాగవత గ్రంధములను, వేదోపనిషత్తులను కంఠస్ధం గావించినను స్వనిష్ఠనొందక శాంతిలేదు. తనను తాను తెలియని పఠనలు వ్యర్ధం. నిన్ను నీవు తెలుసుకో! అప్పుడే సమస్తం బోధపడగలదు. నీ నిజస్ధితి యే ఈశ్వరత్వము. వాచా పరిజ్ఞానముతో సరిపెట్టుకొనక దానికి తోడు అనుష్ఠాన వేదాంత భాస్కరులు కావాలి. ఆచరించి చెప్పడమే ఆచార్య ధర్మం. కనిపించే మురికిని సబ్బు నీటిచే శుద్ధిచేయ గలరు. బయటికి కనిపించని మనో మాలిన్య శుద్ధి నిమిత్తం జప, తప, ధ్యాన, నియమ నిష్ఠలు, సాధనలు, శాస్త్రములు వెలసినవి. ఆచరణ సాధ్యమైన శాస్త్ర పరిజ్ఞానము ధన్యము. సమస్త శాస్త్రముల సారాం శము స్వనిష్టయని తెలుసుకోండి. మస్తకశుద్ధికి మించిన పుస్తక పఠన లేదు. చిత్తశుద్ధిని కలిగించలేని శాస్త్రపఠనలు కాల యాపనలు – కంఠశోషణలు. భాహ్యార్చనలను క్రమముగా తగ్గించు కుంటూ మానసిక పూజలో నిలువనేర్వండి. హృదయమందిర ధ్యానము విశిష్టమైనది. చిత్తశుద్ధికి, ఆత్మనిగ్రహమునకు తోడ్పడు వేదవిదిత సత్కర్మలను చేయవలయును. డేహము, ఇంద్రియములు, మనసు ఒకదానికంటె మరియొకటి బలమైనవి మరియు ప్రమాదకారులు. కనిపించే దేహేంద్రియ కర్మలకు కనిపించని చోరుడు మనసు కర్తగ ఉంటుంది. ఇట్టి మనసు కల్మషముగ ఉండిన సర్వం నాశనం కాగలదు.

స్ధితికుదురని ప్రారంభదశలో సాధకులు బాహ్య ప్రపంచమును బాహ్యంగానే ఉంచవలయును. శబ్ధ, స్పర్ష, రూప, రస, గంధ విషయాలను త్యజించగలగాలి. పడవ ఎంతకాలం నీటిలో యున్నను ప్రమాదం లేదు. నీళ్ళు పడవలోనికి ప్రవేశించిన నావ మునిగే ప్రమాదం గలదు. బాహ్య విషయాలను మనసులో నిలుపుకొనిన అంతే. మనోంతర్గత సూక్ష్మ ప్రపంచ వింతలు, అద్భుతములు విచిత్రముగ ఉండును. కాలపరిమితి తీరగనే అద్దె ఇంటిలోనివారిని ఇంటినుండి ఖాళీ చేయించు నట్లు, మనసులో నిలుపుకొనిన దుష్ట సంస్కారములను అలా బయటికి నెట్టాలి. వ్యష్టి మనసు బలం చాలనిచో విశ్వమనో సాగరుడైన విశ్వేశ్వర స్వామిని చేతులు జోడించి శరణుజొచ్చాలి. రాగ ద్వేషములు ఉండిన చిత్తంలో శాంతి నిలువదు కాబట్టి శత్రువును ఇంటినుండి మెడలుపట్టి బయటికి నెట్టునట్లు బాహ్య విషయాలను చిత్తంలోనుండి బయటికి పంపించవలయును. అందులకే సాధనలు, శాస్త్రములు, గురువులు కావలసి వచ్చినది. పరిపూర్ణ స్ధితిలో లోన, బయట అనెటి బాహ్యా భ్యంతరములు మచ్చుకు కూడ నిలువవు. ఈ స్ధితినొందిన వారికి సదా స్వనిష్ఠయే భాసిల్లును. సర్వం స్వస్వరూపముగ వీక్షించగలరు. ఇదియే దివ్యాత్మ దృష్టి. రండి. ఈ దృష్టిని అనుగ్రహించెదను అంటున్నారు బాబా సర్వకేంద్రులు. సమస్త బోధకులు, ప్రవక్తలు, పీఠాధిపతులు, అవతారులు నా మార్గజ్యోతులు, నా ఉద్యమ ప్రతినిధులు అనెటి సర్వకేంద్ర స్వరమును విని, అనుసరించి ధన్యులు కండి.

నాలుగు గోడల మధ్యన ఏ గర్భగుడిలో నన్ను బంధించలేరు. 1. అచంచల ఆత్మవిశ్వాసము 2. పరాభక్తి 3. పవిత్ర ప్రేమ ఈ మూడు పురుల త్రాడుచే నేను అవలీలగ కట్టుబడగలను. ఆకాశములో ఎగురు గాలిపటము దారమును వెనుకకు లాగుచు చేజిక్కించు కొనునట్లు, పైన తెలిపిన త్రిపుటి ఆధారముతో నన్ను మీ హృదయ మందిరములోకి ఆహ్వానపరచుకోండి. దీనికి మించిన జ్ఞాన సాధన లేదు. మీరలు ఎవరు అనే ప్రశ్న నాకనవసరం. భక్తి విశ్వాసములు కోల్పోయి మీ మేధాశక్తి నంతంటిని ప్రయోగించినను నా కృపలేకుండ నేను సంపూర్తిగ గ్రాహ్యంకాను. స్ధూలదృష్టితో మీరు చూచినంతకాలం మీ మధ్యన నేను ఒక సామాన్య వ్యక్తిని. మీ అందరిలో ఒకడను. నాకు నేనుగ ఆలోచిస్తున్నపుడు సర్వాతీత పరాత్పరుడను. సర్వలోకేశ్వర పరమ ప్రభు సార్వభౌముడను. మీతో కలసి ముచ్చటిస్తున్నపుడు, భుజించునపుడు, భజించునపుడు సామాన్య మానవునిగ గోచరిస్తున్నాను. అది మీ అనుభూతి. కాని భువి, దివి, గ్రహరాసులను అధిగమించి, గగనాలను ఆవరించి సర్వ శక్తిర్మయ అనంత శోభతో భాసిల్లు నా రచనలు పఠించునపుడు గుండెలు అవిసిపోగలవు. వర్షించు మేఘ జలమువలె సర్వోన్నత స్ధితినుండి నా బోధామృతము వర్షించబడును.

అనంత విశ్వంలో నన్నుమించిన స్వార్ధపరుడు లేడు. కేవలాద్వైత అచల పరిపూర్ణ సర్వకేంద్ర దైవస్ధితిలో నేనున్నాను. ప్రతి నేను సర్వకేంద్ర దైవ నేను స్వరూపముగ స్వనిష్ట నొందవలయునన్నదే నా స్వార్ధం. ఇట్టి నా స్వార్ధంలో సమస్త పరమార్ధములు ఇమిడియున్నవి. జై బాబా! ప్రతి నీవు నా వారస జ్యోతియే. ప్రతి నేను నా స్వరూప కాంతియే. నేనైన మీరే నా సర్వస్వం. అందులకే నా సర్వస్వమును మీకే అర్పిస్తున్నాను.అంకితం చేస్తున్నాను. ఆందులకై నా రచనల నన్నింటిని వెలుగులోకి తీసుకురండి. బిడ్డా! నానుండి కాదనెటి బెంగ వలదు. సాహసించి నిలువు. సమయం కలసివస్తుంది. భూ దిగంత సర్వలోక పర్యంతం మీ ద్వారా నా దివ్య భాష్యం భాసిల్లుతుంది. అనంతకాలం నాది. సమయము ఆసన్నమైనది. నాకు అత్యంత ప్రీతిపాత్రమైన నా స్వరూప ప్రజ్ఞతో నిలచి పరమపిత రుణం తీర్చుకోండి. ఇదియే నాయొక్క అనుగ్రహ ఆశీస్సులు. చరమ సూత్రం. మరల మరల చెప్పుచున్నాను.గుంపులు గుంపులుగా జనులను ప్రోగుచేసుకొని ప్రసంగములు చేయు అంతస్ధు నాది కాదు. సమస్త జ్ఞాన బోధకులకు సరిపడు అతీత బోధను సార్వకాలం సర్వలోక పర్యంతం చెందునట్లు భూ, జల, విహంగ, సర్వలయ యానములలో పరమ సూత్ర వాక్యములను మీ అందరి నిమిత్తం విరచితము గావించనైనది.

మత్ ప్రియాత్మ జ్యోతులారా! అలనాడు కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుని నిమిత్త మాత్రునిగ చేసుకొని జగద్విఖ్యాత గీతోపదేశము జరిపినట్లుగ నిన్ను నిమిత్త మాత్రునిగ చేసికొని నా స్వహస్తలిఖిత అతీత దివ్య భాష్యమును అఖిలాండ కోటి బ్రహ్మాండ అనంత విశ్వపర్యంతం చెందునట్లు నా రచనల నన్నింటిని నీ స్వాధీనం చేస్తున్నాను. వంటకము నాది - వడ్డన నీది. ఇందునిమిత్తం నాచే నియమితులైన ప్రచారకులు సమయ సందర్భానుసారం నా పేరిట ప్రతినిధులుగ “సర్వకేంద్ర పీఠాధిపతులు” రాగలరు. అనిర్వాచ్య, అజేయశక్తి వారలకు అనుగ్రహించబడును. నన్ను చేరు మార్గం వయా నీవు కావాలి. గాఢంగా నమ్మి చూడు. ఈ స్ధితిలో ఓలలాడించెదను. నా సంకల్పమునకు తిరుగులేదు. నా ఆదేశమునకు ఎదురులేదు. ఉప్పుబొమ్మ నీటిలో లయించినట్లు కర్పూర హారతివలె క్షుద్రహం వీడి సర్వార్పణ యోగీశ్వరుడవు కమ్ము. అట్టి నీవు నీవు కాదు. నేనే ఆ స్ధితిలో ప్రకాశించెదను. సార్వకాలం కేవలం నేనుమాత్రమే ఉంటిని, ఉన్నాను, ఉండెదను.జై బాబా! నమో విశ్వగర్భా! ఫాహిమాం. త్రిమూర్తులు సైతం ఒక పరిధిలోని వారే. సృష్టి, స్ధితి, లయ కారకులైన త్రిమూర్తులు సర్వకేంద్ర, స్వపరాది శక్తిని పొంది వారి విధులను నిర్వహించెదరు. ప్రపంచమును గడగడలాడించు యముడు నా పాద దాసుడు. నన్ను స్మరించు చోట యమదర్శనం ఉండదు.

(బాబా సర్వకేంద్రుల స్వహస్త లిఖిత దివ్య భాష్యాల నుండి)
సేకరణ: నాగులవంచ వసంత రావు, సచివాలయం.

Thursday, June 12, 2008

నేను విచారణ

ఇతరుల గురించి ఆలోచించటం, తెలుసుకోవటం ఎంతైనా కష్టం. మీ గురించి మీరు ఆలోచించనేర్వండి. ఇది సులభ మార్గం. మొదటి ఆలోచన నేను. ప్రగాఢ విచారణచే ఈ నేను ఆత్మలో లీనమై ఆత్మ నేనే ప్రకాశిస్తుంది. ఇదియే జీవన్ముక్తి. నిర్వాణము, పరలోక స్వర్గ రాజ్యం మీలోనే గలదు. బయట వెదకటం భ్రమ మాత్రమే. తన నిజ స్వరూపమైన ఆత్మలో మేల్కొన్నవాడు సచ్చిదానందపూర్ణ మైన ఆత్మను స్వస్వరూపం గా అనుభవిస్తాడు. బాహ్య ఎరుకే మిధ్యా నేను. దీనిని పోగొట్టుకున్నపుడే అసలైన ఆత్మ దేవ నేను దక్కుతుంది. నిజాత్మను పరిపూర్ణముగ గ్రహించినపుడు ఆ మహా అఖండశక్తి తన ఉనికి సత్తానుండి ఆవిర్భవించి శాశ్వతముగ వర్ధిల్లు తుంది. దీనినే బట్టబయలు, ముక్తి, మోక్షం, వైకుంఠం, పరంధామం, పరలోక స్వర్గ రాజ్యం అని రకరకములుగ చెప్పుకొందురు.

ఎవరెన్ని చెప్పినను ఆదిమూల తత్త్వం ఏకం, అవిభాజ్యం. ఆ దివ్య స్వర్గ రాజ్యం నీయందేగలదు. దీనిని నీలో దర్షించిననే తిరిగి బయట ప్రతిఫలిస్తుంది. తన్ను తానెరుంగుట ప్రతి మానవుని ప్రధమ కర్తవ్యం. తనను తాను తెలుసుకోకుండ ఎన్ని తెలుసుకున్నా లాభం లేదు. తాననే ఒక అంకె లేనిచో ప్రక్కనున్న సున్నాలకు విలువ సున్న. ఆ ఒక అంకెను తెలుసుకోవాలన్న రామకృష్ణ పరమహంస వాణి యధార్ధము. లౌకిక భ్రమ లోలురు ఆత్మ విచారణ నుండి ఎంతకాలం తప్పించుకు తిరిగినా చివరకు అదియే శరణ్యం కాక తప్పదు. ప్రతి జీవి ఘనీభవించిన మోక్ష స్వరూపమే. ఆత్మాన్వేషణలో మునుగనంతవరకు సమస్యలు, సందేహాల బాధలు తప్పవు. తనను తాను కనుగొన్నవారికి మహాశక్తులు హస్తగతం కాగలవు. ఈ శక్తులను సద్వినియోగ పరుచనియెడల భ్రష్టులయ్యెదరు. మీ ముందు మహామహులమని విర్రవీగే వారిలో కొందరు ఈ అధమ స్ధాయికి దిగజారి పోయారు. జనులచే దేవుడనిపించు కోవచ్చు. అది సరిపోదు. ఈ లోకంలో ఉన్నత స్ధానానికి ఎదిగిన తరువాత క్షుధ్రహం లోలురై ఎవరెక్కడ పతనపడుచున్నారో సులభం గా గ్రహించవచ్చు.

ఉన్నది అంతా ఒకే చిన్మయ చైతన్య అఖండ సత్తు. ఈ స్ధితిలో చూచేది ఎవరు ? చూడబడునది ఏమిటి ? అవి రెండు మిధ్య. ఉన్నదే ఉన్నది. ఉన్న దంతయు అదే తనకు తానైన స్వత:స్సిద్ధ దైవం. దేహేంద్రియ మనో బుద్ధులతో తాదాత్మ్యం చెందిన నేనుకు ఈ సర్వాంతర తత్త్వం తెలియదు. వ్యక్తి గత నేను సత్యాత్మ దైవమునుండి మరల మరల పుడుతూ అందులోనే లయిస్తుంది. ఎవరెటు తిరిగినా మరల నేను వద్దకు రావలసిందే. ఆ నేనెవరో నిశ్చయించి తెలుసుకో! ఈ లోకంలో అందరు అజ్ఞానాంధకార కఠిన కారాగార శిక్షను అనుభవిస్తున్నారు. కేవలం ఆత్మ జ్ఞానమే కారా గార విముక్తికి మార్గం. మనసు బహిర్ముఖమైన అజ్ఞానం. అంతర్ముఖమైన జ్ఞానం. లోచూపువల్లనే సహజాత్మ దర్శన భాగ్యం. నేనెవరో గ్రహించిన మాయసంగతి బయటపడుతుంది. కనిపించేదంతయు నేనులో అదృశ్యమై తీరుతుంది. అందులకే అది అశాశ్వతం. ఆత్మ కనబడునది కాదు. అదృశ్యమయ్యెడిది కాదు. అందులకే ఈ ఆత్మదర్శనాన్ని శాశ్వతం చేసుకోవాలి. నిజమైన దైవ నేను మిధ్యా నేనును తొలగించి ఆత్మనేనుగ మిగులుతుంది. విజ్ఞానమయ కోశం నుండి మిధ్యా నేను పుడుతుంది. ఈ నేనుతోనే నిజమైన నేను ఆత్మను గ్రహించాలి. ముల్లును మరియొక ముల్లుతో తీసి రెంటిని పారవేయునట్లుగ ఎరుకద్వారా శుద్ధ ఎరుకనెరింగి ఆ రెంటిని మానుటయే పరిపూర్ణ దైవత్వం. నేను అనే ప్రధమ తలంపు పైననే మనో సంకల్పములన్నియును నిలువగలవు. ఈ ప్రధమ తలంపే లేని పక్షంలో మిగతా సంకల్పములకు తావులేదు. నేను తెలిసిన తర్వాతనే ఇతరం తెలిసినది. ఈ నేను మూలమైన ఆత్మలో అదృశ్యమైనపుడు, లయించినపుడు సిద్ధించేదే ఆత్మ సాక్షాత్కారం. ఇదే నిజమైన నేను. మానసిక తలంపులకు ఆధారమైన బహిర్గత నేనును విసర్జించిన అంతర్గత నేను నిన్ను ఆవహిస్తుంది. ఈ నేనే నిజమైన ఆత్మ. ఇదే పరమాత్మ. ఆది మద్యాంతం లేనిదిది. ఏకాగ్రమైన దృష్టితో నేను శరీరంలో ఎక్కడ పుడుతుందో చూడు. హృదయావిష్టుడైన నీవు పరిపూర్ణ సచ్చిదానందమును నీ స్వరూపముగ అనుభవిస్తావు.

ఉన్నదంతయు చిన్మయ సత్తు. ఇది ఆత్మ లక్షణము. నేనున్నాననెటి భావనయే సర్వేశ్వరుని మొదటి నామము. వాస్తవముగ చెప్పాలనిన భగవంతుడే ఆత్మ. నిశ్చలమైన ఏకాగ్రపూరిత అంతర్గత విచారణచే దప్ప ఎన్ని ప్రదేశాలు, దేశాలు తిరిగినా ఆత్మజ్ఞానము సిద్ధించదు. సర్వ శక్తులతో మనసును ఆత్మాభిముఖం చేయాలి. ఇదే ఆత్మ విచారణ. అంతటగల ఆత్మను అనుభవపూర్వకంగ గ్రహించాల్సిందేగాని ఉత్తమాటలు పొసగవు. ఉప్పునీటిలోని ఉప్పు కంటికి కనిపించదు. నాలుక ద్వారా తెలుస్తుంది. ఆత్మజ్ఞానము అంతే. నేనును విచారించటమనిన అహం వృత్తిని విచారించటం. ఈ విచారణను ముందుగ మనసుతోనే ఆరంభించాలి. మనసును అంతర్ముఖపరచి విపరీతంగ శతృసైన్యమువలె దూసుకువస్తున్న తలంపులను నిరోధిస్తూ హృదయస్ధానాన్ని గుర్తించాలి. మనసు హృదయంలో లీనంకాగానే నిశ్చలానందం కలుగుతుంది. ఈ ఏకావస్ధలో పరిపూర్ణ జ్ఞానం అవిచ్చిన్నంగా ప్రకాశిస్తుంది. నామ రూప జగతి ఎన్నిసార్లు వచ్చి పోయినను, విశ్వ ప్రకృతి ఎన్నిమార్పులు చెందుచున్నను తదధిష్ఠాన సత్తు మాత్రం మారదు. సర్వమునకు ఆధారభూతమైయున్న అఖండ చైతన్యం ఏనాడు నశించేది కాదు. అది సదా నిర్వికారం. సినిమా థేయేటర్ లో ఎన్ని ఆటలు మారినా అన్ని ఆటలు ప్రదర్శింపబడే వెండితెర మాత్రం మారదు. సర్వాధిష్ఠాన పర:బ్రహ్మ సూత్రము అంతేనని గ్రహించాలి. ఓ మానవా! నీకు అద్భుత శరీరం ప్రసాదించబడింది. జ్ఞాన సాధన సత్కర్మలకు వీలుపడునట్లు చూసుకో. ఈ శరీర కూర్పుకు ఎవరు కర్తయో చక్కగ తెలుసుకో. ఏ చేర్పులు, మార్పులు లేని చిన్మయ స్ధితిని చేరుకో. ఈ విశ్వంలో ఏ పదార్ధం కూడ దైవమునకు భిన్నంగ లేదు. సర్వేశ్వర స్వామి ఒక కాలానికి, ఒక ప్రదేశానికి కట్టుబడిలేడు. ఆయన అంతట, అన్నివేళలా ఏకరీతిగ యున్నాడు. ఇట్టి అక్షర పర:బ్రహ్మమునకు అన్యముగ ఏమియును లేదని రూఢిపరచుకోవటమే నిజమైన స్ధితప్రజ్ఞ పదవి.

తాననువాడు ఒకడున్నాడు. తన్ను వదలినపుడే తన పరిచయం కాగలదు. తన్ను వీడి తాను నిలుచు తత్త్వమే నిత్యం. మిధ్యా నేనును విసర్జించటమే తన్ను వదలటం. తత్త్వమసి. వ్యక్తుల మానసిక కర్మయే పుట్టుకలకు మూలం. ఆత్మ అజం, అమరం. చావు పుట్టుకలు పరమార్ధంలో లేవు. అందులకే పరమార్ధ కోర్సులో ప్రవేశించండి. అగ్ని సెగలో మూకుడులో వేపుడు చేయబడిన గింజలు భూమిలో విత్తి తగిన జల సదుపా యం కలిగించినను మొలకెత్తవు. కారణం ఏమనగా బీజాంకురములు నశించినవి. అలాగే జన్మ కారణోపాది కారణ శరీరము దగ్ధము కానంతవరకు పునరపి జననం, పునరపి మరణం తధ్యం. నేనులేని స్ధానంలేదు. నేనులేని వస్తువు లేదు. నేనులేని జగము లేదు. నేను లేని జీవము లేదు. నేనులేని దైవం లేదు. నేనులేని ఏ నేను లేదు. సమస్త నేనులకు నేనే సర్వాధారం. అట్టి నన్ను తెలుసుకొనుటయే సమస్త మత ధర్మముల, సమస్త వేదాంత యోగసూత్రముల, సమస్త జ్ఞాన యజ్ఞముల ఫలితం. నన్ను మరిచి ఎన్ని గ్రహించినా సర్వం అధోగతియే. నాతో ఈ సమస్తం ఏకీభవించి నాయందే లీనమైయున్నది గాన నేనే సర్వమునకు మూలం. మనో జగత్తులకు తేడాలేదు. జగము మనోకల్పితము.
మనో అవగాహన లేకుండ ప్రపంచ అవగాహన కుదరదు. ఆత్మజ్ఞానం లేని ప్రపంచ జ్ఞానం వ్యర్ధం. నీవు ఎక్కడినుండి ఉద్భవిస్తున్నావో ప్రపంచం, వివిధ వస్తుజాలము అక్కడినుండే జనిస్తుంది. సర్వైక్య కూడలి కర్తను తెలుసుకో. నేను పుట్టాను అని భావించే ప్రతివారికి చనిపోయిన పిదప ఏమి జరుగుతుందో అనే సందేహం రాగలదు. నేను అను తలంపు ఎక్కడ పుడుతుందో తెలుసుకో. ఇది సర్వరోగ నివారక సంజీవి. జన్మకు మూలమైన “అహం”ను పోగొట్టుకొనిన శరీరమనెటి పునర్జన్మ రాదు. కారణోపాది దగ్ధం ఐనపుడే జన్మరాహిత్యం. ఇట్టివారే నిజమైన కారణము పొందినట్లు. స్ధితికుదురని గురువులు ఇచ్చట పడిపోవుచున్నారు.

నీ శరీరం నిద్రించిన పడకపై ఉంటుంది. కాని స్వప్నంలో అదే శరీరంతో ఒకచోట సంభాషించు చున్నట్లు, మరియొక చోట విందులో పాల్గొనినట్లు వారి వారి చిత్త ప్రవృత్తి ననుసరించి స్వప్నములుండు. స్ధూల శరీరం నీదైన, నీవైన స్వప్నావస్ధలోని సూక్ష్మ శరీరం ప్రమాదకారి. దానిని నశింపజేయాలి. పైపై తతంగములచే ఇది అసాధ్యం. ఇక్కడే చాలామంది తికమక పడిపోవుచున్నారు. నేను అనే తలంపు లేకుండ శరీరం నశించగానే సరిపోదు. పూర్వ సంస్కారములతో, వాసనలతో వాయువు పుష్పముల వాసనను దూరముగ తీసికొని పోవునట్లుగ మిధ్యా నేను మరల జన్మిస్తుంది. సంకల్పానికి మూలమైన ఆత్మలో చేర్చి, నేనెవడను అనెటి ప్రగాఢ విచారణచేత ఇది సాధ్యమగును. నేను చేస్తున్నాననెటి కర్తృత్వభావన వీడి సర్వేశ్వరుని చేతిలోని ఉపకరణముగ తనను భావించి, ఉచ్చ, నీచముల పాటించక , అందరిలొ ఉన్న ఈశ్వరుని దర్శించువారు, ఈశ్వరారాధకులు, సంఘసేవ చేయువారు ధన్యులు. ఆత్మ జ్ఞానమును మించిన సంఘసేవ లేదు. వసుదైక కుటుంబ భావమే ఆత్మ జ్ఞానార్హత.

మత సిద్ధాంతములన్నియును ఆత్మదర్శనంతో ముగిసిపోగలవు. ఈ దేహంతో ఉన్నపుడే సత్యాత్మ దృష్టిని స్ధిరపరచుకోవాలి. దేహాభిమానం ఉన్నంతకాలం మృత్యుభయం వెంటాడుతుంది. నిద్రను హాయిగ కోరుకొనునట్లు మృత్యువును ఆహ్వానించాలి. సర్వ స్వతంత్రమైన సత్యాత్మ జ్ఞాని దేహ మరణానంతరం సైతం స్వత:స్సిద్ధముగ ఉంటాడు. ఇదియే సరియైన స్ధితి.
నీ లోపలికి లోతుగ మినిగి తరచి చూడు. నీలో నిక్షిప్తముగ దాగియున్న అతి రహస్యమైన, మనోహరమైన, శుభప్రదమైన, ఆనంద దాయకమైన, అనశ్వరమైన ఆత్మజ్ఞాన నిధులను గుర్తించి స్వంతం చేసుకో. హృదయ కవాటాన్ని తెరచుకో. మనోనేత్రంతో ప్రపంచాన్ని గాంచు. మాయ తెరను చేధించు. ఆత్మను దర్శించు. ఇదియే సత్య భగవన్ మార్గము. శక్తునికన్యధా శక్తిలేదు. అద్వైతులు చెప్పే మాయను విశిష్టాద్వైతులు మారే స్వభావంగలది అన్నారు. ఏమార్పులు, చేర్పులు లేకుండ సర్వాధారముగ, సర్వాకారముగనున్న శాశ్వత సత్యమును గ్రహించాలి. ఇదియే పరమార్ధం. ద్వైత, అద్వైత, విశిష్టా ద్వైత సమస్త పీఠ సాంప్రదాయములు, మూల సిద్ధాంతములు చిన్మయ పరమార్ధ సాగరంలో నదులుగ కలిసిపోగలవు.

(బాబా సర్వకేంద్రుల స్వహస్త లిఖిత దివ్య భాష్యాల నుండి)
సేకరణ: నాగులవంచ వసంత రావు, సచివాలయం.

Sunday, June 8, 2008

స్వస్వరూపం

అజ్ఞాని, ఆత్మజ్ఞాని ఉభయులు సృష్టిని చూస్తున్నారు. అజ్ఞాని దృష్టిలో తనకు భిన్నముగ ప్రపంచము కనిపిస్తుంది. ఆత్మజ్ఞాని దృష్టిలో ప్రపంచము తనకు వేరుగ గోచరించదు. దీనినిబట్టి తేడాలు దృష్టిలో గలవేగాని సృష్టిలో మాత్రం కాదని తెలుస్తుంది. దృష్టిని బట్టియే సృష్టి గోచరిస్తుంది. దృష్టిని జ్ఞానమయం చేసుకుంటే విశాల విశ్వం ఆత్మ స్వరూపముగా విరాజిల్లుతుంది. చూచేవానికే సృష్టి. ఆ చూచేవానిని చూడనేర్చుకోవాలి. ప్రపంచం ఆత్మగ సత్యం. ఈ విశ్వమంతయు మహా వెలుగునుండి, శబ్ధమునుండి జనిస్తుందని భౌతిక శాస్త్రజ్ఞుల సిద్ధాంతము. ఈ విశ్వంలో ఏపదార్ధము కూడ చిన్మయ చైతన్య శక్తికి భిన్నంగా లేదు.

దివ్య ప్రకాశమే వెలుగు. దేవుడు లోకమునకు వెలుగై యున్నాడు. వెలుగు సంబంధులై మెలగనేర్వాలి. ఆదియందుగల శబ్ధమే ప్రణవం. త్రిమూర్త్యాత్మక ప్రణవ స్వరూపమే ప్రపంచం. కొందరు ఆదియందు వాక్యము పుట్టెను అంటారు. శబ్ధ సముదాయమే వాక్యం. వాక్య సముదాయమే వ్యాసం. వ్యాసముల సమాహారమే విశ్వం. అజ్ఞాన బంధితులై మిధ్యా నేనుతో వ్యవహరించిన దయ్యాలు కాగలరు. సుజ్ఞాన పరిధిలో సత్య నేనుతో వ్యవహరించిన దైవాలు ఔతారు. ప్రతి ప్రాణి సహజ పరిపూర్ణ దివ్యస్ధితిని పొందు పర్యంతం, సాగరైక్యంగోరు నదిని అనుసరించవలయును. మనమందరం అఖండ సచ్చిదానంద సర్వేశ్వర స్వామి స్వరూపులమేగాని వేరు ఎంతమాత్రం కాదు.

సృష్టిలో అణువునుండి ఆకాశ నక్షత్ర పర్యంతం, జీవాణువునుండి పరమాత్మ వరకు, ఆదిభౌతిక, ఆదిదైవిక, ఆధ్యాత్మిక లోకాలకు, జాగ్రత్, స్వప్న, సుషుప్తి మూడు అవస్ధలలోను ఉన్న వస్తువులు ఆయా లోకాల్లోని, ఆయా స్ధితులలోని ద్రవ్యంలో నిర్మాణం ఐనవి. ఈ వివిధ ద్రవ్య రూపాలన్నింటికి మూలమైన నియతి ఒకే ఒకటి. అదియే “సత్”. ఉండేది ఈ ఒక్కటే. నామ రూపాలు మిధ్య. సర్వ పరిపూర్ణముగ ఉన్నది ఒక్కటే. రెండవది లేదుగాన సామ్యం పొసగదు. పోల్చటం కుదరదు. ఏకైక చిన్మయ చైతన్య “సత్” అప్రమేయమై, అమోఘమై, అనంతమై, సమస్త నామ రూపాలకు ఆధారమై, మణులందు సూత్రమువలె సర్వత్ర, సర్వసాక్షి రూపమున సూత్రాత్మగా భాసిల్లుచున్నది. ఇదే భగవంతం. అన్నింటికి ఐక్యతను పొందజేసే అంశమే ఈ అఖండ “సత్”. అందరూ సత్ స్వరూపులే. ఈ సత్తే పరమ శివం.

సృష్టిలో సర్వత్ర ఏకత్వమే గోచరిస్తుందనిన అన్ని వస్తువులు ఒక్కటియని కాదు. ఒకే పదార్ధ నిర్మితములని భావం. మట్టితో వివిధ రకముల పాత్రలు, బంగారంతో వివిధ రకములౌ ఆభరణములు తయారు చేసినను మన్ను, బంగారం ఒక్కటే కదా! అలాగే నామ, రూప సృష్టి గతించినను మూలమైన సత్ ఏనాడు నశించదని తెలుసుకోవాలి. మానవుడు, దేవుడు, అణువు, మహత్తు ఇవి వ్యవహారంలో భిన్నంగా కంపించినా తత్వత: అవి పూర్ణములే. పరిపూర్ణతయే వీటి లక్షణము. ఉన్నదంతా కేవల సచ్చిదానంద పర:బ్రహ్మ పదార్ధమే. ఈ స్ధితిలో చిన్నా, పెద్దా తారతమ్యం లేదు. అంతా, అన్నీ పర:బ్రహ్మమే. ఇతరం ఎంతమాత్రం లేదు.

ఈ సృష్టిలో నిర్జీవ పదార్ధం ఏదియునులేదు. ప్రతి పరమాణువు కూడా జీవకళతో ఉట్టిపడుతుంది. ఇలాగే సూక్ష్మ లోకాల్లో, అన్ని అంతస్తుల్లో ఉండే ప్రతి సూక్ష్మ అణువు జీవంతో నిండియున్నది. సర్వం సజీవమయం ప్రోక్తం. విద్యుత్ శక్తి ఒకటే ఐనను ధనము, రుణము, పాజిటివ్, నెగెటివ్ అని రెండుగా వ్యక్తమౌతుంది. అలాగే ఉన్నదంతా ఒకే పదార్ధమైన సర్వ్వాది మూలకారణ చైతన్య సత్. చైతన్యం, పదార్ధం అని రెండుగా వ్యక్తమౌతుంది. చిన్మయ పర:బ్రహ్మ సత్ అద్వితీయం, అప్రమేయం, అనంతం. అన్ని రూపాలలో ఇది పూర్ణంగా వెలసియున్నది. అన్ని రూపాలు దీని రూపాలే. ఒక్కమాటలో చెప్పాలనిన ద్వైతం అనేది లేనేలేదు. ఉన్నదంతా కేవలద్వైత, అచల, పరిపూర్ణ పర:బ్రహ్మమే. ఈ నామ, రూపాలతో కనిపించే సృష్టికి పూర్వం ఉన్నది ఒకటే ఒకటి. ఇది అనంతం. సర్వాది మూలకారణం. కారణం వేరు. మూల కారణం వేరు. ఈ అఖండ మూల తత్వమే భూత, భవిష్యత్, వర్తమాన కాలాలకు మూలం. ఇది నిత్య శుద్ధం. నిర్గుణం, నిర్వికారం, నిర్విచేష్టం. దీనికి, కనిపించే ప్రపంచానికి ఎలాంటి సంబంధం లేదు. దీనినే సత్, అస్తి అనవచ్చు.

ప్రతి ప్రాణి పరిణామ దశనుండి నిర్వికార శాశ్వత దైవస్ధితిలో ఎన్ని మన్వంతర కాలాలకైనను స్వస్వరూప ప్రజ్ఞతో స్వచైతన్యమెరింగి సర్వేశ్వర స్వామి స్వరూపంగా నిలువక తప్పదు. ఇది నిశ్చయం. ప్రతివారలు ఎంతకాలానికైనను దివ్య మానవ స్ధితిని పొందక తప్పదు. మహాగ్నిగుండం నుండి వెలువడిన అగ్నికణముల వంటివారు జీవులు. విశ్వాత్మలోగల అన్ని లక్షణాలు విస్ఫులింగమైన జీవునిలో గలవు. ఈ జీవాత్మలన్నియును క్రమముగా పరిణామదశ నొందుచు ఏదొ ఒకనాడు శాశ్వత ఆత్మ స్ధితిలో విలీనం కాకతప్పదు. మానవుడు తన నిజస్ధితిని పొందు పర్యంతం విశ్రమించరాదు. ఇది సకల ధర్మముల సారాంశము. సృష్టి సర్వస్వం పరమ సత్యముయొక్క బాహ్య స్వరూపమే ఐనను దాని వ్యక్త రూపం తాత్కాలికము కావున భ్రమ, భ్రాంతి, మాయ, సైతాన్, ఎరుక అన్నారు. అంతరంగ పరిణామ ప్రక్రియలను హస్తగతం చేసుకొనిన వారలే గుప్త సంకేతాలను గుర్తించి బహిర్గతం చేయగల సమర్ధులు. భౌతిక శాస్త్రజ్ఞులకు అంతుచిక్కనంత మాత్రాన సనాతన శాశ్వత పరమార్ధ సిద్ధాంతం మారదు, మరుగుపడదు. కేవలం తపోసంపన్నులైన, జ్ఞాన నిష్టులైన మహర్షులు తమ స్ధూల, సూక్ష్మ, కారణ, మానసిక, ఆధ్యాత్మిక శరీరాలను శక్తివంచన లేకుండ పరిశుద్ధపరచు కొనినందుననే అట్టివారలకు మాత్రమే బ్రహ్మాండ జగన్నిర్మాణ రహస్యములు బోధపడగలవు. యోగవిద్యా సంపన్నులకే సృష్టి రహస్యం గ్రాహ్యం కాగలదు.

ఏది ఈ సమస్తమును తనయందు ఇముడ్చుకొని సర్వోన్నతముగ ఉన్నదో అదియే సర్వకేంద్రం అని గ్రహించాలి. ఇది విశ్వమంతట ప్రతి అణువులోను నిక్షిప్తమై యున్నది. జీవరాసులన్నింటికి దేనికి తగినంత ప్రజ్ఞ దానికి గలదు. మానవ మేధస్సు అతిమానస భూమిక నధిరోహించిననే చిన్మయ పరతత్వం బోధపడుతుంది. టేప్ రికార్డ్ చేయు క్యాసెట్ లో మాటలు, పాటలు, వివిధ రాగాలు, ద్వనులు నిక్షిప్తమై ఉన్నట్లుగ, జరిగిపోయిన, జరుగుచున్న విషయాలన్ని సూక్ష్మాకాశ క్యాసెట్ లో టేప్ చేయబడి ఉండును. సూక్ష్మాకాశ పత్రముపై ముద్రింపబడి యుండును. ఇవి విశ్వంలో సూక్ష్మాతి సూక్ష్మంగ చోటుచేసుకొని యుండును. యోగ విద్యలో నిష్ణాతులైన ప్రసిద్ధ పురుషులు వారి ఆధ్యాత్మిక శక్తిచే సూక్ష్మాకాశంలో ముద్రితమైన విషయాలను గ్రహించి శ్రీమద్ విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామివలె కాలజ్ఞాన చరిత్రలను రచించగలరు. యోగ విద్యా ప్రావీణ్యులు తలంచినంతనే శరీర ధ్యాసను వీడి తురీయ స్ధితికి చేరగలరు. స్వశక్తితో సమాధి అవస్ధను పొందగలరు. యోగ విద్యాభ్యా సముచే ప్రకృతిని సులభముగా స్వాధీన పరచుకొనవచ్చును. దీనిచే సర్వ వ్యాపి, సర్వశక్తి సమన్వితుడైన అనంతాత్మను తెలుసుకోవచ్చు.

(బాబా సర్వకేంద్రుల స్వహస్త లిఖిత దివ్య భాష్యాల నుండి)
సేకరణ: నాగులవంచ వసంత రావు, సచివాలయం.

అమృత సిద్ధి

మానవుడు త్రిమూర్తులుగ ఉండును. 1.స్ధూల శరీరము. 2. సూక్ష్మ శరీరము 3. అమృతత్వ స్ధితి (మోక్ష శరీరము). ప్రకృతి సైతం ఇలాగే మూడు రూపాలతో ప్రకటితమగును. 1. ఇంద్రియములకు గోచరమయ్యేది స్ధూల ప్రకృతి 2. ఇంద్రియాలకు అతీతమైనది సూక్ష్మ ప్రకృతి (అంతర్గతం, అత్యంత శక్తివంతం 3. స్ధూల, సూక్ష్మ ప్రకృతులకు అతీతమైనది మూల పరా ప్రకృతి. ఇది నిత్యం, శాశ్వతం, అచలం, స్ధిరం, సృష్టిలోని అన్ని శక్తులకు మూలాధారం. దీనికి మార్పుగాని, నాశనంగాని ఏనాడులేదు. దీనినే ఆది పరాశక్తి యందురు.

భగవత్ సన్నిధిలో భక్తులుగ, సద్గురు సన్నిధిలో శిష్యులుగ, పెద్దల సన్నిధిలో సేవకులుగ నిలువగలిగే అభ్యాసకులు అమృతత్వ సిద్ధిని ఈ జన్మలోనే పొందగలరు. జడమును ప్రేమించే మనసును జయించిన చైతన్య భావం స్ఫురించును. ఇంద్రియ గోచర సంబంధమైనదంతయు జడమేనని తెలియవలయును. ముందుగ మనసును జయించాలి. దానికి ప్రతి క్షణం పని కల్పించాలి. సోహంభావ నిష్ఠలో లయింపజేయాలి. పర్వతం కణమయం, సింధువు బిందుమయం, అనంతకాలం క్షణమయం ఐనట్లు భూత, భవిష్యత్, వర్తమాన కాలాలకు వర్తించునదంతయు ఏకత్వము యొక్క మూడు రూపాలు. ఇదంతా సత్ యొక్క మహా మాయ. ఈ జగత్తు లోని సముదాయమంతయు మాయయే. ఎందులకనగా వస్తు సముదాయమంతయు తాత్కాలికమైనది. సూక్ష్మజీవి నుండి సూర్యమండల పర్యంతం తాత్కాలికమే. సుస్ధిరం, పరిణామ రహితమైన ఏకత్వముతో పోల్చి చూచిన సృష్టి సర్వస్వం బ్రహ్మజ్ఞానికి మృగతృష్ణ జలమువలె గోచరిస్తుంది.

లౌకిక జీవి కేవలం బాహ్య దృష్టితో ప్రకృతిబ్ద్ధమైన జీవన విధానము నకు ఆకర్షితుడై తత్సంబంధమైన జీవనమును కోరుకున్నందున తనలో నిండియున్న అంత:శ్శక్తిని అమూలాగ్రం గ్రహించలేక పోవుచున్నాడు. ఫ్రతి పరమాణువులో అనన్య సామాన్య శక్తి ఉన్నపుడు మనలో ఎందుకు లేదను కోవాలి. కోట్లకొలది భౌతిక మరియు జీవాణువుల పరంపరలచే శోభిల్లుచున్న మానవునిలో సృష్టి, స్ధితి, లయ సంబంధిత శక్తితోపాటు అతనికి తెలియని అనిర్వచనీయ, మహత్తర శక్తిపూరితమైన దివ్య తత్వం ఇమిడి యున్నది. ఇట్టి అజ్ఞాతమును తెలుసుకొనుట ప్రతివారి విధి, ధర్మము, బాధ్యత.

స్వాత్మ స్వరూప భావనను కోల్పోవుటయే సమస్త దోషములకు మూలం. అత్మకు ఇతరముగ భావించునదంతయు మిధ్య. ఇట్లు మిధ్యగ నిశ్చయించు కొనుటయే నిజమైన వివేకముతొ కూడిన విచారణ. ఈ భావన మనసులో స్ధిరపడాలి. పరమాత్మ రాళ్ళయందు నిద్రావస్ధలోను, వృక్షములలో శ్వాస రూపమున, పశుపక్ష్యాది క్రిమికీటకాలలో చలన రూపములోను, కేవలం మానవునియందు మాత్రమే జ్ఞానముతో ఉన్నదని తెలుసుకోవాలి. కావున వివేకవంతుడైన మానవుడు జ్ఞాన దశనుండి దిగజారరాదు. గొర్రెలమందలో చిక్కిన సిం హపు పిల్లవలె దాని స్వరమును మరీచి గొర్రెల అరుపు అరచునట్లు మానవుడు ఈ నామ, రూప ఇంద్రజాలంలో చిక్కి తన నిజ స్వరమును మరీచి సైతాన్ స్వరముతో మెలగుచున్నడు. కావున మానవుడు తన నిజ స్ధితిని తెలుసుకొని సదా ఆత్మ జ్ఞాన శోభితుడై వర్ధిల్లాలి. అమృత సిద్ధిని సాధించి అమరత్వం పొందాలి.


(బాబా సర్వకేంద్రుల స్వహస్త లిఖిత దివ్య భాష్యాల నుండి)
సేకరణ: నాగులవంచ వసంత రావు, సచివాలయం.

Saturday, June 7, 2008

ఆత్మ విచారణ

జన్మించిన ప్రతి మనిషియొక్క శుభాశుభములన్నియు ముందుగానే నిర్ణ యించబడి కపాలముపై లిఖితమై ఉంటాయని, దానిని బ్రహ్మ వ్రాసిన వ్రాతయని అంటారు. ఈ దశలో దైవారాధనలు, పూజలు, వ్రతముల ప్రయోజనం ఏమిటని సందేహించరాదు. ప్రతి కర్మ చిత్తశుద్ధికి దారి తీస్తుంది. చిత్తశుద్ధి ఆత్మనిష్ఠకు తోడ్పడుతుంది. నిన్ను నీవు తెలుసు కొను స్ధితిలో ఏ బ్రహ్మరాతలు నిన్ను అడ్డగించలేవు. దేనికైనను దైవా నుగ్రహం సహకరించవలయునని సమస్త భక్తులు మరువరాదు. నీవు ఒక వ్యక్తివద్ద బాకీ తెచ్చుకున్నావనుకో. ఆ బాకీని అడుగను అని రుణపత్రం చింపివేసిన పిదప బాకీ వసూలుచేసే వారెవరు ఉండరు.

నీ నిజాత్మ స్ధితిలో నీవు నిలుకడ చెందనంతవరకు చిల్లర ఆరాట భ్రమలు నిన్ను వీడవు. ఓ నా ప్రియమైన సాధక భక్తుడా! జాగ్రత్తగా వినుము. ఈ భూమిపై వెలసిన సమస్త దేవతా దేవుండ్లను పూజించి, ధ్యానింతువుగాక. అంతటితో సరిపోదు. నీవనగా ఎవరో అట్టి నీ నిజాత్మ స్ధితిలో నిలుకడపొందాలి. స్వనిష్ఠలో స్ధిరత్వమొందాలి. అపుడే దైవ ధ్యాన సిద్ధి ఐనట్లు నిదర్శనము. నీవు నిద్రలో యున్నను, మేల్కొని యున్నను, సర్వకాల సర్వావస్ధల యందును సాక్షీభూతమై యున్నది ఏదో అదియే ఆత్మ. ఆ ఆత్మ నేనేనని రూఢిపరచుకో! నీవెంత కాదనుకున్నను నీవు అదియే ఐవున్నావు.

శరీరం, దాని ధర్మాలు, పదవులు, ఆస్తి అంతస్తులు, దేశకాల స్ధితిగతులు, మనోబుద్ధులు నీవుకాదు. వాటన్నింటికి సర్వలక్షణ విలక్షణమైన సర్వాత్మ స్వరూపుడవు నీవు. ఇదియే ఆత్మ విచారణ. దీనినే ఆధ్యాత్మికత యందురు. నీటిబుడగ నీటిలో పుట్టి, దానిపై తేలాడి చివరకు ఆ నీటిలోనే కలసిపోవునట్లుగ నామ, రూప సృష్టి సర్వం ఆదినారాయణ పరమేశ్వర దైవమునందు జనించి, చివరకు అందులోనే లయం అవుతుంది. నారాయణుడే నీరు. నామ రూపాలు అందలి బుడగలు.

నిర్మల మేఘ జలమువంటిది నా బోధ. స్వాతికార్తెలోని తొలకరి మేఘ జలమును ఆశించు చాతక పక్షివలె సర్వకేంద్రుల సుప్రబోధామృత మేఘజల పానశీలురు కండి. తనను తాను ఉన్నది ఉన్నట్లుగా సుస్ధిరాత్మ సత్యదైవ నేను స్వరూపముగ తెలుసుకోవటమే సమస్త సమస్యల పరిస్కారానికి ఏకైక దివ్య మార్గం. సమస్త జ్ఞానోపదేశముల మూల సూత్రమిది. గ్రంధరాశుల వెనుక జ్ఞానలక్ష్మి గలదు. హృదయగ్రంధి పెద్ద ముడి. దీనిని బేధించిన అంతర్ స్వర స్ఫురణ జాగృతమై, హృదయ గ్రంధమే దైవగ్రంధముగ ఆవిష్కరింప బడుతుంది. సర్వమత సంబంధ బోధలు, వేదోపనిషత్తుల సూత్రములు నీ హృదయ గ్రంధములోనే దర్శనమిస్తాయి. అదియే విశ్వమత దర్పిణి.

ఇదిగో! మీ చిత్ క్షేత్ర సస్యములపై పరతత్త్వ సుజ్ఞాన బోధామృతమును కుంభవృష్టిగ కురిపించు చున్నాను. ఈ అవకాశమును వినియోగించుకొని మీ చిత్ క్షేత్రములను సస్యశ్యామలం చేసుకోండి. సర్వేంద్రియములను సం యమన పరచి, మనో దృశ్శక్తిని త్రికూట స్ధానమున కేంద్రీకరించి, వాక్శుద్ధితో ఏది అనిన అది జరిగి తీరుతుంది. ఈ స్ధితినొందిన వారలు అత్యరుదు.

కృష్=అపరిమితమైన, ణ=ఆనందము గలవాడు. కృష్ణయనగా అపరిమిత మైన ఆనందమే స్వభావముగ గలవాడని అర్ధము. అపరిమితానందమే ఆతని గుణము, లక్షణము. తనను ఆశ్రియించినవారికి ఆనందప్రాప్తిని కలుగజేయువాడని మరియొక అర్ధము. అపరిమిత ఆనందమే మోక్షం. మోక్ష స్వరూపుడే కృష్ణుడు. కృష్ణం వందే జగద్గురుం. ఈ లోకం లో ఎందరు జగద్గురు నామధేయులున్నను ఆ పదవికి పూర్ణార్హమైనది కృష్ణావతారమని మహర్షుల అభిమతము. జగద్గురు విషయం లో సర్వావతార నిలయులు బాబా సర్వకేంద్రులు ఇలా వివరిస్తున్నారు. చరాచర సమస్త ప్రాణికోట్లయందు తానే విరాజిల్లు చున్నానని, పిపీలికాది పర మేశ్వర పర్యంతం అందరిలో తనను, తనలో అందరిని దర్శించుచు, జగదా త్మను స్వస్వరూపముగ వీక్షించు వారెవ్వరైనను జగద్గురు పదవికి అర్హులే కాగలరు. విశ్వాత్మను స్వస్వరూపముగ వీక్షించువాడే విశ్వ భగవన్.

‘రా’ యనగా జీవాత్మ, ‘మ’ యనగా పరమాత్మ. జీవాత్మ, పరమాత్మల సమైక్య తత్త్వమే రామ తత్త్వం. శవము గానిదే శివం, సత్. పవిత్రాత్మ యే గోవిందం. అరిషడ్వర్గముల కవ్వలి అనంతాత్మ నారాయణుడు, సర్వము ను ఆకర్షించువాడే హరి. స్వస్వరూప సంధాన స్ధితిలో అభిషిక్తతయే క్రీస్తు తత్త్వం. జితేంద్రియత్వమే శబరిమల వాసం. ఆత్మానందమే హాయి. అదియే సాయి. నేను ఎవరియందు ఆవేశించెదనో వారు నా పరమార్ధ తత్త్వమును విశదీకరించెదరు. అట్టివారలందరిని నా ప్రతినిధులుగ నేనె ఎన్నుకోనైనది. నాచే గుర్తింపబడిన యోగ్యులు ధన్యులు.

జ్ఞానోదయం కానంతవరకు అజ్ఞాన దెబ్బలు తప్పవు. సమస్త జీవజగ త్తులు ఉప్పునీటిలో వలె ఎచ్చట లయిస్తున్నాయో, ఎచ్చట మానవ హృదయాలు ఐక్యతా భావంతో వర్ధిల్లుచున్నవో, ఎచ్చట సమస్త దేవతా దేవుండ్లు సర్వైక్య పరిపూర్ణ స్ధితిలో ప్రకాశిస్తున్నారో అదియే నా ప్రార్ధనా మందిరము. ఈ నా దేవాలయమును భూలోక సిరిసంపదల మొత్తం ధారవోసినను నిర్మించలేరు. కేవలం ఆత్మౌపమ్య భావ నిష్ట నొందిన యోగీశ్వరులకే నా ఆలయ ప్రవేశార్హత పరమ భాగ్యం. నామ, రూప, దృశ్య నాటకం, చూపు, రూపుల వ్యవహారం లేదు. సర్వాత్మ అనంత దివ్య భావ ప్రకటన సమస్త యుగముల ఆరాధన మూల సూత్రమిది. విశ్వ మతములన్ని ఇచ్చట సంగమించి తీరగలవు. ఇదియే సర్వకేంద్ర దైవపదవి. మీరందరు ఈ పదవిని పొందు నిమిత్తం వారస జ్యోతులై నిలువాలి. జై బాబా!

మీరు తరించి ఉద్ధరించబడుటకు ఇందులో మీకు నచ్చి, వీలున్న ఏ ఒక్క అతీత వాక్యమైనను చాలు. ఎవరికి వీలున్నంతవరకు వారి మేధాశక్తి ననుసరించి స్వీకరించండి. మీకవసరము లేనిది మరియొకరికి అవసర ముంటుంది. ఈ భూతలమున అవతరించిన ప్రతివారికి ఉపయుక్త ‘బోధామృత నిధి’ ఇదియని గ్రహించువారు ధన్యులు. జై సర్వకేంద్రా! ఇదిగో! నాయొక్క అతీత వాక్య వివరణ అనగా నా ఈ పరమాద్భుత ప్రసంగ బోధ జరుగు చోట విద్యుత్ తేజమును మించిన ఘన చిన్మయ ప్రకాశము ఆవరిస్తుంది. ఇది సూక్ష్మ దృష్టికి మాత్రమే గ్రాహ్యం. ప్రతి శ్రోత దేహధ్యాసను మరిచి చిన్మయ నిష్ఠలో తన్మయులై స్వస్వరూప సంధాన స్ధితిలో నిమగ్నులయ్యెదరు. అధికారులు శ్రవణమాత్రం చేతనే ఆత్మసిద్ధి నొందగలరు.

సర్వలోక పర్యంతం సమస్త భూనివాసులారా! చక్కని సదవకాశమును వ్యర్ధపరచుకోరాదు. మిమ్ముల మీరు తెలుసుకొని మీ నిజాత్మ స్ధితిలో అభిషిక్తులు కండి. ఇంతకు మించిన నా అనుగ్రహ ఆశీస్సులు లేవు. అప్పుడే మీరు మీకప్పగించిన కార్యం లో కృతకృత్యులై నా రుణం తీర్చుకున్నవారు కాగలరు. ఇంతకుమించిన తృప్తి నాకు లేదు. ఇదిగో! చెవిగల ప్రతివారు విందురుగాక! ఒక్కమాటలో అసలు విషయం బట్టబయలు చేయుచున్నాను. ఇది నర గురు రచన కాదు. మరియు గురు శుశ్రూషాలబ్ధ భాష్యం అంతకన్నా కాదు. ఇయ్యది సాక్షాత్ స్వత:స్సిద్ధ సర్వేశ భగవన్ శ్రీమన్నారాయణ పరమశివ హరి బోధ కావున ఏ ఇతర రచనలతో పోల్చ వీలులేదని గ్రహించుదురు గాక!

(బాబా సర్వకేంద్రుల స్వహస్త లిఖిత దివ్య భాష్యాల నుండి)
సేకరణ: నాగులవంచ వసంత రావు, సచివాలయం.

Wednesday, June 4, 2008

నేనెవరు ?

తన్ను తాను తెలుసుకొనక బ్రహ్మాండమంతయు పరిశీలించినను వృధా శ్రమయే మిగులుతుంది. తన నిజస్ధితిలోనే అఖిలాండకోటి బ్రహ్మాండ ములు విలీనమై యున్నవి. బాహ్య కర్మకాండ తతంగమంతయు మన తృప్తి కొరకే. మనసు జోడించని, హృదయశుద్ధిలేని కేవల బాహ్యాడంబర ములు నిజదైవమును మెప్పించలేవు. సర్వధరిత, సర్వభరిత, సర్వాధార, సర్వాకర్షణ చిన్మయ చైతన్య సర్వశక్తి కేంద్రుడైన విశ్వగర్భుని నుండియే సమస్త దివ్యశక్తులు ఉదయిస్తున్నాయి. అహమచల, అనంతాత్మాలయ, సర్వాకార, సర్వస్వరూప, సచ్చిదానంద నిలయ, బ్రహ్మవిద్వరిష్ఠా గరిష్ఠ, తురీయాతీతుడే సర్వేశ్వరుడు.

విశ్వాంతరాళములోని నక్షత్రములను, గెలాక్సీలను చూడవలయుననిన సుదూరమునకు దృష్టిని సారించగలిగిన దూరదర్శిని అవసరము. సుజ్ఞాన దృష్టి దీనికి పైది. దూరదర్శినులకందని నక్షత్రములు గలవు. పదిహేనువందల కోట్ల సంవత్సరములవరకు ఇవి వ్యాపించి యున్నవని శాస్త్రజ్ఞుల అంచనా. ఆపై అత్యద్భుత నక్షత్ర మండలములు గలవు. ఖగోళ శాస్త్రవేత్తలకు కూడా అంతుచిక్కని రహస్యమిది. నక్షత్రములను, గ్రహమండలములను ఒక్కొక్కచోట వాటి పరిమిత కక్ష్యలో నిలిపి పరిభ్రమింపజేసే శక్తి ఏమిటి? అదియే అనిర్వచనీయ చిన్మయ చైతన్య సర్వశక్తి దైవం.

సూర్యునిమీద కోటి డిగ్రీల వేడిమిగలదు. సూర్యుడు భూమికంటె పరిమాణంలో పదమూడు లక్షల రెట్లు పెద్ద. బరువులో మూడులక్షల రెట్లు ఎక్కువ. ఐదువందల కోట్ల సంవత్సరములుగ సూర్యుడు వెలుగు చున్నాడు. ఇంకను కోట్ల సంవత్సరములు సూర్యుడు ప్రకాశించును. వేల సూర్యగోళములు ఒకేసారి వెలిగితే విడుదలయ్యే శక్తి ఒక విస్పోటనం. ఇవి సెకనులో వెలిగిపోతాయి. అనంత సృష్టికి మూలకారణం ఏమిటి? ఇది శాస్త్రవేత్తలకు సవాల్! మిలియన్ లక్షల కోట్ల కాంతి సంవత్సరములు ప్రయాణంచేసి విశ్వాంతం ముగిసినది. ఇకపై ఏమియును లేదని భావించినను, ఆ ఏమిలేని కాళీ ప్రదేశం శూన్యం మాత్రం కాదు. ఇది చిన్మయ చైతన్య ప్రభావమేగాని ఇంకేమియును కాదు.

దేహాభిమాన ప్రాణభయం ఉన్నంతవరకు పరతత్త్వ జ్ఞానసిద్ధి కలుగదు. విద్యుత్ బల్బులోని విద్యుత్తు అంతర్ముఖముగ వెళ్ళిపోయినచో చివరకు విద్యుత్కేంద్రమే తానగును. అలాగే దేహమనెటి బల్బులోని దేహియనెటి బాహ్య స్ఫురణ వీడి, దేహేంద్రియ మనో పరిమితుల నతిక్ర మించి సర్వాంతర్ముఖముగ పయనించెనేని సర్వాత్మ మహాసాగర స్వరూపంగా వర్ధిల్లగలదు. సమస్త మత గ్రంధముల సారమిదియే. తనకు తానుగ సన్మార్గ ప్రవేశితుడు కావాలి. ఎవరికి వారే ప్రేరణ పొంది ఉద్ధరించుకోవాలి.

చిల్లర మంత్ర తంత్రములు మనుష్యులను భ్రమింపజేస్తాయి. స్ధితికుదురని వారలు రసాయనాలతో మాయా వాతావరణమును సృష్టించి ప్రజలను భ్రమింప జేయుదురు. అమాయక ప్రజలు వాటిని నిజమని నమ్మి వారికి దైవత్వమును ఆపాదించుదురు. నిజ దైవస్ధితి వీటికి అతీతం. మనలో అవతారులు కానివారు ఎవరూ లేరు. ప్రతి ప్రాణి ఒక అవతారమే. మనందరిలో అవిభాజ్య దైవాంశ దాగియున్నది. దీనిని వెలికి తీసి ప్రదర్శించాలి.

చేతిక్రింద ప్రచారకుల గుంపు వుండిన సాయంత్రం వరకు సామాన్య వ్యక్తిని సత్పురుషునిగ, జగద్గురువుగ, అవతారమూర్తిగ నమ్మించవచ్చు. కాని పిదప అయోమయ దు:ఖ స్ధితి తధ్యం. వేర్లులేని కొమ్మలవంటివి స్ధితికుదురని చేష్టలు. తన్ను తానెరింగి ఆత్మార్చన శీలియైన ఘనుడు భగవంతుని నిండా అర్చించిన వాడగును. అందులకే నిన్ను నీవెరింగి నీ నిజాత్మ స్ధితిలో స్వస్వరూప ప్రజ్ఞతో వర్ధిల్లాలి. ఇదియే సమస్త మత ధర్మముల సారం. సమస్త పూజల సారాంశం.

నీ నిజస్ధితిని విస్మరించిన పరిజ్ఞానమెంతైనా దైవస్ధానమున శోభిల్లనేరదు.అందులకే నిన్ను నీవు తెలుసుకో. నీ నిజస్ధితి అవిభాజ్యం, అఖండం. నీ పరిధిలో నీవు నిశ్చలుడవై నిలువనేర్చుకో. ఎవరిని మందలించినా నేను అంటారు. ఆ నేను ఎవరు? ఆ నేను స్త్రీయా, పురుషుడా? ఆ నేనుకు వయస్సెంత? శరీరంలో నేననునది ఏ భాగము. శరీరము నేనుకాదు. శరీర నిలుకడకు ఆధారముగ నేనున్నానని తెలుసుకో. ఈ ఆత్మ నేనుకు కులమతములు లేవు. స్త్రీ పురుష బేధంలేదు. చావుపుట్టుకలు లేవు. అదియే సజీవాత్మ. జాగ్రత్, స్వప్న, సుషుప్తి, తురీయ స్ధితిలో సైతం ఈ నేను అవిచ్చిన్నముగ భాసిల్లుచున్నది. ఇట్టి నేను పరిజ్ఞానమే పరలోక దైవరాజ్య ప్రవేశం. మీలో ఎందరు ఈ పరిజ్ఞాన మును కలిగియున్నారో పరీక్షించుకోండి. జీవాత్మ నేనుకు హృదయ మందిరమే సరియైన ఆలయం. ఈ లోకంలో నిర్మించిన దేవాలయములన్నియు ను బాహ్యవేడుకేలు మాత్రమే. సమస్త యాత్రలకు మూలం నేను అని తెలుసుకో. నీవు లేకుండ, నీవు పోకుండ ఏ యాత్రలు వర్ధిల్లనేరవు. నీతో సర్వం ఏకీభవించి యున్నదని రూఢిపరచుకో.

ఆకాశము శబ్ధగుణ రూపమైనది. ఆకాశమునకావల పరమ నిశ్శబ్ధము, కేవల పరమశివ అచలాద్వైతం నిండి భాసిల్లుచున్నది. ఇట్టి శివస్వరూప శక్తివలన పంచభూతములు ఆవిర్భవించినవి. పంచమూతముల సం యోగమే జగత్తు. సంసారము, పంచభూతములు అన్నియును భగవంతుని శక్తిలోనే ఇమిడియున్నవి. కావుననే దానికి విభూతి యోగమని పేరు వచ్చినది. అనంతుడు, అవ్యక్తుడు, సర్వవ్యాపియైన దేవదేవుడు దేహధారియైనపుడు జీవుడని పిలువబడు ను. జీవుడు అల్పజ్ఞుడు. భగవంతుడు అన్నింటికి కర్తయై జీవుల యంత్రముగ గిరగిర త్రిప్పుచున్నాడు.

ఈశ్వరునివలె జీవుడుకూడ శుద్ధ చిన్మాత్రుడేగాన బేధంలేదు. మమాత్మా సర్వ భూతాంతరాత్మ. నా ఆత్మే సర్వ భూతములలో భాసిల్లుచున్నదని భావించి కేవలం ఆత్మౌపమ్య భావనిష్ఠలో నిలచిన జ్ఞాని సర్వమును తనలో, సర్వములో తనను దర్శించ గలుగును. ఇట్టి అఖండాత్ముని దైవస్ధితిలో పూజించినను దోషంలేదు. ఇట్టి అఖండ జ్ఞానమును ప్రతివారు సంపాదించి అనుభూతి చెందాలి. గుణముల లో మార్పురాకుండ గుడ్డలు మార్చుకోగానే సరిపోదు. వస్త్రాలంకార ములు బాహ్య దంబాచారమును సూచించును. శక్తికిమించిన వేషధారణ హానికరము. సబ్బు బిళ్ళలపైనున్న కాగితములు ఎంత సొగసుగ కనిపించినను ఎందుకు కొరగావు. స్ధితికుదురని కేవల వేషధారులు సబ్బు బిళ్ళలపైగల కాగితములవంటి వారు. ఓ వివేకి! ఎంతకాలము గంటలు మ్రోగించి మంత్రాలు వల్లిస్తావు. ఈ పూజా పునస్కారములు ఎంత వరకు నిలువగలవు. దూప, దీప, నైవేద్యాలు నీ తృప్తికొరకే. అవి భగ వంతుని ఎంతమాత్రం స్పృశించలేవు. నిన్ను, నీ నిజాత్మ స్ధితిని గుర్తించక కాలయాపన చేయరాదు. సత్యదేవునకు ప్రతేక స్ధలంలేదు. ఉన్నదంతా తనకు తానైన నేనే. ఈ నేను తప్పిస్తే ఇంకేమియునులేదు. మణుల లో దారమువలె సర్వాంతర్యామిగ ఉన్నదంతా నేనని నిశ్చయించుకో. ఇదియే సమస్త సాధనల ఫలితాల ప్రత్యక్ష మార్గం. దేహమనంబులు తానని భావించుటయే దు:ఖహేతువు. ఈ భ్రమ తొలగటమే బ్రహ్మత్వం.

జాగ్రత్స్వప్న సుషుప్త్యావస్ధలలో నీవున్నావుగాని జాగ్రత్ లో తోచేవి సుషుప్తిలో లేవు. ఆ సమయంలోకూడ నీవున్నావు. మనో సంకల్పాలే ప్రపంచ భావనకు ఆధారం. ఆత్మలోనే మనసు పుట్టి లయిస్తుందిగాన ఆత్మే అన్నింటికి మూలం. నీవు నీలో యున్నావు. శరీరంలో సూదిమొన వంటి కేంద్రం వుంది. దానినుండి నేను నేననే సోహం స్ఫురిస్తుంది. ఇది అజ్ఞానిలో మూతబడి ఉంటుంది. నిర్వికల్ప సమాధి స్ధితిలో శాశ్వతముగ తెరువబడి ఉంటుంది. అరుణాచల రమణుడు ఈ నేను భావమును స్పష్టంగ గ్రహించగలిగారు. ప్రతి మానవుడు ఈ నేను సాక్షాత్కారం పొందనేర్వా లి. ప్రశాంతమైన మనసుతో నిరంతరం నేనెవరు? అని ప్రశ్నించుకుంటూ ఉండిన క్రమముగ హృదయ కేంద్రానికి చేరుకోవచ్చు. ఇలా చేరగానే ఆత్మ స్ఫూర్తి కలుగును. తలంపు, భ్రమలులేని నిత్య ప్రత్యక్షానుభవ మైన ఆత్మ స్ఫూర్తిలో నేను పరిశుద్ధమై అవిచ్చిన్నంగా ప్రకా శిస్తుంది.

సమస్త నాడులకు హృదయమునుండే శక్తి వస్తుంది. హృదయమే శక్తి స్ధానం. గుదస్ధానమునుండి వెన్నెముకలోని వెన్నుపూసలద్వారా సుషుమ్న నాడి సహస్రారపర్యంతం అంతమౌతుంది. సిద్ధుల నిమిత్తం యోగులు ఈ నాడిని సాధించుటకై ధ్యానించెదరు. దీనిని ఆత్మ నాడి, పరా నాడి, అమృత నాడి అనెదరు. ఇది శక్తి కేంద్రమైన హృదయంలో పుట్టి సహస్రారంలో కలుస్తుంది. సుషుమ్న నాడికి సైతం ఆత్మ నాడియే శక్తినిస్తుంది. యోగ శాస్త్రం సహస్రారం అంతటికి మూలమంటుంది. పురుష సూక్తం హృదయమంటుంది. ఎట్టి సందేహములకు తావులేని ప్రత్యక్షాను భవమైన నేనుపై దృష్టి నిలిపిన ఆ నేనే ఆత్మలోకి తీసుకెళుతుంది. “నేను” విచారణను మించిన ధ్యానంగాని, సమాధిగాని లేదు. హృదయమే జీవునికి మూలస్ధానం. ఇది ఆత్మయొక్క పరమ కేంద్రం. దీనిని చూడటానికి ప్రయత్నించక అది నీవై ఉండనేర్చుకో. అసలైన ‘నేను’ స్ఫురణతో సదా విహరించ నేర్చుకో.

(బాబా సర్వకేంద్రుల స్వహస్త లిఖిత దివ్య భాష్యాల నుండి)
సేకరణ: నాగులవంచ వసంత రావు, సచివాలయం.