Tuesday, April 29, 2008

ఆదర్శం – ఆచరణ

మనది ఆధ్యాత్మిక పుణ్యభూమి. ఎందరో మహాత్ములను, యోగులను కన్న ధన్యభూమి. విభిన్న సంస్కృతులు, సాంప్రదాయాలకు నిలయం భరత భూమి. సుప్రసిద్ధుల జీవిత చరిత్రలెన్నో మనకు తెలుసు. వచ్చిన చిక్కల్లా తెలుసుకున్న ఆదర్శాలను, మంచి అలవాట్లను ఆచరణలో పెట్టడంలోనే ఉంది. ఆదర్శాలు చెప్పడానికి, వినడానికి చాలా అందంగా, వినసొంపుగా ఉంటాయి. వాటిని నిత్యజీవితంలో ఆచరించుటకు జీవితాలనే ధారపోయవలసి ఉంటుంది. స్వసుఖాలను కొంతమేరకు త్యాగం చేయవలసి ఉంటుంది. “గొప్ప కార్యాలన్నీ గొప్ప త్యాగాల వల్లే సాధించబడతాయి” అన్నారు స్వామి వివేకానంద.

మనం అందరికంటే భిన్నంగా, గొప్పగా ఉండాలనుకుంటాం. ఇతరుల కంటే ఎక్కువ పేరు తెచ్చుకోవాలని ఉంటుంది. అందరికంటే ఎక్కువగా సంపాదించాలని ఉంటుంది. అలాంటప్పుడు మనం ఇతరులకంటే ఎక్కువ కష్టపడవలసి ఉంటుంది. ఎంతో త్యాగం చేయవలసి ఉంటుంది. సర్వ శక్తులను కూడదీసుకొని మన ఆదర్శంపై, ఆశయంపై మనస్సును లగ్నం చేయవలసి ఉంటుంది. అప్పుడే మనం ఆదర్శ జీవితాన్ని గడిపి, పదిమందికి స్ఫూర్తిదాయకంగా నిలువ గలుగుతాం.

“ఆదర్శంలేని జీవితం చుక్కాని లేని నావ వంటిది” అన్నారు పెద్దలు. అందులకే జీవితానికి ఒక ఆదర్శాన్ని, లక్ష్యాన్ని ఏర్పరచు కోవాలి. ఉత్తమమైన మార్గంలో పయనించినట్లైతే ఉన్నతమైన స్ధాయికి చేరుకో గలుగుతాం. దీనిని సాధించాలంటే మనిషికి చిత్తశుద్ధి, అకుంఠిత దీక్ష చాలా అవసరం. పట్టుదల లేకుంటే జీవితంలో ఏదీ సాధించలేం. ఆచరణ గొప్పగా ఉంటే అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చు.

సగటు మానవునికి ఆదర్శం అవసరముందా? ఒకవేళ ఉంటే దానివల్ల చేకూరే ప్రయోజనమేమిటి? ఇలాగనక ఆలోచిస్తే, నేటివరకు అవతరించిన మహాత్ములందరికీ ఆదర్శం ఉంది అని తెలుస్తుంది. అందుకే వారు అంత ఉన్నత స్ధాయికి ఎదగగలిగారు. ఒకవేళ సగటు మానవుడు అంత ఎత్తుకు ఎదగలేకపోయినా, ప్రస్తుతం మనమున్న స్ధితినుండి ఏ కొంచెం ఉన్నత స్ధాయికి ఎదగగలిగినా జన్మ తరించినట్లే. ఆదర్శం ఉన్న వ్యక్తి ఒక తప్పు చేస్తే ఆదర్శంలేని వ్యక్తి వంద తప్పులు చేసే అవకాశముంది. ప్రతివారు ఒక్క క్షణం ఆలోచించి ఈ విషయాన్ని హృదయస్తం చేసుకోగలిగితే “మన జీవితమంతా ఆనందాల పండగ”. అందుకే ఆదర్శాలను నిజ జీవితంలో ఆచరించి చూపి, పదిమందికి ఆదర్శప్రాయులమౌదాం.

నాగులవంచ వసంతరావు,
పి.ఏ., అటవీ శాఖ, సచివాలయం.

Monday, April 28, 2008

మృత్యు స్మరణ

మనకొచ్చిన చిక్కల్లా ఆపద మొక్కుల వల్లే. నేటి యాంత్రిక జీవన యానంలో మనిషికి ఈ క్షణం గడిస్తే చాలు, ఈ రోజు ముగిస్తే పదివేలు అన్నట్లుగా ఉంది. ఈ రోజు ఉల్లాసంగా, ఉత్సాహంగా, సంతోషంగా గడిచి పోతే చాలు. రేపటి సంగతి మనకెందుకు. జీవిత చరమాంకమైన మృత్యువు ఊసంటేనే గిట్టని పరిస్ధితి.

శరీర నిలుకడకు, ఇంద్రియాల అనుభవానికి మూలమైన ఆత్మ శక్తి గురించి
తెలుసుకోవాలనే ఆలోచనే తట్టదు. బాల్యం, యవ్వనం, వార్ధక్యం అనే దశలు దాటి మరణమనే దశకు అందరూ ఏదో ఒకనాడు సమీపించక తప్పదనే నగ్న సత్యాన్ని మానవుడు మాయలోపడి మరచిపోతూ ఉంటాదు. శవం ప్రక్కనే కూర్చుని కూడా నేను యవ్వనంలో ఉన్నాను, మంచి ఆరోగ్యంతో ఉన్నాను అని తలుస్తూ, మృత్యువు నాకు ఇప్పట్లో రాదులే అని అనుకుంటూ ఉంటారు. ఒకవేళ వచ్చినా ఎప్పుడో వస్తుందికదా, అప్పుడు చూద్దాంలే అని ఆలోచిస్తాం.

మన కళ్ళెదుట నగ్న సత్యాలు కనిపించినా, చరిత్ర గుణపాఠాలు వినిపించినా బుర్రకెక్కదు. లోక మాయకు వశమై, దృశ్యమాన ప్రపంచమే శాశ్వతం, సర్వస్వ మని భావిస్తూ, దేహాభిమానులమై జీవిస్తు న్నాం. మన రక్త సంబంధీకులో, బంధువులో, తెలిసినవారో మరణిస్తే ఏడుస్తాం, బాధపడతాం. ఆది శంకరులవారి ఉపదేశం ప్రకారం ఏడవవలసి వస్తే లోకంలో ఎవరు చనిపోయినా ఏడవాలి. అది మనకు ఎలాగూ సాధ్యం కాదు. లేదా ఎవరు చనిపోయిన ఏడవకుండా ఉండాలి. సాధన చేస్తే ఇది సాధ్యమే. అనివార్యమైన శరీర పతనమును గూర్చి విలపించడం అజ్ఞానమే అంటున్నారు.

మన రక్త సబంధీకులు, ఆత్మీయులు శరీరం చాలించినపుడు దు:ఖం రావడం సహజం. కాని ఆ మరణం మనకు కూడా ఏదో ఒక రోజున రాక తప్పదని ప్రతివారు గ్రహించాలి. మృత్యువు ఎప్పుడు వస్తుందో చెప్పి రాదు. సాధారణంగా మనం చాలా బలిష్టంగా, ఆరోగ్యంగా ఉన్నామని భావిస్తుంటాం. మృత్యువు మన దరిదాపులకు ఇప్పట్లో రాదని తలపోస్తుంటాం. కాని విధి ఏమాత్రం వక్రించినా, ప్రమాద రూపం లోనో, రుగ్మత రూపంలోనో తరుముకొని వచ్చి జీవితాన్ని కబళించి వేస్తుంది. ఆ పరమేశ్వరుడి పిలుపు ఎప్పుడు వినిపిస్తుందో ఊహించలేము.

అందులకై మానవుడు ఎల్లప్పుడు మృత్యుదేవత గురించి ఆలోచించాలి. మృత్యువు ఈశరీరాన్ని కబళించేలోగా మంచి పనులు చేస్తూ మాధవుని
అనుగ్రహం పొందాలి. నిస్వార్ధ జీవితం గడిపి జన్మ చరితార్ధం చేసుకోవాలి.

నాగులవంచ వసంతరావు,
పి.ఏ., అటవీ శాఖ, సచివాలయం.

Saturday, April 26, 2008

సజ్జన సాంగత్యం

మంచి భావాలు, నడవడికగల వ్యక్తుల కలయికే సత్సంగం. ఇలాంటి వ్యక్తులు ఒకచోట కలుసుకొని ఒకరి అభిప్రాయాలు మరొకరు తెలుసు కోవాలి. విజ్ఞులు, ప్రాజ్ఞులు, మేధావులు, సత్పురుషులు, పెద్దల ఉపన్యాసాలు వినే అవకాశం లభిస్తే పొరపాటునకూడా ఆ అవకాశాన్ని జారవిడుచు కోవద్దు.

ధర్మం కుంటికాలుతో కూడా కుంటలేక కుప్పకూలిపోతున్న ఈ కలికాలంలో అధర్మం, అన్యాయం, అత్యాచారాలు, ప్రేమోన్మాదాలు, ప్రతీకార వాంచలు తప్ప సదాచారాలు, ఉత్తమ సంస్కారాలు కంపించని ఈ రోజుల్లో మంచితనం, మానవత్వం గుండెలనిండా నింపుకున్న ప్రతిమనిషీ దేవునితో సమానమే. కనుక అలాంటి వ్యక్తుల్ని కలిసే అవకాశం లభిస్తే మనసారా చేతులు జోడించి వారికి నమస్కరించే అదృస్టం కలిగితే, ఆ అవకాశాన్ని ఎట్టి పరిస్ధితిలోనూ వదులుకోవద్దు.

మల్లెపూలతో కలిసిన మట్టిపెడ్డకు కూడా ఎలా ఆ మల్లెల సుగంధం అంటుకుంటుందో, సత్పురుషులతో కలవటంవలన వారియొక్క మంచితనం, మానవత్వాలలో ఎంతోకొంత అంటుకొనక మానదు. మంచితనం, మానవత్వం, దయాగుణం, నిస్వార్ధం ఇలాంటివన్నీ నిప్పురవ్వల లాంటివి. మెల్లగా అవి మండుతూ అవకాశం లభిస్తే దావానలాన్నే సృష్టించగలవు.కావున ఉన్నతమైన ఆ సద్గుణ బీజాలు మన మనసుల్లో నాటుకున్నత్లైతే అవి మహా వృక్షాలై మనల్ని మహనీయులుగా మలుస్తాయి. అందులకే “సజ్జనులతో చెలిమి – అన్నింటా కలిమి” అన్నారు పెద్దలు.

“సజ్జన సాంగత్యంబున మూర్ఖము సమసి విరాగము గలుగునురా, మూడులోకముల సత్సహవాసమె ముక్తినొసంగును దెలియుమురా” యని జగద్గురు శంకరాచార్యులవారు మానవాళికి సందేశమిచ్చారు. అందులకై సజ్జనులతో స్నేహం చేసి, వారిలో ఉన్న సద్గుణాలను స్వీకరించి, నిజజీవితంలో ఆచరించినట్లైతే అద్భుతమైన ఫలితాలను పొందవచ్చు. తద్వారా మనమూ సమాజంలో మన చుట్టూ ఉన్న పదిమందికి మంచి మార్గాన్ని చూపించి, మార్గదర్శకులుగా తయారవుదాం. బహుజన్మల పుణ్యపాక వశాన లభించిన మానవ జన్మను సార్ధకం చేసుకుందాం.

నాగులవంచ వసంతరావు
పి.ఏ., అటవీ శాఖ, సచివాలయం.

కోపం – నిగ్రహం

నిత్యజీవితంలో సమస్యల వత్తిడివల్ల అప్పుడప్పుడు కోపం ప్రదర్శిస్తూ ఉంటాం. అసలు మనిషికి కోపం రావడానికి కారణమేమిటి అని ఆలోచిస్తే – మనకు నచ్చని విషయాలు జరిగిపోతున్నప్పుడు, మనలోని తప్పులను ఇతరులు ఎత్తిచూపినప్పుడు సాధారణంగా అసహనం, కోపం కలుగుతుంది. మనలో ఏవో కొన్ని లోపాలుంటేనే ఎదుటివారు మనలను వేలెత్తి చూపెడతారు. అప్పుడు వెంటనే కోపం ప్రదర్శించక, ఆత్మ పరిశీలన గావించుకొని, మనలోని లోపాలను సవరించు కున్నట్లైతే కోపం వచ్చే అవకాశమేలేదు.

కొన్ని సార్లు కోపం వల్ల మనస్సు పాడైతే మరికొన్ని సందర్భాలలో అందుబాటులోగల వస్తువులు తమ ఆకృతిని కోల్పోతాయి. ఎటొచ్చి మరల కస్టపడి పగిలిన వస్తువులను తిరిగి కొనుక్కోవలసింది మనమేనన్న విషయం కోపంతో ఊగిపోయినప్పుడు మనకు స్ఫురించదు. అందుకే కోపం వచ్చినప్పుడు ఒకటినుండి పదివరకు లెక్కించమన్నారు పెద్దలు. ఈ లోపల
కోపం తగ్గే అవకాశముంది. ఇంకా ప్రశాంతంగాఅలోచిస్తే ఎదుటివారి మటల్లోకూడా సత్యమున్నదనే విషయం బోధపడుతుంది. “కోపం పాపం – శాంతం దైవ స్వరూపం” అన్నారు విజ్ఞులు.

శాంతం ప్రశాంతమైన మనస్సుకు, ఆనందమయ జీవితానికి దోహదం చేస్తుంది. మనిషి ఎల్లప్పుడు ప్రసన్న వదనంతో, విశాల హృదయంతో జీవించాలి. జీవన గమనంలో పరమానందాన్ని అనుభ వించాలి. ఆనందమే జీవన సారం. మనం ఆనందపుటంచులను చవి చూడాలంటే మనస్సు ప్రశాంతంగా, ప్రసన్నంగా ఉండాలి. పెదవులపై చిరునగవు తొణికిసలాడాలి. ఇవి మనిషిలోని అంతరంగ భావనలకు గీటురాళ్ళు. భూమాత సహనానికి ప్రతీక. సహనముంటేనే స్వామి ప్రసన్నం కాగలడు. బ్రతుకును బంగారు బాటగా మార్చగలడు.

తెలిసో తెలియకో నిత్యజీవితంలో మనలను ఎవరో ఒకరు సూటిపోటి మాటలతో పట్టరాని కోపం తెప్పిస్తుంటారు. తమ సంకుచిత భావంతో ఎదుటివారి మనస్సును గాయపరుస్తూ, ఇబ్బందికి గురిచేస్తూ ఉంటారు. అంతమాత్రం చేత మనం సహనాన్ని కోల్పోవలసిన్ అవసరం ఎంతమాత్రం లేదు. మన సహనమే మనకు శ్రీరామ రక్ష.

కోపం వల్ల వివేకం నశిస్తుంది. తద్వారా ఎన్నో అనర్ధాలు సంభ విస్తాయి. కావున అనేక అనర్ధాలకు కారణమైన కోపాన్ని ఎలాగైనా జయించాలి. ఎప్పటికప్పుడు ఆత్మ పరిశీలన గావించుకొని, మనస్సును అదుపులో పెట్టుకొని కోపాన్ని జయిద్దాం. శాంతమూర్తులమై స్వామి కృపకు పాత్రులమౌదాం.

నాగులవంచ వసంతరావు
పి.ఏ., అటవీ శాఖ, సచివాలయం.

Wednesday, April 23, 2008

ధైర్యలక్ష్మి

ధైర్యే సాహసే లక్ష్మి. ధైర్య సాహసాలు ప్రదర్శించినపుడే లక్ష్మి మనలను వరిస్తుంది. ఈ ప్రపంచములో ధైర్యమునకు మించిన గొప్ప సుగుణము మరొకటి లేదు. అందులకే భగవద్గీతలో శ్రీకృష్ణ భగవానుడు క్షుధ్రమైన హృదయ దౌర్భల్యమును వీడి కర్తవ్యమును నిర్వర్తించమని అర్జునునకు ఉపదేశించాడు. ఏ పనిని ప్రారంభించినా ధైర్యముతో మొదలుపెట్టి చివరివరకు పోరాడి కార్యాన్ని సాధించమని పెద్దలు చెప్పారు. ఏది జారినా మరల సవరించుకోవచ్చు గాని, గుండె గనక జారిందా మన పని గోవిందా! తప్పు అసలు చేయకూడదు. తప్పుచేయడం తప్పనిసరియైనపుడు అత్యంత ధైర్యముతో చేయమన్నారు స్వామి వివేకానంద. పిరికితనం ఏ రంగంలోనూ పనికిరాదన్నారు విజ్ఞులు. మన అభిప్రాయాలను, ఆశయాలను నిర్భయముగా ప్రకటించుకొనే ధైర్యాన్ని మనం సంపాదించు కోవాలి. ఇతరులు ఏమను కుంటారో అని సత్యాన్ని వక్రీకరించడం ఆత్మ ద్రోహమే అవుతుంది.

శతకోటి సింగబలము, అకుంఠిత దృఢ సంకల్పం, అఖండ ధైర్య సాహసాలు అద్భుత కార్యసాధనకు అత్యంత ఆవశ్యకములు. సుగుణములలో ధైర్యగుణము మొదటిది. ఆందులకే మహాభారత సంగ్రామములో అర్జునుడు మాయా మోహితుడై ధైర్యము కోల్పోయి యుద్ధము చేయనని చతికిలబడ్డపుడు శ్రీకృష్ణుడు రకరకములైన ఉపమానములతో ధైర్యాన్ని నూరిపోసి, మమకార భావమును తొలగించి, యుద్ధానికి సన్నద్ధం చేశాడు.

మానవ జీవితంలో నిత్యకృత్యాలలో ధైర్యం ప్రదర్శించాలంటే ముందుగా నిత్యానిత్య వస్తు వివేచన చాలా అవసరము. అంటే ముందుగా మనం జ్ఞానాన్ని సంపాదించాలి. అప్పుడు మనకు ధైర్యము దానంతట అదే వస్తుంది. మనస్సు దృఢంగా, స్ధిరంగా ఉండాలి. మనస్సు బలహీనపడినపుడే మాయలు, మంత్రాలు, మహత్తులు, యంత్రాలు, తంత్రాలు, తాయెత్తులు, గారడీ విద్యలు పనిచేస్తాయి. ఆ బలహీన క్షణంలోనే క్షుధ్రశక్తులు మనస్సును లొంగదీసుకుంటాయి.

నకిలీ స్వాములు, బాబాలు, అమాయక ప్రజలను క్షుధ్ర లీలలతో విచిత్రాలు చూపించి మనస్సును బలహీనపరచి అన్ని విధాలా దోచుకుంటారు. ఓక్కసారి మనస్సు గట్టిపడి, పూర్తిగా వశమై, సాత్వీక స్వభావముతో నిండిపోతే ఇక ఇవేవీ నీవద్ద పనిచేయవు. మనం వాటిని నమ్మవలసిన పనేలేదు. అందుకే మనం ముందుగా స్ధిరచిత్తులమై, గంభీర స్వభావాన్ని కలిగి ఉంటే, మనపై మనకు పూర్తి విశ్వాసం ఏర్పడితే ఈ ప్రపంచములోగల ఏశక్తి మనలను ప్రలోభపెట్టలేదు. ఎవరి చెడు ప్రేరణకు మనం ఎంతమాత్రం లొంగిపోము.

- నాగులవంచ వసంతరావు
పి.ఏ., అటవీ శాఖ, సచివాలయం

Tuesday, April 22, 2008

అందం నీ పాలిటి బంధం

మానవ జీవితంలో అందానికి చాలా ప్రాధాన్యత కలదు. ఫ్రతి జీవి తాను చాలా అందంగా ఉన్నానని, ఉండాలని తలపోస్తుంది. పరిసరాలను, వస్తువులను శుభ్రంగా, అందంగా, ఆకర్షణీయంగా ఉంచుకోవాలని ప్రతివారు తపన పడుతుంటారు. అందంగా, ఆకర్షణీయంగా ఉండడం అన్ని విధాల మంచిదే. కాని ఆ అందం మన సొంతం కావాలని ఎప్పుడైతే మనస్సులో కోరిక పుడుతుందో అప్పటి నుండి మానవుడికి కస్టాలు మొదలవుతాయి.

ప్రకృతిలో ఎన్నో అందమైన వస్తువులున్నాయి. వాటిని చూసి ఆరాధించాలి, అనందిచాలి. అంతేకాని అవి స్వంతం కావాలని కోరుకున్న మరుక్షణంలో మానవుడు కస్టాల కడలిలో, దు:ఖ సముద్రంలో మునిగిపోతాడు. బంగారు లేడి అందాన్ని చూసి ముచ్చటపడి దానిని తెచ్చి పెట్టమని తన భర్తయైన శ్రీ రమచంద్రుడిని కోరిన సీతాదేవి జీవితం ఏమైనదో మనందరికీ బాగా తెలుసు. అందానికి దాసుడై, కామాంధకారంతో సీతను చెరపట్టిన రావణాసురుడి బ్రతుకు ఎలా ముగిసిందో మనకు రామాయణ గాధ స్పష్టంగా బోధిస్తుంది.

అందమనే సంకెళ్ళలో చిక్కుకుని పరస్త్రీ వ్యామోహంలో పడి రాజ్యాలను పోగొట్టుకున్న రాజుల చరిత్రలు మనకు బాగా తెలుసు. ప్రస్తుతం మన చుట్టూవున్న సమాజంలో అందానికి దాసులై పరస్త్రీ వ్యామోహంలో ఇంటిని, ఒంటిని గుల్లచేసుకుంటున్న మన సాటి మనిషి పరిస్ధితి ఏమిటో మనం కళ్ళారా చూస్తున్నాం, చెవులారా వింటున్నాం. ఆ చూసిన దాన్ని, విన్న దాన్ని విశ్లేషణ చేసుకుంటూ, మనస్సును విశాలం గావించి, నిత్యానిత్య వస్తు వివేచన చేసుకొని, మనలను మనం క్షణికమైన ఆనందాలనుండి, ఉద్రేక ఉద్వేగాలనుండి రక్షించుకొని, అందమనే విషవలయం నుండి బయటపడాలి.

ప్రస్తుతం మన కళ్ళముందు జరుగుతున్న సంఘటనలను గనక ఒక్కసారి సునిశితంగా పరిశీలించినట్లైతే “అందాన్ని స్వంతం చేసుకోవాలన్న స్వార్ధ చింతన కలిగితే, అది మన పాలిటి బంధమవుతుందని” స్పష్టమవుతుంది. అందం వెనకాలే దు:ఖం, కస్టం కూడా నేనున్నానని వెంటాడి వేధిస్తుంది. సమాజంలో మన విలువను తగ్గిస్తుంది. అందులకే మనస్సును నియంత్రించుకుని, భగవంతుని తత్త్వాన్ని అనుభూతి చేసుకోవాలి. అశాశ్వతమైన అందాల వెంట పరుగెత్తి బంధాలలో చిక్కుకోవద్దని శాస్త్రాలు హెచ్చరిస్తున్నాయి.

- నాగులవంచ వసంతరావు
పి.ఏ., అటవీ శాఖ, సచివాలయం

Thursday, April 17, 2008

సంపూర్ణ దైవదర్శనం

వివేక దృష్టితో గాంచిన తానన్నా, జగమన్నా, బ్రహ్మమన్నా ఒక్కటే. తానుంటేనే జగమనేది ఉంటుంది. తాను లేనపుడు జగం లేదు. తాను, జగములు రెండు బ్రహ్మమునుండి వచ్చినవే. నిజ దృష్టితో పరికించిన జీవుడు దైవత్వమునకు అభిన్నం. భగవంతునిచే ఉద్భవించిన జీవులు భగవత్ స్వరూపులే కాగలరు. బెల్లముతో చేసిన వంటకములు తీపిగ ఉండునేగాని చేదుగ ఉండవు. అలాగే జీవులు దైవాత్మ స్వరూపులేగాని వేరుకాదు. పర:బ్రహ్మ యొక్క అంశ రూపముగల జీవుడు సాంసారికమైన మాయలోపడి తన నిజరూపమును తెలియజాలకున్నాడు. నేను దైవాంశమనియు తెలియలేకున్నాడు. ఇట్టిజ్ఞానము కలుగుటయే విశిష్టాద్వైత సిద్ధాంత సాఫల్యము. భగవద్భావనగల జీవుడు భగవత్ కృపచే భగవత్ స్వరూపమై భాసిల్లగలడు. మోక్షమనిన, స్వర్గమనిన అదొక ప్రత్యేక స్ధలము కాదు. కేవలం దివ్యానుభూతి. మానవుడు జ్ఞాన దశలో జ్ఞానేంద్రియముల వశము గావించుకొని ద్వంద్వాతీతుడై మోహవర్జితుడగును. ఇదియే మోక్షావస్ధ.ఈ మోక్షము ఇంకెచ్చటనో బయటలేదు. తనలో తాను రమించినపుడే అనుభూతి కాగలదు. మోహ విసర్జనమే మోక్షమునకు దారి.

ప్రతి భక్తుడు స్వకీయ సాధనలో ఇంద్రియాలను, మనస్సును, అహంకారాన్ని జయించి, రాగద్వేషాదులను, సుఖదు:ఖ ద్వంద్వాలను అతిక్రమించి, దేహేంద్రియ మనంబులను ఈశ్వరార్పణ గావించుటే నిజమైన భక్తి. ఏ ప్రాణిపట్ల వైరభావం లేకుండ, భగవంతునిపై తప్ప ఏ ఇతరముపై కోరిక లేకుండుటయే మోక్ష ప్రాప్తికి ఉపాయము. యధార్ధ భక్తుల పాద ధూళి సర్వలోక పర్యంతం పవిత్రం చేస్తుంది. ఒకతరం నాటిన పనస మరుసటి తరానికి ఫలములనిస్తుంది. ఆలాగే ఒక జన్మలోని పుణ్య కర్మలు మరుసటి జన్మలో ఫలితమునిచ్చును. ఆందులకే ముందు జన్మ సార్ధకం గావాలనిన ఈ జన్మలోనే సత్కర్మలు చేయాలి. అందం, చదువు, అధికారం, కులం, మతం ఇవేవియును మంచి జన్మకు ఉపకరించవు.

ప్రతి జీవి ఘనీభవించిన మోక్ష స్వరూపమే. నీవే నిత్య శుద్ధ, భుద్ధ, ముక్త స్వరూపివి. అట్టి మన నిజస్ధితిని మరువటం ఘోర పాపం. భక్తుడు, భక్తి, భగవంతుడు ఈ మూడు ఏకావస్థ నొందుటయే పరిపూర్ణ దైవస్థితి. భ్రమర కీటక న్యాయానుసారం, నీవు ఆరాధించు ఆరాధ్య మూర్తి స్వరూపముగా నిలిచినపుడే నీ ధ్యానం పూర్తి ఐనట్లు. ఆంత్య సమయమున స్మృతికి వచ్చునదే జీవితమునకెల్ల ఫలము. మనం ఎలా కాదలంచిన అలా అయ్యే శక్తి మనకుంది. భగవంతుడనిన వ్యష్టిగా ఒక వ్యక్తి కాదు. సమిష్టిగా సర్వశక్తి. వ్యష్టిగ నీ ఆలోచనలను మానుకొని, వ్యక్తి మనస్సును అనంత విశ్వ మనస్సులో విలీనపరచాలి. అట్టి అఖండ సంకల్ప శక్తిని లౌకిక విషయాలలో చొప్పించరాదు. సమస్త దేవతా చక్రవర్తివి నీవే. మొక్కోటి దేవతలు నీయందే మూర్తీభవించి యున్నారు. ఈ రహస్యం ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. స్మృతి రూపమైన జగాన్ని పూర్తిగ మరచిపోయి నీవు నీవుగ ఉండటమే నిజ మోక్షం. సూర్యుడు ఉదయించగానే మంచు కరిగిపోవునట్లు ఆత్మదర్శనం కాగానే ఆత్మ నిలువదు. దేహమనే దేవాలయములో సోహంభావార్చనకు మించిన ఆరాధనలేదు. దైవమును హృదయములోనే గాదు విశ్వమంతటిలో దర్శించగలగాలి. భవంతుని తెలుసుకొనుటకు ముందుగ మనలను మనం తెలుసుకోవాలి. అపుడే చక్కటి దైవానుభూతి చిక్కగలదు.

ఉద్ధరణ పైనుండికాదు, తనలోనుండి జరగాలి. నివురుగప్పిన నిప్పువలె తనయందు నిద్రాణమై వున్న ఆత్మశక్తిని మేల్కొల్పుటయే నిజమైన ఉపదేశం. ఇది ఒకరు ఇచ్చేది, మరొకరు పుచ్చుకునేది కాదు. కేవలం తనలో ఉన్నదానిని తెలియపరచటం. ఓ వివేకీ మేలుకో! ఫ్రజ్ఞను నిండా వికసింపజేయి. ఎదుటివారిలోని సుగుణాలను, దివ్యత్వమును గౌరవించి, పూజించాలిగాని నీలోని దివ్యత్వమును సాక్షాత్కరించుకో! అలాగాకుండ నిన్ను నీవు మరుగుపరచుకొని ఏమి చేసినా వృధా శ్రమయే కాగలదు. సమస్త అద్భుతములు, లీలలు, మహత్తులు నీ నిజస్ధితికి అతీతములు ఏనాటికి కావు. అట్టి నిన్ను నీవు తెలుసుకో.

జీవాత్మలు జలబిందువులు. జలబిందువు సాగరమునకు వేరుగ ఊంది ఎంత చింతించినా, ధ్యానించినా సాగరం ఉనికి తెలియదు. జలబించువు సాగరము లో లయించిన అది సాగర రూపం చెందగలదు. అలాగే అనంత దైవస్ధితిని అనంత పరిధిలో నిల్చిననే గ్రహించుటకు వీలవుతుంది. కావున మనం అనంత విశ్వ హృదయులం కావాలి. మానవుడు సంకుచిత జలబిందువు దృష్టి వీడి సాగర స్వరూప ప్రజ్ఞతో వర్ధిల్లాలి. సర్వమత గ్రంధముల, సమస్త బోధనల సారాంశమిదియే.

బాహ్యంలో ఉంచబడిన కుండ లోన, బయట ఒకే ఆకాశం కలదు. కాని కుండలోనిది ఘటాకాశము, బయటిది మఠాకాశం. కుండ పెంకు భిన్నత్వమును సూచిస్తుంది. కుండ పగిలిన కేవలం ఆకాశం మిగులుతుంది. దేహి ఘటాకాశం వంటిది. దేహమనే ఆటంకం తొలగిన సర్వ దేహి నేనే, సర్వాంతరాత్మ నేననే స్ధితి బోధపడుతుంది. ఫూజార్హమైన పర:బ్రహ్మ స్ధితి నీయందే మూర్తీభవించి యున్నది. దీనిని మరచి దేని ముందు సాగిలబడినా లాభంలేదని తెలియాలి.

ఈ సృష్టి సమస్తం ఏ శక్తిని ఆశ్రయించి నడుస్తుందో, ఆ శక్తి నీయందు కూడా కలదు. అంతర్ముఖుడవై స్వనిష్టనొందాలి. సమస్త సాధనల,యోగ సిద్ధుల సారాంశమిదియే. దివ్య స్వభావ శక్తి విద్యుత్ తేజమును మించినది. అందువలన భావమును భగవన్మయము చేయాలి. ఈ స్ధితిలో సమస్తము దైవ స్వరూపముగ గోచరిస్తుంది. హృదయాంతర్వాణిని విని, అంతర్ స్వరమును అనుసరించువారికి వేరే బాహ్య గ్రంధములతో పనిలేదు. తానే విశ్వమత మహగ్రంధము కాగలడు. నీ నిజాత్మ దివ్య స్ధితిని విస్మరించి వేరే ఎక్కడో దైవస్ధితిని ఊహించుట భూటకము. ఏ విషయములోనైనా ఒకరు చెప్పేది అప్పటివరకే. అందులకే నీవు నీవుగ ఆలోచించు. సత్యాన్ని అన్వేషించి దర్శించు. అప్పుడు నేవే సాక్షాత్ సత్యాత్మ స్వరూపుడవని తెలియగలదు. ఎటువంటి భావ చింతన గలవారు అటువంటి భావ సిద్ధిని పొందగలరు. దైవభావం గలవారు దైవ స్వభావ స్వరూపమును పొంది నిలిచెదరు.

నిలుకడలేని మనస్సుకు సంకెళ్ళువేసి, బహిర్ముఖ పదార్ధములవైపు పయనించకుండ, మదపుటేనుగును లొంగదీయుటకు అంకుశమువలె నియమ నిష్టలు, దీక్షలు, వ్రతములు, ఆరాధనలు, చాతుర్మాస్య వ్రతములు ఆకోవలోనివి. మనస్సు యోచనలో కేంద్రీకరింప బడినపుడు అది మానస పూజ. దీనిచే అజ్ఞాని జ్ఞాని యగును. మానవుడు మాధవుడగును. ఏనాటికి చావులేనిది, మార్పులేనిది, నాశనంలేనీ ఏదో దానిని తెలుసుకోవాలి. ఏది మాత్రం గలదో అదియే నీ స్వరూపమని నిశ్చయించుకో. ఈ అనంత విశ్వ పర్యంతం దేవుడు కానిది, దేవుడు లేనిది ఏదియును లేదని తెలియవలయును. దేవునికి భిన్నముగా ఆలోచించునదంతయు అసత్య మని తెలుసుకోవాలి.

స్వస్వరూప ఆత్మ పరిజ్ఞానమును కలిగించలేని నిరర్ధక మార్గాలకు స్వస్తి చెప్పాలి. ఎవరికి వీలున్న పరిధిలో వారు దైవ సాక్షాత్కారము కొరకు ప్రయత్నించ వచ్చు గాని ఆ మార్గం మనకు ఆత్మ సాక్షాత్కారము కలిగించునదిగా ఉండాలి. సాధనలన్నియును ఆత్మ సాక్షాత్కారముతో ఆగిపోగలవు. కేవలం ఆత్మ స్దితిలో ద్వంద్వ బంధాలు లేవు. నీవు సాక్షాత్ సర్వేశ్వర దైవ స్వరూపమేగాని వేరుకాదు. ఆ అనుభూతిని పొందు పర్యంతం సాధకులు విశ్రమించరాదు. నీలో ఉన్న నీవు ఈశ్వరుడే. జగమంతయు ఈశ్వరుడే. కేవలం తన్ను తానుగ ఉన్నది ఈశ్వరుడే. ఆ మూడు స్ధితులలో సర్వేకత్వ పరిపూర్ణ దైవ స్ధితిలో నిండియున్నది నీవే. కేవలం ఆత్మ జ్ఞానం సిద్ధించువరకే జీవేశ్వర బేధము. ఆత్మ జ్ఞాన స్ధితిలో జీవత్వం లయించి, ఈశ్వరత్వం శేషించును. సర్వంలో తాను నిండి యుండి, సర్వమును కలిగియున్నవాడే వాసుదేవుడని తెలియాలి. ప్రతి ప్రాణిలో ఉన్నది వాసుదేవుడే. జగమంతయు వాసుదేవుడే. జీవేశ్వర, జగదీశ్వర, కేవల సర్వేశ్వర ఈ మూడు స్ధితులలోని త్రిత్వేక సంపూర్ణ దైవత్వం నీది. పరమాణువును సైతం విస్మరించకుండ సమస్తమును ఐక్య పరచి చూడాలి. అదియే దైవ దర్శనం.
కలియుగమనగా కంగారు యుగమని అర్ధము. ప్రపంచమతా టెన్షన్ మయం. ఎవరిని మందలించినా సమస్యలే. సమస్యల వలయం నుండి బయట పడవలయుననిన కేవలం ఆత్మ సాక్షాత్కార జ్ఞాన మొక్కటే శరణ్యం. అజ్ఞానమే అన్ని సమస్యలకు మూలం. ఎవరి ముక్తి వారి స్వాధీనమై యున్నది. అజ్ఞాన బంధ నివృత్తియే నిజమైన ముక్తియని గ్రహించవలయును. ముక్తి, మోక్షం అని ఆకాశం వైపు అర్రులు చాచి చూడవలసిన పనిలేదు. చిన్మయ పరమార్ధ దృష్ట్యా ప్రతి జీవి ఘనీభవించిన దివ్య మోక్ష స్వరూపమేనని గ్రహించాలి. అదియే సంపూర్ణ దైవ దర్శనం.

- నాగులవంచ వసంతరావు,
పి.ఏ., అటవీ శాఖ, సచివాలయం.

Monday, April 7, 2008

నవ చైతన్యం

పండంటి బిడ్డనుకనాలని
ఆలుమగల ఆరాటం
బంగారు భవిష్యత్తునివ్వాలని
బహువిధాల పోరాటం

మురిపాల ముచ్చట్లతో
ముగిసిపోతుంది బాల్యం

చక్కనైన చదువు చెప్పించాలని
చుక్కలనంటే స్కూలు ఫీజులతో
బిడ్డ భవిష్యత్తును భూతద్దంలో చూసి
తాను కొవ్వొత్తిలా కరిగినా
కన్న బిడ్డల కలలు పండాలని

తనలా కస్టాలపాలు కావద్దని
బిడ్డ భవిష్యత్తు భలేగా ఊహించి
లెక్కలేని త్యాగాలెన్నో చేసి
బిడ్డ బి.టెక్ డిగ్రీ చూసి
మురిసిపోతున్న మాతాపితరులకు

కాలం సర్పమై కాటేస్తుందని
భవిష్యత్తు బంగారు బాట కాదని
ఊహ వాస్తవానికి బహు దూరమని
బిడ్డ ఎదురుతిరిగినప్పుడు తెలిసింది

బిడ్డకు తర్ఫీదునివ్వాలని
పనిలో ప్రావీణ్యులని చేయాలని
చెవిలో చెట్లు మొలిచేలా అరిస్తే
నాది నాకు తెలియదాయని బిడ్డ ఆక్రోషం

ప్రతినిత్యం పిల్లి ఎలుకల పోరాటం
బిడ్డలో మార్పు తేవాలనే ఆరాటం

తెల్లవారితే బుల్లితెరముందు మకాం
కలర్ ఫుల్ కంప్యూటర్తో కాలక్షేపం
నేస్తంతో నెట్లో చాటింగ్
సెల్ తో సవాలక్ష టాకింగ్

కాదన్న తల్లిదండ్రులపై కసుర్లు
ఏమో సాధిస్తామని భ్రమ కల్పనలు
పరులముందు ప్రయోజకులమన్న ఫోజు
ప్రతినిత్యం మనకిది రివాజు

పనిచెబితే పట్టరాని కోపం
నేటి యువతరానికిదో శాపం
భాద్యతలంటే అంతులేని భయం
జీవితమంటే జల్సాల మయం

మంచిమాట చెబితే చెవుల మూత
మారమంటే చెప్పలేని బాధ
ప్రతి క్షణం ఊహాలోకంలో విహారం
తిరోగమనం వైపు యువత ప్రయాణం

ఎక్కడున్నారో స్థితప్రజ్ఞులను కన్న తల్లిదండ్రులు
అంజనంవేసి పట్టుకోవాలనుంది
కనిపిస్తే కాళ్ళమీద పడాలనుంది
అభినందనల వర్షం కురిపించాలనుంది

క్రమశిక్షణలేని నేటి యువతకు
ఇప్పటికైనా కనువిప్పు కలిగించేలా
వ్యక్తిత్వం వికసించిన యువతను
మనసారా ఆశీర్వదించాలనుంది

ఓ సర్వధారి సంవత్సరమా!
నీ సర్వశక్తులను సమీకరించి
యువతలో నవచైతన్యం పెంచి
భావి పౌరులను బాగుపరుస్తావని ఆశిస్తున్నాం

- నాగులవంచ వసంతరావు
పి.ఏ., అటవీ శాఖ, సచివాలయం.

Thursday, April 3, 2008

శుద్ధ దండగ

లోభివాని ధనం
దాహం తీర్చని ఎండమావి
సుగంధంలేని అందమైన పుష్పం
సారంలేని భూమి
కంచెలేని చేను
మాధుర్యం లేని మాట
తన్మయత్వంలేని పాట
సహజత్వంలేని నటన
ప్రేమించలేని హృదయం
సర్దుబాటులేని దాంపత్యం
సచ్చీలతలేని సాంప్రదాయం
త్యాగంలేని జీవితం
పరోపకారం తలంచని బుద్ధి
ప్రావీణ్యతలేని పని
భక్తిలేని పూజ
సంస్కారంలేని చదువు
తృప్తిలేని జీవితం
ధర్మంలేని సంపాదన
నైతిక విలువలులేని నడత
మానవత్వంలేని మతం
సమానత్వంలేని సమాజం
ఏకాగ్రతలేని పుస్తక పఠనం
గమ్యంలేని ప్రయాణం
ఆపదలో ఆదుకోని స్నేహితుడు
ముందుచూపులేని ఆలోచన
ఆచరణలేని ఆదర్శం
ఆత్మ సాక్షాత్కారం పొందని మానవ జన్మ
శుద్ధ దండగ

- నాగులవంచ వసంతరావు
పి.ఏ., అటవీ శాఖ, సచివాలయం

Wednesday, April 2, 2008

త్యాగమూర్తి

పురిట్లోనే తల్లిని పోగొట్టుకున్న నాకు
అపర తల్లివై ఆలన పాలన అందించావు

ఉన్నంతలో గంజి గటక నువు తాగుతూ
ప్రేమతో వరిబియ్యం నాకు వండిపెట్టావు

ముతకబట్టలు ధరించి మొద్దు కస్టం చేస్తూ
పాలిస్టర్ బట్టలతో నన్ను పైచదువులకు పంపావు

అర్ధరూపాయి ఫీజు కట్టడానికి నీవుపడ్డ
అష్టకష్టాలింకా గుర్తుకొస్తూనే ఉన్నాయి

దుక్కి దున్ని రక్తాన్ని చేమటగా మార్చి
నన్నొక ఆఫీసరుగా చూడడానికి అస్తిపంజరమైనావు

ఎంతని ఏమని వర్ణించను నాన్నా నీవు చేసిన త్యాగాన్ని
ఎలా తీర్చుకొనేది ఈ జన్మలో నీ ఋణాన్ని

ఆ భగవంతుణ్ణి నేను కోరేదొక్కటే నాన్నా!

కొంతమంది కసాయి కొడుకులవలె నిన్ను
వృద్ధాశ్రమాలకు పంపని మంచి హృదయమివ్వమని

పితృప్రేమతో నావద్దే నిన్ను ఉంచుకొని
కడసారివరకు కంటికి రెప్పలా కాపాడుకోవాలని

మరుజన్మలో నీవు నా కొడుకుగా పుడితే
తండ్రి పాత్రలో నీ ఋణం తృప్తిగా తీర్చుకోవాలని!

- నాగులవంచ వసంత రావు,
పి.ఏ., అటవీ శాఖ, సచివాలయం.

Tuesday, April 1, 2008

ఆత్మవిశ్వాసం

సప్త సముద్రాలు యింకి ఆవిరైపోయినా
భూమండలమంతా బొంగరంలా తిరిగినా
ధరిత్రిమాత దద్దరిల్లి లావాయే చిమ్మినా
గెలాక్సీ గ్రహమండలాల గతులు మారిపోయినా
ఆటంబాంబు విస్పోటనం హాహాకారాలు రేపినా
పంచభూతములన్ని పగబట్టి పీడించినా
ఇంద్రియములు వశముదప్పి ఇబ్బందులు పెట్టినా
మనసు మిగుల చంచలమై మారాము చేసినా
లోకమంత ఎదురుతిరిగి నిన్ను వెక్కిరించినా
అసంఖ్యాక అపజయాలు అపహాస్యం చేసినా
నిరాశా నిస్పృహలు నీరుగార్చి వేసినా
కస్టాల కడలి నిన్ను నట్టేట ముంచినా
భవిష్యత్తు బహు అంధకార బంధురమై తోచినా
ఆత్మ విశ్వాసమొక్కటుంటె ఆనందం నీదిరా
తనను తాను నమ్ముటే అన్ని బలహీనతలకు మందురా
ఉజ్వలమైన భవిష్యత్తు యువతరానికుందిరా
అంతులేని ఆత్మశక్తి అందరిలో యుండగా
నివురుగప్పిన నిప్పువలె నిద్రాణమై యుందిరా
యద్భావం దద్భవతన్నది యదార్ధమని నమ్మరా
మంచి మంచి అలోచనలు మదినిండా నింపరా
సదాచార సంపత్తితొ హృదయశుద్ధి చేయరా
సద్భావనయనెటి మంచి విత్తు నాటి చూడరా
చక్కనైన మొక్క యొకటి హృదిలో మొలకెత్తురా
నిర్భయమనె నీరుపోసి నిటారుగ పెంచరా
ఆశావహ దృక్పధమనె కంచెతొ కాపాడరా
ఉత్సాహపు ఉల్లాసపు పురుగుమంధు చల్లరా
నిరాశా నిస్పృహలనె కీటకాల చంపరా
మానవతా పరిమళాల మంచి పూలు పూయురా
నిస్వార్ధ సేవ యనే పిందెలు వేలాడురా
త్యాగమ్ము ప్రేమయనెటి కాయలుగా మారురా
ఆత్మవిశ్వాసమనే అమృతఫలము వచ్చురా
ఆరగించి చూడగ అణువణువులోన వ్యాపించి
అద్భుత విజయాలనెన్నొ అనుభవానికి తెచ్చురా

- నాగులవంచ వసంత రావు
పి.ఏ.అటవీ శాఖ, సచివాలయం.