Tuesday, July 8, 2008

లోకం పోకడ

కాని పనులజేసి కపట మార్గంబున
తప్పించుకొన జూచు తెలివిమీరి
ప్రకృతి పగబట్టి పగదీర్చుకొంటది
తరచి చూడ నాగుబాము పగిది

అమ్మవలన బుట్టి అమ్మవలన బెరిగి
ఆలి వచ్చిన క్షణమె అమ్మ చేదాయెను
ముందు చెవులకన్న వెనుక కొమ్ములు వాడన్నట్లు
లోకరీతిని పరికింప సత్యమిలను

ఎదుటి వానియొక్క ఎదుగుదలను జూసి
కడుపునిండ విషము నింపుకొనియు
మనసులోన పెక్కు కుతంత్రాలు బన్ని
మాటలోన మిగుల ప్రేమొలుకబోతురు

ఉన్నమాట జెప్ప ఉరిమురిమి జూతురు
కల్ల మాటలు జెప్ప ఉల్లముప్పొంగును
కపటవర్తన చేత కార్యంబు దీతురు
కలియుగాన జనులు కస్టాల కోర్వలేక

పాంచభౌతిక దేహ పరిధిగానక నరులు
జల్సాలెన్నొజేసి షోకులెన్నొ వేసి
పుట్టి పెరిగినదిలను అనుభవించుట కంటు
శుష్క వేదాంతంబు తెగజెప్పుచుందురు

పరులు జూచుటకొరకు పట్టెమంచము పరుపు
పవళించు సమయాన కటికనేలయె గతి
మాయ జబ్బులు వచ్చి మంచము కరువాయె
జనుల మార్చనెంచ నెవరి తరము !

తమ సొమ్మనగానె తెగ పొదుపుజేతురు
మంది సొమ్ముగాంచ మంచినీళ్ళ పగిది
స్వపర భేదములేక వర్తించు వారలే
మానవోత్తములని మహిని తెలియవలయు

మంచి మాటలు జెప్ప మాటాడకుందురు
చెడ్డమాటలంటె చెవిగోసుకొందురు
పరుల దోషమునెంచి బరగ దూషింతురు
మనసు మర్మము దెలియని మనుజులిలను

ఇల్లు ఒళ్ళు రెంటి గుళ్ళ జేయునట్టి
మద్యపానంబును మానలేక జనులు
సంఘములో బహు చులకనైపోదురు
క్షణిక సుఖము కొరకు ప్రాకులాడిన నరులు

కలిగియున్న వేళ కలతలెప్పుడు రావు
సన్నగిల్లు వేళ సణుగుడు మొదలౌను
కలిమి లేములందు సమముగా నుండుటే
సంఘ జీవికెపుడు సరియైన మార్గంబు

పరిణయంబులకేమొ ఫంక్షను హాలులు
ఫలహారముల జూడ పదుల సంఖ్యలొ నుండు
లెక్కలేని పెక్కు భోజన పదార్ధాలు
అర్థ భాగము మిగుల వ్యర్ధమైపోవును

శీలమొక్కటె స్త్రీలకాభరణమై యుండగా
మెడనిండ నగలేసి తెగ మురిసిపోదురు
పట్టుచీరల కొరకు పరుగులే దీతురు
ఆందచందాలకధిక ప్రాధాన్యమిత్తురు





జ్ఞాన మార్గం

నామరూప జగతి సత్యంబుగా దోచు
మాయ వలన మహిని మనుజునకును
నిత్యానిత్య వస్తు వివేచన సలుపంగ
మాయ తొలగిపోయి మర్మమెరుగు

పెక్కు జనుల శవములు కనులార గాంచియు
తనకు మరణమిపుడు రాదటంచు
భౌతికమును బహుగ ప్రేమించుచుందురు
హంస ఎగిరిపోవు క్షణము దెలియలేక

మంచి పనులు జేయ మాయ యడ్డగించి
విఘ్నంబులెన్నియో కల్పించుచుండును
ఆత్మ స్థైర్యముతోడ అడుగు ముందుకు వేయ
మాయ తొలగిపోయి దారి చూపించును

సృష్టిలోన మానవ జన్మ ఉత్కృష్టంబు
విచక్షణ శక్తి యుండుటే దీని ఘనత
మంచి చెడ్డలుగని మసలుకుంటె మిగుల
మనిషి జన్మ యిలను బహుళ సార్ధకమగును

నేను నేనటంచు తెగ విర్రవీగును
దేహ భావముతోడ జీవుడిలను
భారమైన వేళ భగవంతుడేడును
తన బలము చాలదనే అనుభవంబుతోడ

భౌతికమందున బహుసుఖము గలదంటు
బాహ్య ప్రపంచాన తిరుగాడుచుందురు
అంతరంగమందు అమృత భాండమ్ము
గాంచలేరు జనులు సాధన సలుపరేని

కామాతురతబొంద మనసు వశము దప్పు
ఉచితానుచితంబు మిగుల సన్నగిల్లు
బలహీన క్షణమొకటి బలిపశువుగా మార్చు
బంగారు భవిష్యత్తు భగ్గుమని మండును

ఎంత సంపాదించి ఎన్నాళ్ళు బతికినా
తనువు శాశ్వతంబుగాదు తర్కించి చూడగా
తన్నుద్దరించుకొని విశ్వశ్రేయస్సు కాంక్షించి
పరితపించువాడె పరమ యోగీశ్వరుండు

మలినరహిత మనసువలన మంచి దేహముండురా
ఇతరులభివృద్ధి గాంచి ఈర్ష్య చెందనేలరా
కుళ్ళుబోతు తనముబెంచ కూలిపోవు చూడరా
సర్వజనుల హితముగాంచి సద్గతి నువు బొందరా

కర్మ జన్మలయొక్క మర్మంబు నెరుగక
భౌతిక ప్రపంచాన బాధలొచ్చినవేళ
తన కర్మమేమిటని తెగ బాధపడుదురు
భగవంతునేడుకొని పశ్చాత్తాపపడుదురు

పరమాత్మ స్మరణయే పరమ లక్ష్యముకాగ
విషయ వాంఛలతోడ వహరించు చుందురు
దేహ సుఖములకొరకు దేబిరింతురు జనులు
ఆత్మ జ్ఞానములేక అల్లాడుచుందురు

మంచి మనసుగలిగి మానవుడుండిన
విశ్వశక్తులన్ని మనసావహించును
మానసిక పరివర్తన మరి మరి కలుగును
ఆత్మ సిద్ధి బొంది ఆనందమందును

Wednesday, July 2, 2008

మేను - నేను

సచ్చిదానంద పర:బ్రహ్మ స్ధితిలో శిష్యుల మనస్సును లయింపజేయటమే సత్యోపదేశము. ఇది సహజ స్ధితి. ఈ స్ధితినుండి భ్రష్టమైన చిత్తము దిగజారి సంసారంలో ఒడుదుడుకులపాలైనది. దానిని పూర్వస్ధితికి చేర్చడమే నిజమైన ఉపదేశము. తన సహజస్ధితియైన శుద్ధత్వమునుండి విడిపోకుండ చూడటమే ఉపదేశ రహస్యము. నీవు సదా ఆత్మవే! ఆత్మకంటె భిన్నమైన వాడవుకావు. ఆత్మయే నీవని నిరూపించటమే గురూపదేశం. గురుశిష్యులు, జీవేశ్వరులు ఒకే మూలతత్త్వ పర్యాయ పదములు. ఇట్టి సర్వాది మూలతత్త్వ కేంద్రం నీది. ఈ నా, నేనే సమస్త నేనులకు దైవ నేను. ప్రతి నేనులోని నేనే సంపూర్ణ నేను. ఈ నేనుకు కుల మతములు లేవు. సర్వావృత నేనే నేను. అందరిలో సూత్రాత్మగ యున్న నేనును తెలుసుకోవాలి. నిన్ను ఎరుగక ఎన్ని ఎరింగినా లెక్క పూర్తి కాదు. విశ్వాది మూలకారణ కర్త నీలోనుండియే నేనున్నానని గుర్తుచేయుచున్నాడు. మిధ్యా నేనును నైవేద్యముగ ఆత్మార్పణ చేసుకోవాలి. అప్పుడు వెంటనే సత్య నేను బోధపడుతుంది. పిపీలికాది పరమేశ్వర పర్యంతం సమస్త ప్రాణికోటిలో యున్నది నీవే. ప్రతిజీవి వికసించి తన సహజ స్ధితికి చేరక తప్పదు. మిధ్యా నేను అదృశ్యమైనపుడే సత్య నేను స్ఫురిస్తుంది. ఈ నేను దేనిచే బంధింపబడునది కాదు. సర్వ స్వతంత్రమై నేనుంటుంది. సమస్త దేవతలకు, దేవుండ్లకు మూలం ఈ నేనే. ఆత్మలకు ఆత్మగ ప్రకాశిస్తుంది. నేను పరిజ్ఞానం లేకుండ ఎన్ని తెలుసుకున్నను వృధా శ్రమయే మిగులుతుంది. ఈ నా, నేను లోనే సమస్తం యిమిడియున్నదని తెలుసుకోవాలి. నిన్ను నీవు ఎరుంగుటయే సర్వజ్ఞత్వం. నిన్ను నేవెరింగి నిన్నే బోధించు. ముందుగ నిన్ను నీవు సాక్షాత్క రించుకోవాలి. అపుడే సర్వాత్మ దైవదర్శన ప్రాప్తి. సైతాన్ మాయను లేకుండ చేసి జీవించినపుడే మానవజన్మ సార్ధకమౌతుంది. మాయలక్షణములు మానినపుడే మాధవత్వం సిద్ధిస్తుంది.

నేనులేని వ్యక్తిగాని, శక్తిగాని, దేశముగాని, దేవుడుగాని లేడు. నేనున్నాను గనుకనే సమస్తం నా ప్రభావంతో నిలిచియున్నది. సర్వాధార, సర్వాకర్షణ శక్తికేంద్రం నేను. ఇట్టి నేను సకల నేనులుగ ఉండగలదు. నేను నేనుగ కేవలమై ఉండగలను. ఏ స్ధితిలోనైనను నా నేనుకు భంగంలేదు. నేనులేకుండ దేనికి స్వత:స్సిద్ధ ఉనికిలేదు. సమస్త శక్తులకు ఆదిమూలం నేనే. నన్ను మించిన సత్తులేదు. నేనే సచ్చిదానంద నిలయం. సకల నేనులు
సాక్షాత్ నా స్వరూపమే. అందులకే ప్రతి నేను నన్నుబోలి నడుచుకొనుచు, నా స్వరూప ప్రజ్ఞతో భాషించవలయును. అట్టి బోధకు తిరుగులేదు. ఈ భూమండల నిధులన్నింటిని దర్శించినను నిన్ను నీవు దర్శించక నిజముక్తి లేదు. సమస్త తీర్ధములు, క్షేత్రములు నాలోనివనెటి భావం స్ధిరపడిననాడు నన్ను మించిన పవిత్ర ఆలయం ఉండబోదు. జన ధనాకర్షణలతో పనిలేదు. ఆత్మ అసంగం, అనంతం. ఆకర్షణ వికర్షణలు ఆత్మస్ధితిలో నిలువవు. నిన్ను నీవు నిండుగ ఎరింగిన చాలు. ఎవరికి వారు ఆత్మదృష్టి కలిగి ఉండటమే మోక్షాలయము. ప్రతిబంధకములులేని నిర్వాణ నిలయమే నేనైన దివ్యత్వము. ఈ స్ధితిని దేహ వియోగమునకు పూర్వమే పొందవలసియున్నది. ఇది సజీవన్ముక్తి. అఖిలాండకోటి బ్రహ్మాండ, అనంత విశ్వగర్భ, శాశ్వత పరమ సత్య మూలమును నేనైయున్నాను. మేను-నేనులకు చాలా వ్యత్యాసం గలదు. సర్వాకారమే ఉనికిగల నేనుకు శరీర ధర్మాలు లేవు. ఏ నొప్పులు, రోగాలు, తప్పులు, ముప్పులు నేనుకు లేవు. ఇహపర సర్వలోకాలు నాకభిన్నములు. నేనులేని లోకంగాని, జీవంగాని, దైవంగాని లేదు. జగజ్జీవేశ్వరిహ పర సర్వనిలయుడనై నేనున్నాను. ఈ స్ధితియే జన్మ రాహిత్యం. సర్వం నాతో ప్రారంభించబడుచున్నది. నేనులేని మతముగాని, మతగ్రంధముగాని లేదు. ఎవరు ఏభాషలో ఎన్ని చెప్పినను నాకు చెందని, నాతో సంబంధంలేని బోధగాని, గురువుగాని, అవతారుడుగాని లేడు. ఇట్టి నన్ను విస్మరించి ప్రయాసపడకుందురు గాక! నిన్ను నీవెరింగిన నీవు అతడివయ్యెదవు. నేనే అతడినై యున్నానని ధృవ పరచుకో, ధృఢపరచుకో. సమస్త సుప్రబోధల సారం ఈ అతీత మహా సూత్రవాక్యంలో గలదు. నేనులేని అతడుగాని, అతడులేని నేనుగాని ఏనాడులేడు. సార్వకాలం స్వత:స్సిద్ధమై తనకు తానుగ ఉన్నదంతయు ఒకే నేను. ఇదియే
కేవలఖండ అచల పరిపూర్ణ సర్వకేంద్ర పిత చిన్మయ దైవనేను.

సృష్టిలో ప్రతిదానికి ప్రయోజనం గలదు. మానవ జన్మ ప్రయోజనమును ముఖ్యంగా గుర్తించాలి.నేను ఎవరు అని తెలుసుకొనుటకు సహకరించునదే నిజమైన విద్య. ఆలోచనా నిమగ్నుల గావించి, స్పందింపజేయునదే నిజమైన విద్య. ఎవరు సమస్త కోరికలను భస్మము గావించెదరో వారి హృదయమే శివుడు, శివాలయం, చితాభస్మం, లౌకిక జీవితం అనిత్యమనుటకు గుర్తు. నేడో, రేపో వెనుక ముందు అందరు చనిపోయి, శరీరాలు బూడిదగావలసిందే. నుదుట ధరించే తిర్యక్సుండ్రాలు త్రిగుణాతీతులు అనుటకు ప్రతీకలు. శివుడు ఏనుగు శరీరాన్ని కప్పుకొన్నాడనిన సమస్త పశు ప్రవృత్తులను నిగ్రహించినాడని అర్ధం. కుండలినీ స్వాధీనపరచు కొన్నవాడే పరమ శివుడు, మహా యోగీశ్వరుడు. త్రిశూలం శివుని ముఖ్యాయుధం. ఇది త్రిగుణాలకు ప్రతీక. త్రిగుణాతీతుడైన పరమశివుడు సృష్టి, స్ధితి, లయ సం హారములను తన ఆధీనంలో ఉంచుకొన్నాడు. వృషభం దురహంకారానికి గుర్తు. అహంకారమును అణచినవాడే వృషభవాహనుడు. గరుడవాహనం ఆత్మ సాక్షికి వర్తిస్తుంది. నెమలి వాహన యనగా పవిత్ర ప్రేమకు చిహ్నం. ఇలా ప్రతి వాహన విషయంలో అంతరార్ధములుండును.శుద్ధ నిర్గుణత్వమే మేఘా రూఢుడు. అందరిలోను విహరించగల ఆత్మసాక్షి పరాత్పరుడు నక్షత్రములకు ఆవల పాదుకొని లేడు. భక్తవరేణ్యుల హృదయాంతరాళములలో గలడు. కఠోర దీక్షలు మాని భక్తిమార్గము నాశ్రయించాలి.

భగవన్నామం వినినంతనే ఎవని దేహ మనంబులు పులకాంకితమగునో అతడే సత్య భక్తుడు. యోగ్యుడైన నాస్తికునకు, నిజమైన వేదాంతికి బేధం లేదు. నాస్తికునకు నేను పరిజ్ఞానం బోధపడిన చాలు. జీవకోటిలో అత్యుత్తమ స్ధానం మానవ జన్మదే. తినటం, త్రాగటం, కనటం, ఉండటం, బ్రతకటం అన్ని ప్రాణులకు తెలుసు. వాటికి లక్ష్యం లేదు. ఇదియే సృష్టి రహస్యం. భుద్ధి బలంతో, ఆలోచనా శక్తితో, విచక్షణా జ్ఞానంతో ఆ రహస్యాన్ని అణ్వేషించు. అది నీయందే గలదు. నీ లక్ష్యం నీ ఆధీనమై యున్నది. లోతుగ వెళ్ళి తరచి చూడు. తత్త్వమసి. నీవే ఆ పర:బ్రహ్మవు. సన్మార్గ జీవితం ముఖ్యం. ఎంతకాలం బ్రతికామన్నది ముఖ్యం కాదు. దీర్ఘ జీవితం కన్న దివ్య జీవితం మిన్న. నాకు బాహ్య మందిరములకన్న హృదయాలయములు అనిన ఎక్కువ ప్రీతి. ప్రతి వ్యక్తి ఒక మహోన్నత మందిరముగ నిలవాలి. సమస్త నేనులకు నిలయమై నేనున్నాను. హెచ్చు తగ్గులు, రాకడ పోకడలు, జనన మరణములు నా నేనుకు ఏనాడు లేవు. నీవు సంపాదించిన ఆస్తిపాస్తులను పంచి ఇవ్వ వీలున్నది. కాని నీ కర్మను నీవే అనుభవించవలసి యున్నది. కర్మ శేషము ఉన్నంతకాలం జన్మ శేషము తప్పదు. సమస్త ఔషధముల మించినది ఆత్మజ్ఞాన జీవామృతము. ఆత్మస్ధైర్యమే దివ్యశక్తి. మీరు నాకు దూరముగా ఉండి ఎన్ని సమర్పించినా ఆత్మ నివేదనతో సరిపోవు. మీరెచ్చట యున్నను సరియే, మీలో నేను గుర్తుండిన అంతేచాలు. పత్రం, పుష్పం, ఫలం, తోయం అన్నట్లు ఎవరికి వీలున్న పరిధిలో వారు తమ మత ధర్మానుసారం సర్వకేంద్ర బాబా భావ నిమగ్నులు కండి. దీనికి మించిన భగవదారాధన లేదు. ఎన్ని సమర్పించినను నిన్ను నీవు సమర్పించుకొనక త్యాగం అనిపించదు. స్వపరిత్యాగమే స్వనిష్టకు దారియని మరువరాదు. నన్ను తెలుసుకొనుటకు ముందుగ నిన్ను నీవు తెలుసుకో. నిన్ను నీవెరుగుటే నా దర్శన మార్గం. ప్రతి నీవు నేనై యున్నాను. ఈ ఆంతర్యం గ్రహించిన సమస్త ఉపదేశములు ఇందేగలవు.

చిల్లర బూటక నాటకాలకు పైది భగవత్ స్ధితియని మరువరాదు. ఎవరి ఆత్మస్ధితిని వారు అనుభూతి పొందాలి. సహజమైన ఆత్మజ్ఞానాన్ని సులువుగ పొంద వీలున్నది. చేప పిల్ల పుట్టగనే నీటిలో ఈదుతుంది. అది దాని సహజ స్ధితి. అలాగే ఆత్మజ్ఞానము సహజసిద్ధమై యున్నదని మరువరాదు. దేహధ్యాసను మరిపింప జేయునవే దేవాలయములు. శారీరక, మానసిక రుగ్మతలను నివారించే నిజమైన ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలుగ దేవాలయములు వర్ధిల్లవలయును. ఇదియే దేవాలయాల స్ధాపనలోని కీలక ఉద్దేశ్యము. కేవలం విగ్రహ ప్రతిష్టలతోనే ఆగిపోరాదు. బాహ్యారాధనలతోపాటు అంతరాత్మ ఆరాధన ముఖ్యం. జీవితంలో ఎన్ని కోల్పోయినను ఆత్మ విశ్వాసమును మాత్రం కోల్పోరాదు. కష్టాలు, బాధలే ప్రేమకు గీటురాళ్ళు. బాధలను భరించటంలోనే ఆనందంగలదు. శక్తికి, విజ్ఞానానికి, ప్రేమకు బాధలే గీటురాళ్ళు. ఆత్మానుభవమే పరమ వైభవం. మానవుని సంకుచితత్త్వం వలననే విభజన ఏర్పడినది. విశాల దృష్టియే ఏకత్వ లక్ష్యం. దేహధ్యాసను, దేహాభిమానమును నిరసించి, జీవన పరిధినతిక్రమించి, కేవల ఆత్మౌపమ్య భావనిష్టకు మించిన బ్రాహ్మణత్వం, బ్రహ్మత్వం లేదు. లౌకిక జీవనపరిధి నుండి అలౌకిక ఆత్మజ్ఞాన స్ధితిలోకి పరిణతి చెందటమే నిజమైన పునరుత్తానం. శుభచిత్తమే స్వర్గద్వారం. పరిశుద్ధ మానసమే ఉత్తమ తీర్ధం. పునీత హృదయమును మించిన పుష్కర స్నానము, పవిత్ర మానసమును మించిన పాపనాశనం లేదు. మానవ చైతన్యం సార్ధకం కావలయుననిన దానికి మూలమైన ఈశ్వరత్వమును గ్రహించి, దానిని తన ద్వారా అభివ్యక్తం చేయాలి. అనంత విశ్వమును కర్మ బద్ధముగ ఏకత్వంలో నడిపిస్తున్న సర్వెశ్వరునితో తాదాత్మ్యం చెందటమే నిజముక్తి. ప్రతి మానవుని జీవితం ఒకే కేంద్రాన్ని ఆధారం చేసికొని ఉంటుంది. అదియే పవిత్ర ప్రేమ కేంద్రం.

(బాబా సర్వకేంద్రుల స్వహస్త లిఖిత దివ్య భాష్యాల నుండి)
సేకరణ: నాగులవంచ వసంత రావు, సచివాలయం.