Friday, December 14, 2007

బాబా సర్వకేంద్రుల సంక్షిప్త జీవిత చరిత్ర

ఓం శ్రీ వేదపూజ్య నేతిహరి కాళీ బాబా (బాబా సర్వకెంద్ర) గారి దివ్య పాదారవిందములకు సాష్ఠాంగ దండ ప్రణామములు సమర్పించి, శ్రీవారి సంక్షిప్త జీవిత చరిత్రను రాబోవు తరములవారికి మార్గదర్శకముగా నుండునట్లు లిఖించనైనది.

నా స్వగ్రామమైన సర్వారం (నల్లగొండ జిల్లా)కు మూడు కిలోమీటర్ల దూరంలోగల ఇండ్లూరు గ్రామమందు కీ.శే. శ్రీమతి పుల్లమాంబ, రాజయోగీంద్రులు శ్రీ చెంచల బుచ్చిరామ స్వామి పుణ్య దంపతులకు ప్రధమ పుత్రుడుగా 1943 సంవత్సరం లో కార్తీక పౌర్ణమి పర్వదినమున స్వామివారి శారీరక అవతరణ జరిగినది. శ్రీవారి శారీరక నామధేయం శ్రీ వీరభధ్రం గారు.

బాబా సర్వకేంద్రులు ఉపాధ్యాయ వృత్తిని ఎన్నుకోవటంలోని ఆంతర్యములు 1) లౌకిక పరిధిలో ఉపాధ్యాయ పదవి సర్వోత్కృష్ఠమైనది. 2) విద్యార్ధులకు ఉపాధ్యాయుడనై ఉన్నాననెటి వాక్యమును సత్యపరుచు నిమిత్తం శ్రీవారు ఉపాధ్యాయ పదవిని ఎన్నుకొన్నారు. 3) సరస్వతీ స్వరూపులైన విద్యార్ధిని విద్యార్ధుల మనస్తత్త్వం తెలుసుకొనే వీలుంటుందని. 4) సెలవులలో గ్రంధ రచనలు చేయవచ్చునని.

ఏ రెకమండేషన్లు లేకుండ బేసిక్ ట్రైనింగ్ లో నల్లగొండ జిల్లా, సూర్యాపేటలో సెలక్టు ఐనారు. స్వామివారి ప్రజ్ఞ అనంతానంతం, వర్ణనాతీతం. బాల్యదశలో 4వ తరగతి చదువునపుడు డిక్టేషన్ మరియు పుస్తక పఠనలో మాతృభాషలో 11వ తరగతి విద్యార్థులను అధిగమించారు. బాల్యదశలో విద్యార్థులను ఒకచోట కూర్చుండబెట్టి చేత బెత్తంపట్టి అరుగుపై కూర్చిండి నేను సారును, మీరు పిల్లలని పాఠములు చెప్పెడివారట.

హైస్కూల్ విద్య పూర్తి గావించేసరికి పలకలు, బలపములు, పుస్తకములు ఉచితముగ సరఫరా చేయు ప్రభుత్వ ఆధీన వయోజన పాఠశాలలు, రాత్రి బడులు నడిపి ఎందరో నిరక్షరాస్యులను అక్షరాస్యుల గావించినారు.

బేసిక్ ట్రైనింగ్ లో రెండు సంవత్సరములు గడిపినారు. ఆ సమయంలో మానసిక శాస్త్రమును అందరికి స్పష్టముగ తెలియునట్లు వారి వారి కోరికపై వారి నివాసములకు వెళ్ళి చెప్పెడివారు.

07-09-1965 నాడు ఉపాధ్యాయ పదవిలో నియామకము జరిగినది. ఆగా మోత్కూరు హైస్కూలు నందు పోస్టింగ్ ఇవ్వబడినది. శ్రీవారు మాతృభాషను బోధించెడివారు. వారి బోధనా పటిమ అనర్గళము. వారు సుప్రబోధకా చార్య శిఖామణులు. గద్యమేగాని, పద్యమేగాని వారు బోధించు నపుడు పుస్తకము చదివి అంతవరకే గాకుండ లోతుగ వెళ్ళి తరచి మూలమువరకు బోధించేవారు. వారి పీరియడ్లో ఏష్ట, విసుగు రాకపోయెడిది. కన్నులకు కట్టినట్లు నేత్రపర్వముగ, శ్రవణానంద దాయకముగ, హృదయ రంజకముగ వారి బోధన గంగా ప్రవాహమును బోలి యుండెడిది.ఇంటికి దగ్గరగా ఉండవలయునని ఆగామోత్కూరు ఉన్నత పాఠశాలనుండి బదిలీ గావింపబడి మా ఊరికి వచ్చారు. మా ఇంటి ప్రక్కనేగల పాఠశాలలో నివసించేవారు. నేను ఏడవ తరగతి చదువుచున్న సమయం లో ఉపాధ్యాయునిగా పరిచయమైనారు. ఫిల్లలతో అతి సన్నిహితముగా మెలిగేవారు. శ్రీవారి సన్నిధిలో నా చిన్నతనంలోనే సదాచారము, సత్సాంగత్యము, నియమ నిస్ఠలు, ఆధ్యాత్మిక సాధనల గురించి విద్యార్ధులకు సులభ శైలిలో బోధించేవారు. రాత్రివేళలయందు స్వామివారి సన్నిధిలో విశ్రమించెడి వారము. విశ్రాంతి సమయములో సుజ్ఞానభరిత నీతికథలు, పెద్ద బాలశిక్ష, సుమతీ శతకం, వేమన పద్యాలు, సిద్ధపురుషుల, సర్వసంగ పరిత్యాగుల జీవిత గాథలు చెప్పేవారు. భగవద్గీతను కంఠస్థం చేయించారు. వారి దివ్య భాషణము మూలముగా శుద్ద సత్త్వగుణము ప్రభావముతో 1968 సంవత్సరములో పూర్తి సాకాహారిగా మారాను. ఆనాడు వారు చెప్పిన పరమార్థ కథలు నా హృదయసీమలో చెరగని ముద్రవేశాయి.

నా ఇష్టానుసారము స్వీకరించిన ఈ పదవిలో చివరివరకు ఉండువారం కాము అని అనెడివారు. మధ్యలో చాలాసార్లు నిష్క్రమింప చూశారు. పెద్ద కందుకూరులో ఉన్న సమయంలో సెలవు పత్రము లేకుండ ఎవరికి చెప్పకుండ కార్తీక పున్నమినాడు త్రిపురారం నుండి లోక స్తితిగతుల ప్రత్యక్షముగ గాంచు నిమిత్తం మాదిరిగ పాదము బయట వేసినారు. ప్లాట్ ఫారం స్పీచీలు శ్రీవారికి గిట్టవు. సివిల్ డ్రెస్ లో కొంతకాలము తిరిగినారు. ఆ సమయాలలో మహబూబ్ నగర్ జిల్లాలో కొన్ని హైస్కూళ్ళలో, కాలేజీలలో “విద్యార్థులు - క్రమశిక్షణ” అను అంశముపై గంభీర ఉపన్యాసములు ఇచ్చినారు. ప్రతి విద్యాలయము స్వామివారి కృషిని గ్రహించాలి. “వారి ఉపన్యాసములు విద్యాలయములకు జీవగర్ర” అని చాలా రీతుల ప్రశంసిస్తూ సర్టిఫికెట్లు ఇచ్చినారు. ఈ ప్రశంసా పత్రములు నాకవసరములేదని అన్నారు.

మాదిరిగ సాగిన ఆ బోధ యాత్ర విశేషములు డైరీ రూపములో వ్రాసినారు. మరికొంత కాలము మీరు మా మధ్యన ఉండాలని కోరగా ఉపాధ్యాయుల అభ్యర్ధన మేరకు పాముకుంట చేరి అమోఘ, అత్యద్భుత గ్రంధ రాజములను విరచించినారు. చివరకు ఈ భూతలమున విద్యాలయము లున్నంత కాలము గుర్తింపు మార్గదర్శకముగ ఉండు నిమిత్తము సదుపదెస విద్యాలయ ప్రదీప్తి యనెటి దివ్య గ్రంధమును స్వహస్తలిఖిత అతీత భాష్యముగ మనకు అందించినారు. ఇది విద్యార్ధులకు, ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు ‘కరదీపిక – కంఠహార మాలిక” వంటిది.

సత్ ప్రవర్తనగల విద్యార్ధులనిన స్వామివారికి ప్రాణము. వారలు ఏనాడు ట్యూషన్ ఫీజు తీసికోలేదు. నచ్చిన బీద పిల్లలకు పుస్తకములు కొనిచ్చి, ఫీజులు చెల్లించేవారు. వారి సాన్నిద్ధ్య శిష్యులు ఎందరో ఉన్నత పదవులలో గలరు. అమెరికా వెళ్ళినవారు కూడా వున్నారు. వారలు కలిసినపుడు స్వామీ ఇప్పటికి మీరు చెప్పిన సూక్తులు గుర్తున్నాయి. ఆ ఆదర్శంలో జీవిస్తున్నాము అని అన్నపుడు శ్రీవారు ఆనందభాష్పములు రాల్చెడివారు.

స్వామివారు తనను గూర్చి స్వయముగ ఇలా చెప్పి, వ్రాసినారు. నే సమస్త చదువుల తల్లిని, సరస్వతీ గర్భుడను. అందులకే నా భాష్య మునకు తిరుగుండదన్నారు. ఇవి అతిశయోక్తులు, కల్పనలు కావు. నిజమునకు అంతే. కారణం అనంత చిద్గగన విశ్వగర్భ స్తితి వారిది.

ఈ భూతల సమస్త విద్యార్ధిని విద్యార్ధులకు శ్రీవారి అంతిమ అభయ సందేశము ఏమనగా మీరాశించిన లక్ష్య సిద్ద్యర్ధం, శ్రద్దాసక్తులను, ఏకాగ్రతను పెంచుకొని, భావనిష్ఠను (సంకల్ప శక్తిని) ఆత్మ విశ్వాస పరిధిలో వృద్ధి పరుచుకొని, కుల, మత, వర్ణాశ్రమ ధర్మములనెటి ముండ్ల కంచెను దాటి, క్షుధ్రమైన హృదయ దౌర్బల్యమును వీడి, అనంత విశ్వ హృదయులై, విశ్వ విశాల దృక్పధము నలవర్చుకొని, స్పర్ధలు, పోటీ, వైరభావము లేని నవ సమాజ స్థాపకులై, ఘనవీర ప్రభు జ్యోతులు కండి. ఈ స్ధితిలో మీకు అసాధ్యమనునది వుండబోదు.

బాబా సర్వకేంద్రులు సోమరితనమును సహించే వారు కాదు. సమయ పాలన ముఖ్యమంటారు. మాకు సమయం లేదనటం తప్పించుకునేందుకు మాత్రమే. మనసుంటే మార్గం వుంటుంది. ఇస్టమున్న విషయాలలో సమయం ఎలా దొరుకుతుంది. మనిషి కాలమును తన ఆధీనములో వుంచుకోవాలి. చేరవలసిన చోటికి ముందుగ చేరగలగాలి.

స్వామివారు ఉపాధ్యాయ వృత్తిలోనున్న సమయములో ఒక్కొక్కసారి హైదరాబాదు రామంతపూర్ నుండి స్కూటర్ ప్రయాణము చేసి సుమారు 110 కి.మీ. దూరములో ఉన్న పాముకుంట పాఠశాలకు ప్రార్ధనకు ముందుగ వెళ్ళి, ప్రేయర్ బెల్ కొట్టించేవారు. గ్రామములో వున్న ఉపాధ్యాయులు, ప్రజలు ఆశ్చర్య పోయేవారు.

ప్రార్ధనానంతరం ఉపాద్యాయ రిజిష్టరులో సంతకముచేసి బయటికి వెళ్ళిన, మీటింగులు వుండినదప్ప మధ్యలో ఆఫీసు గదికి రాకపోయెడి వారు. 7 పీరియడులు తీసికునేవారు. సనాతన గురుకులాశ్రమ పాఠశాలల మాదిరి చెట్ల క్రింద విద్యా బోధన గావించెడివారు. వారు కూర్చున్న చోటికి ఆయా తరగతి విద్యార్ధులు రావలసి యుండేది. ఇంటర్వెల్ సమయములో కూడ స్వామివారు లేచేవారు కాదు. అది వారి నిగ్రహ శక్తికి నిదర్శనము. ప్రతిరోజు పరీక్ష యన్నట్లు 45 నిమిషములలో పాఠము చెప్పటము, అడగటము, డిక్తేషన్ మొదలగునవి నిర్వహించేవారు. ప్రతి పుస్తకము సంవత్సరములో రెండు, మూడుసార్లు రివిజన్ జరిపేవారు.

సర్వారం లో ఉన్నంతకాలము ఆదివారములు, సెలవుదినములలో సైతము పాఠశాల నడిపేవారు. విద్యార్ధులను లేపి వారితోపాటు కూర్చుండి చదివించేవారు. రాత్రివేళలలో చాలాసేపు మెలకువగా ఉండేవారు. గంటలతరబడి కూర్చుండి దివ్య రచనలు చేసెడివారు.

శ్రీవారు జన్మించిన గృహములో నిత్యపూజలు, అఖండ దీపారాధనలు, భజనలతో ఇల్లు ధ్వనించేది. శ్రీవారిది పరాభక్తి కుటుంబము. ఇంటిలో తాళాలు, చిరుతలు, మృదంగము, ఏక్ తార, తబలా వాయిద్యములుండేవి. స్వామివారి తండ్రి మధుర గాయకులు, కవి పండితులు, శతాధిక తత్త్వ రచయితలు. హరికధా అయ్యగార్ల వెంట కొంతకాలం తపలిస్టుగా సంచరించినారు. తెల్ల గుర్రముపై ప్రయాణము చేసెడివారు. పట్వారిగిరి న్యాయ బద్ధముగ నిర్వర్తించినారు. వీరు గృహస్ధాశ్రమ రాజ యోగీంద్రులు, గురుపుంగవులు. స్వామివారు అడుగు ప్రశ్నలకు సమాధానము చెప్పలేక ఉక్కిరిబిక్కిరి అయ్యేవాడు. శ్రీవారు అరటిపండు ఒలిచి నోటిలో పెట్టినట్లు పరమార్ధ జ్ఞాన విషయములు చెప్పెడివారు. ఏమిటీ విచిత్రము. వయసు చిన్నది, అనంత పరిజ్ఞానము. ఎవరు నీకీ విషయాలు చెప్పినారు, ఎలా తెలుసు అని బుచ్చిరామ స్వామిగారు ప్రశ్నించినపుడు శ్రీవారు ఇలా అన్నారు. “చిన్మయ పరమార్ధ జ్ఞాన సాగరుడను నేను. నాకు ఈ విషయాలు ఎవరు చెప్పలేదు, చెప్పలేరు. స్వత:సిద్ధుడనైన నాయొక్క స్వయం పరిజ్ఞానము” అని సమాధానపరిచినారు. అపుడు వారు ఇది అక్షర సత్యమని నమ్మినారు.

ఘటపిత దేహవియోగ సమయము ముందుగ చెప్పి ఆ సమయానికి స్వామిగారు వచ్చినారు. చేతులు జోడించి నాయనా! మీ అతీత దివ్య భాష్యమును రచించి లోకాలకు అందించండి. మీ వాక్కులు విశ్వజ్యోతులుగ వెలుగగలవని అన్నారు.

స్వామివారి ప్రధమరచన “భవరోగ శరణాలయం”. ప్రధాన వైద్యులు బాబా సర్వకేంద్రులు. గురుజనులు కాంపౌండర్లు అని తెలిపారు. యం. నాగభూషణాచారి డాక్తర్ గారు అది చదివి ముగ్ధులైనారు. నిన్నటివరకు తమ్ముడూ అని పిలిచాను, నేటినుండి నా ఆరాధ్య దైవం నీవని అన్నారు. శ్రీవారి నిజతత్త్వం గ్రహించిన పిదప ఇంటిలో పూజామందిరం లో కేవలం స్వామివారి చాయా చిత్రమును వుంచినారు.

ఏ పటమైనా, ఏ యాత్రలైనా, ఏ దేవుడైనా నా స్వరూపములేయని బాబా చెప్పినారు. ప్రశంసలు, అవార్డులు కావాలని స్వామి ఏనాడు కోరలేదు. శ్రీవారు ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నపుడు సెప్టెంబర్ 5, ఉపాధ్యాయ
దినోత్సవ సందర్భములో “ఆదర్శ ఉపాద్యాయులుగ” మీ పేరు పైకి వ్రాసి ‘అవార్డు, ప్రశంసా పత్రము’ ఇప్పించగలమని రెండు మూడు సార్లు తోటి ఉపాధ్యాయులు అనగా స్వామివారు ఒప్పుకోలేదు. నా అంతరాత్మను మించిన అవార్డు, పశంసా పత్రము అవనిలో లేదని చెప్పినారు. కాలక్రమేణ బాబా ఇలా వ్రాసినారు. చిన్న చీమ హిమాలయ మేరు పర్వతముల నోట కరచుకొని వెళ్ళచూచుట ఎంతయో ఈ లోక స్ధుతులు, స్తోత్రములు సర్వాతీతుడనైన నా సన్నిధిలో అంతేనని తెలిపారు. సర్వాత్మ జ్ఞానులై అనంత విశ్వహృదయులై నన్ను స్ధుతించండి అన్నారు.

మా సర్వారం గ్రామములో ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న సమయములో ఒకసారి ‘తిప్పర్తి హైస్కూల్’ కాంప్లెక్సులో మీటింగు జరిగినది. సుమారు 120 మంది ఉపాధ్యాయులు పాల్గొనినారు. “ఉపాధ్యాయుని మూర్తిమత్వం, సంఘంలో అతని పాత్ర” అను శీర్షికపై ఉపాధ్యాయుల కోరికపై స్వామిగారు ఒక గంట ప్రసంగించినారు. ఆనాటి సభకు తెలుగు పాఠ్య పుస్తకాలలో ఏయే అంశములు చేర్చవలయునో ప్రభుత్వమునకు సలహాలనిచ్చే సీనియర్ తెలుగు పండితులు హాజరైనారు. స్వామివారి ప్రసంగము విని ఏమిటీ విద్యుత్ ఝురి, అనర్గళ ప్రసంగ పటిమ అని ఆశ్చర్యపోయారు. వారు బ్రహ్మచరులు, స్వామీజీయని చెప్పగా అదా విశేషమని అభినందించారు. ఇన్ చార్జి డి.ఇ.ఓ. గారు తన జేబులోని పెన్ను తీసి స్వామిగారికి బహూకరించి సంతసించినారు. కాలక్రమేణ శ్రీవారు ఇలా వ్రాసినారు. నన్ను మించిన సుప్రభోధకాచార్యుడు, ప్రసంగి లేడు. సమస్త బోధలు నా చేతిలోని బోధనోప కరణములు.

నా మిత్రుడు తీగల ధర్మారావు ఆధ్యాత్మిక మార్గములో భ్రష్టుడు కాగానే, ఆ లోటును నేను పూర్తిచేయగలనన్నట్లు ఆతని తమ్ముడు తీగల సుధాకర్ రావు రంగ ప్రవేశం గావించాడు. స్థితికుదురని వైరాగ్య దశలో మేమిద్దరం మా తల్లిదండ్రులకు నచ్చ చెప్పే ధైర్యం లేక స్వామివారి సుప్రబోధ ప్రేరణతో భవిష్యత్ కార్య ప్రణాళిక పేరిట సంసిద్ధులం కాదలంచి కొంతకాలము ఆధ్యాత్మిక శిక్షణలు ప్రాధమిక దశలో పొందు నిమిత్తం నేను వ్యాసాశ్రమము, శ్రీ సుధాకర్ రావు చెన్నైలోని రామక్రిష్ణ మఠము వెళ్ళినాము. మాకు మంచి గుర్తింపు వచ్చేసరికి “మా పిల్లలు మీకు తెలియకుండ ఎక్కడికి పోలేరు. అంత మీరు చేసినదే, మా పిల్లలను మాకు అప్పగించండి అని దుర్భాషలాడినారు”. ఆ పరిస్థితిని తట్టుకోలేక స్వామివారు మమ్ములను మా తల్లిదండ్రులకు అప్పగించి వెళ్ళిపోయారు.

స్వామినుండి ఉత్తర ప్రత్యుత్తరాలు, రాకపోకలు పూర్తిగా నిలిచిపోయినవి. 22 సం.ల తరువాత శ్రీవారు పరాత్పరమ అత్యాశ్రమ ప్రశాంతి నిలయం స్థాపించినారని తెలిసి, వెళ్ళి దర్శించడం జరిగినది. శ్రీవారి అతీత భావ స్పర్శతో 22 సంవత్సరముల స్థితిని వారము దినములలో పొందగలిగాను.

ఆగామోత్కూరు హైస్కూల్ ఇండ్లూరు నుండి పది కిలోమీటర్ల దూరం ఉండేది. ప్రతిరోజు ప్రార్ధనకు ముందే చేరి సాయంత్రం ఇల్లు చేరి, రాత్రి మూడు గంటలు ఆధ్యాత్మిక ప్రసంగములు చేసెడివారు. ఆరు నెలలపాటు ఇలా జరిగినది. ఆ సమయాలలో బైబిలును, భగవద్గీతను సమన్వయపరచి బోధించేవారు. అలా కూడదని కొందరు సందేహించి వాదించగా, సమస్త ప్రతివాద భయంకరులైన బాబా తమ వాగ్ధాటిచే చట్ట ప్రకారము నోర్లు మూయించారు.

నాతో వ్యాజ్యము మండే కొరివితో తల గోక్కొవటం లాంటిదని తెలిపారు. సివిల్ డ్రెస్సులో సి.ఐ.డి.గ తిరుగుచున్నాను. నా రచనలకు మును ముందు విశేష ఆదరణ పెరుగుతుంది. సమస్త సంస్థలు, ప్రభుత్వాలు, పారిశ్రామిక వేత్తలు, ధనాధిపతులు వివిధ రీతుల సహకరించ గలరు. ఇది యదార్ధము.

విద్యార్ధి దశలో నున్న సమయములో శ్రీవారు పాఠ్య పుస్తకములను చదివే వారు కాదు. పాఠశాలలో కేవలం వినేవారు. ఏకాంతముగ కూర్చుండి అగాధమైన ఆలోచనా సాగరములో నిమగ్నమయ్యే వారు. ఆ స్థితిలో సమాధి నిష్ఠ సహజంగ వుండేది. సర్వలక్షణ, విలక్షణ సర్వాతీత ఘన ప్రభు వీర సింగ స్వభావులు కండి యని స్వామి ఉద్భోదించే వారు.

పనిలేని చిత్తము దయ్యాల కొంప. సోమరులై చతికిలబడకుండ ప్రతివారు తమకు వీలున్న కర్మకాండ పరిధిలో కృతకృత్యులు కావలయును. ప్రతి విషయములో ఇతరులపై అధారపడరాదు. ఎవరి పనులు వారు చేసుకోవటము మంచిది. ఇందులో సంతృప్తి, ఆనందము వుంటుంది. అనివార్య,
అశక్త పరిస్థితిలో తప్ప ఇతరులపై ఎంతమాత్రం ఆధారపడరాదు అంటారు బాబా. అందులకే వంట చేసుకోవటం, బట్టలు ఉతుక్కోవటం స్వామివారు స్వయముగ చేసుకునే వారు. నేను నా కళ్ళారా ప్రత్యక్షముగా చూచిన విషయములను మాత్రమే వ్రాయుచున్నాను.

శ్రీవారి ఘటపిత శ్రీ బుచ్చిరామ స్వామిగారు వానప్రస్ధ దశ నుండి సన్యాసాశ్రమ స్వీకరణ గావించినపుడు, భిక్షాటన అవధూత లక్షణమని ఎరింగి జోలె, సితార చేపట్టి తాను రచించిన తత్త్వములను గొంతెత్తి శ్రావ్యముగ గానము చేస్తూ తిరిగెడివారు. బాబా సర్వకేంద్రులు ఈ దృశ్యమును ప్రత్యక్షముగ చూచి సంతసించినారు. ఇలా తగ్గించుకోవటం నాకు ప్రీతికరమని ప్రశంసించారు.

అరిషడ్వర్గములపై రామస్వామిగారి తత్త్వము.

ఉదా:
1. లెక్కకు ఆరుగురు జనులు మీరు
ఎక్కడికి జనుచుంటిరి చిక్కితిని మీచేత
ఏమి చేయదలచుకుంటిరి
సర్వకేంద్రుల స్మరణ చేయగ పట్టవచ్చెద రేమిరా
2. దేవాది దేవ దేవ ఓ సర్వకేంద్రబాబా
నిన్ను నమ్మినారమయ్య మమ్ము బ్రోచి కావుమయ్య
ఎన్ని జన్మల నోముఫలమో నిన్ను దర్శించాము తండ్రి
భవభయ హరణా సర్వలోక శరణ్య

స్వామిగారు హైస్కూలులో చదువునపుడు స్పిన్నింగ్ & వీవింగ్ లో తకిలీ పై దారము తీయుటలో ఫస్ట్ క్లాస్ సర్టిఫికెట్ ఇచ్చినారు. దీని ప్రభావము బి.టి.ఎస్. సెలక్టు గావటములో ప్రధానముగ తోడ్పడినది.

తనకెంత తెలిసినను నివురుగప్పిన నిప్పువలె ఉన్నారు. స్వామీజీ రాత్రులు చాలావరకు ఇంటిలో నిద్రించేవారు కాదు. విద్యార్ధి దశలో వైశ్యుల గృహములలో ఎవరింటికి వెళ్ళినా వారలు స్వామిని పరుండబెట్టుకునేవారు. ఎవరింటికి వెళ్ళినా వారిలో ఒకరుగ మెలగగల శక్తి స్వామికి సహజ గుణము. ముఖ్యముగా శ్రీ యస్. రంగయ్య గుప్త గృహములో ఎక్కువగా ఉండేవారు. యస్. శేషయ్య గుప్త మొదలగువారు ఆధ్యాత్మిక చర్చ జరుపుకొనునపుడు అకస్మాత్తుగ స్వామి గళమెత్తినారు. వారందరు ఆశ్చర్యపడి ఆనాటినుండి నిజగురు దేవులుగ ఆరాధించినారు. ఆగామోత్కూరులో ఉపాధ్యాయ వౄత్తిలో ఉన్నపుడు బి. బ్రహ్మయ్య, బి. రాములు, యస్. శేషయ్య గుప్త మొదలగువారి నిమిత్తం సాయంత్రం వచ్చి రాత్రి 8 గంటల నుండి 11 గంటల వరకు బోధ చేసెడివారు.

ఇక వివాహ ప్రసక్తి. భాబా సర్వకేంద్రులు గుహ్యద్గుహ్య పరమకారణ జన్ములని తెలియక లోకులు స్వామివారి తల్లిగారైన పుల్లమాంబతో ఏమమ్మ! నీ కొడుకు తోటివారలకు పెళ్ళి జరిగి పిల్లలు ఐనారు, నీవెపుడు చేయగలవు అని కొమ్మాలలో ఉన్న మేన మామగారు ఇంటికి వచ్చి అనగా పిదప ఆ విషయం తెలిసి సుదీర్ఘ లేఖ వ్రాసి ఆ గ్రామము వెళ్ళి నేను ఎవరు అని యదార్ధం చెప్పగా తప్పు ఐనది, క్షమించండి అని పాదాభివందనము చేసి వేడుకొన్నాడు. వివాహ విషయములో ఎవరు ధైర్యముగా ఎదురు నిలిచి అడుగలేదు. కొందరి మనస్తత్త్వముల గ్రహించిన బాబా అందరిని ఉద్దేశించి ఇలా అన్నారు. “నేనీ లోక సంబందిని కాదు. నాకు ఏ రుణబంధం లేదు. సశరీర పరిధిలో ప్రతి స్త్రీ నా శరీరమునకు జన్మనిచ్చిన తల్లియే. కేవల సర్వాతీత నా నిజస్థితిలో సకల చరాచర ప్రాణికోటి నా స్వరూప కాంతులు, బిడ్డలు అనగా అందరు ఖిన్నులైనారు. మరల వివాహ ప్రసక్తి ఎవరు, ఏనాడు తేలేదు. రామ, కృష్ణావతారములలో వారు పెళ్ళి చేసుకోలేదా అనగా "వివాహ పరిధిలో సర్వకేంద్రుడనైన నన్ను ఎవరితో పోల్చరాదని చెప్పినారు. నే సర్వావతార నిలయుడను, స్వత:సిద్ధుడను, నేనందరి వాడను. అందరు నావారే”.

బాబా సర్వకేంద్రులు బాల్యదశలోనే 12 సంవత్సరముల వయసులో పరమాశ్చర్య భరిత, అత్యద్భుత నిదర్శనము చూపినారు. ఆనాటినుండి మా జన్మ జన్మల పుణ్య విశేషముచే పరాత్పరులే మా ఇంట వెలసినారని నమ్మినారు.

శ్రీవారు విద్యార్ధి దశలో చిల్లర ఆటలు ఆడేవారు కాదు. నెక్కర్ జేబులో ఎపుడు నల్లని ఏనెరాతి గోలి ఉండేది. గోలీల ఆటలో శ్రీవారు అందెవేసిన చేయి. ఎప్పుడూ ఫస్ట్ వచ్చేవారు. చాలా దూరాన ఉన్న గోలీలను సూటిగ కొట్టేవారు. ఒక్కొక్కసారి గోలీలు పగిలిపోయేవి. ఆటలలో దాడి, పులి పందెం, పిదప క్యారం బోర్డు ఆడేవారు. బేసిక్ ట్రైనింగ్ హాస్టలులో ఉన్న సమయములో వంటవారి వద్ద కూర్చుండి పూరీలు, అన్నము, కూరలు వండటము నేర్చుకున్నారు. ప్రతివారు పాకశాస్త్ర పరిజ్ఞానము కలిగివుండాలని స్వామివారు అంటారు. టీచర్ ట్రైనింగ్ బి.టి.ఎస్ లో, సూర్యాపేట హాస్టల్లో ఉన్న సమయములో తెల్లవారుఝామున నాలుగు గంటలకు అందరిని నిద్రలేపి చదివించే డ్యూటీ స్వామివారికి అప్ప గించారు. లేవని వారి చెవిలో నీళ్ళుపోసి లేపి చదివించెడివారు. క్రమముగా అలవాటుపడి తమంతట తామే లేచి చదువుకునేవారు.

బి.టి.ఎస్ లో ఎస్.జి.బి.టి, ఇ.జి.బి.టి రెండు తరగతులు సీనియర్లు, జూనియర్లు కలసి మొత్తము 200 మంది. ఆడవారు కూడా కలరు. వీరలు స్వామీజీని మాతృస్థానము లో చూచెడివారు. వారల గదులకు వెళ్ళి సైకాలజి చెప్పెడి వారు. స్వామివారి విషయములో ఎవరికి ఎంతమాత్రం అపార్ధములు లేవు. అకళంక పవిత్ర హృదయులు స్వామిగారని అనేవారు.

సైకాలజి సబ్జెక్టుకు హనుమారెడ్డి లెక్చరర్ కొత్తగ వచ్చినారు. స్వామివారి పరీక్షా పత్రము దిద్దలేక ప్రిన్సిపాల్ గారికి చూపి నా నాలెడ్జి, పరిజ్ఞానము సరిపోవటం లేదని ఆశ్చర్యపడినాదు. 100కు 100 మార్కులు వేసినా అతిశయోక్తి కాదు అని చెప్పినాడు. నేనొక విద్యార్ధిగ కొన్ని విషయాలు తెలిసికోవలసి యున్నదని ఇంటికి ఆహ్వానపరచి చాలా విషయాలు అడుగగా స్వామిగారు కంప్యూటర్ మాదిరి సమాధానములు అప్పటికప్పుడే చెప్పినారు.

భి.టి.ఎస్. లో ఉన్న 2 సం.లు ఏ ఆటలు ఆడలేదు. ఖేవలం క్యారంబోర్డు ఆడేవారు. ఎక్కువ సమయం నవారు నేయించే టీచరుకు సయాయకారిగ వుండి మగ్గం నేసెడివారు. భి.టి.ఎస్. లో మీటింగులలో శ్రీవారు ప్రసంగించేవారు. అందరు శ్రద్దగ వినేవారు.

స్వామిగారు మోడల్ లెస్సన్, సైన్సు, మాతృభాషలలో చెప్పెడివారు. విద్యార్ధులు తన్మయులై వినెడివారు.పరిశీలకులు “బోధన ఉత్కృష్టము, వ్రాత గుండ్రముగ, దోష రహితముగ నున్నది, పాఠము ఆదర్శప్రాయము, సంతృప్తికరమని” వ్రాసెడివారు. శ్రీవారి మేధాశక్తి అమోఘము, అతీతము. వారి ఖడ్ఘమునకు రెండువైపుల పదును కలదు. గళమెత్తి అనర్గళ ప్రసంగము చేయగలరు. కలమెత్తి అతీత దివ్య భాష్యము వ్రాయగలరు. శ్రీవారు సరస్వతీగర్భులు. ఈమాట వారి స్వముఖత విన్నాము. సశరీర పరిధిలో స్వామి సర్వకేంద్రుల రాక సర్వలోకాలకు శుభప్రదము. “సమస్త దివ్య సత్పురుషుల జయంతి నాది. నాకు ఏనాడు వర్ధంతి లేదంటారు బాబా సర్వకేంద్రులు”.

స్వామివారిని శైశవ, బాల్యదశ, 4వ తరగతి వరకు ఒక ముస్లిం మాస్టరుగారు ఎంతో ప్రేమగ చూచెడివారు. పాఠశాలకు ఎత్తుకొని పోయెడి వారు. మరల పాఠశాలనుండి ఎత్తుకొని వెళ్ళి ఇంటిముందు దించి వెళ్ళెడివారు. శ్రీవారు బాబా, స్వామిగ గుర్తింపు ఐన పిదప ఆ ముస్లిం మాస్టరు గారు రామన్నపేటలో ఉండగ తెలిసి వెళ్ళినపుడు ఆలింగనపర్చుకొని “ఒకనాటి నా ప్రియమైన విద్యార్ధి ఈనాడు అల్లాగ మా గృహం చేరినాడని పొంగి పొరలిన ఆనందాతిరేకముతో అన్నాడు”.

పెద్దకందుకూరు గ్రామములో ఉపాధ్యాయ వృత్తిలోనున్న సమయములో ఎవరికి చెప్పకుండ 1976 సం. కార్తీక పౌర్ణమి రోజున ‘త్రిపురారం’ గ్రామమునుండి సశరీర పరిధిలో సంచారము గావించినారు. దేవరకొండ, నాగర్ కర్నూలు, ఉప్పునూతల, వనపర్తి, డిండి, అచ్చంపెట, షాద్ నగర్ ఇలా సంచరిస్తూ మరల ఆలేరు చేరి పెద్దకందుకూరు గ్రామములో రాత్రి బహిరంగసభలో ప్రసంగించి, ఉదయం పాఠశాలలో ప్రసంగించినారు. ఆపాటికే స్వామివారిని పాంకుంట గ్రామానికి బదిలీ గావించినారు. రాజీనామా చేసి
పోగలమని స్వామివారనగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు శ్రీ సోమలింగం గారు, తదితర ఉపాధ్యాయులు పట్టుబట్టి నూతన వస్త్రములు కొనితెచ్చి, మరికొంత కాలము మీరు ఈ వృత్తిలో కొనసాగాలని పాంకుంట పంపించినారు. ఈ విషయములో ఇ.వో. గోపయ్యగారు ముఖ్యపాత్ర వహించారు.


స్వామి సరేనని వెళ్ళగా చాలా మంచియే జరిగినది. పాంకుంట పాఠసాల ప్రధాన ఉపాధ్యాయుడు శ్రీ బచ్చు లక్ష్మయ్య గుప్త ఆధ్యాత్మిక జిజ్ఞాసువు గాన స్వామిగారికి శిష్యులై చాలాకాలము రాత్రి పాఠశాలలో సత్సంగ, భజన కార్యక్రమములు నిర్వహింప చేసారు. కొందరి భక్తుల కోరికపై రఘునాధపురము, చిత్తలూరు, కాలువపల్లి మొదలగు గ్రామములు బోధ నిమిత్తము వెళ్ళినారు. ఆ సమయములో “గీత” నాలుగు అధ్యాయముల వరకు రచన ఆగిపోయినది. పరమ ప్రశస్ధమైన అతిగోప్య దివ్య గ్రంధములు విరచన గావించబడినవి. ఇది మిక్కిలి విశేషము.

మరియొక ముఖ్య విశేషమేమనగా శ్రీవారి భక్త కుటుంబమైన శ్రీ ఎడ్ల రాం రెడ్డిగారి ద్వితీయ కుమార్తె, కుమారి అరుణాదేవికి గీత నేర్పించి, శాస్త్రోక్తముగ ఆత్మీయ దత్త పుత్రికగ స్వీకరించినారు. బాబావారి అనుమతితో అరుణ వివాహము చేసుకొని ఒక పుత్రికను కని పిదప ఆమె భర్తగారికి వేరొక వివాహము గావించి, కూతురును చదివించి, వివాహము చేసి, కూతురువద్ద ఉంటూనే ఆధ్యాత్మిక పరిధిలో జీవితం గడుపుచు, త్రిపురారములోని ఆశ్రమం చూసుకుంటూ, స్వామివారి విషయం లో అత్యంత శ్రద్ధ వహించియున్నది. ఒక్కమాటలో చెప్పాలనిన ఆమె బాబావారికి బాడీగార్డు. రేపల్లెలో చిన్ని కృష్ణుడు యశోద సన్నిధిలో పెరిగినట్లు నాకు అరుణమ్మగారి సన్నిధి అంతేనని స్వామిగారు చిరునగవుతో చాలాసార్లు చెప్పినారు.

బాబాగారి రచనలలో ముఖ్యమైనవి:

1) నేతిహరి కాళీబాబా సర్వకేంద్ర భగవద్వాణి.
2) సత్యార్ధ ప్రవచన సందేశ లహరి.
3) సర్వోన్నత స్వరామృత దివ్య శంఖారవళి.
4) మారని మార్గదర్శి, ఆరని నిండు వెలుగు.
5) సదుపదేశ సాహస్రి.
6) సుజ్ఞానొదయ వార్షిక డైరి.
7) జీవోద్ధారక పరమపిత బైబిల్.
8) సర్వమతారాధ్య సంపూర్ణ దైవదర్శనము.
9) బాబా సర్వకేంద్ర సంపూర్ణ వేద పరమార్ధ సారస్వతము.
10) సంపూర్ణ సాహస్ర ప్రశ్నోత్తరి.
11) గృహస్థాశ్రమ ప్రాశస్ధ్యము.
12) సదుపదేశ విద్యాలయ ప్రదీప్తి.
13) అనంత విశ్వసత్యం, లోకంతీరు, మీ శక్తిని సాధించండి.
14) పరమాంకుశ ప్రచంఢ త్రిశూల మార్గము.
15) బాబా సర్వకేంద్ర పీఠ వార్తలు.

ఒక ముస్లిం డాక్టరు ఖాజాగారి కోరికపై “అందరు పట్టణాలలో నివసించిన పల్లెలగతి ఏమికావాలి, మీరు త్రిపురారములో ఆశ్రమస్థాపన గావించండని కోరగ సరేనని ఆ విధముగనే పరాత్పరమ అత్యాశ్రమ ప్రశాంతి నిలయం ను స్థాపించారు. ఆశ్రమానికి ఎంతో సేవ చేయగలననిన డాక్టర్ ఖాజాగారు అకస్మాత్తుగ దేహ వియోగం చెందినారు. ఫుత్రులు ఆ పరిజ్ఞానములో లేరు.

గృహస్థాశ్రమ రాజయోగీంద్రులైన శ్రీ నాగులవంచ వసంతరావు శ్రీవారి రచనలన్నిటిని జిరాక్స్ తీయించి, డి.టి.పి. చేయించి భధ్రపరిచే కార్యక్రమములో ఉన్నారు. గృహస్థాశ్రమ ప్రాశస్థ్యం, అనంత విశ్వసత్యం - లోకంతీరు - మీ శక్తిని సాధించండి యనే గ్రంచములు డి. టి.పి. చేయించ బడినవి. సద్భావనా స్రవంతి (ఫిబ్రవరి, 2004), సదుపదేస విద్యాలయ ప్రదీప్తి (ఫిబ్రవరి 2006), సుజ్ఞానోదయ సర్వాత్మ తత్త్వములు యనే గ్రంధములను ప్రచురింపచేసి ప్రముఖులకు అందజేయనైనది. వీటిపై విశేష స్పందనలు లభించాయి. జ్ఞానదాన తప్తులైన కొంతమంది దాతలు విరాళములను ఒసంగినారు. ముఖ్యముగా రమణ మహర్షి భక్తులు, అరుణాచల వాసులైన శ్రీ ఓ. నాగేశ్వర రావుగారు బాబా విరచిత సదుపదేశ విద్యాలయ ప్రదీప్తి గ్రంధ ముద్రణ నిమిత్తమై పదివేల రూపాయలను విరాళముగ పంపించినారు. శ్రీ నాగులంచ వసంతరావు పుత్రిక కుమారి శృతి “అనంత విశ్వసత్యం - లోకంతీరు - మీ శక్తిని సాధించండి” గ్రంచము చదివి చాలా మార్పు చెందినది. భవిష్యత్తులో శ్రీవారి గ్రంధ ముద్రణ విషయములో సహకరించగలనని తన అభిప్రాయం వ్యక్తం చేసినది.

శ్రీవారు మాదిరిగ బోధయాత్ర చేసినపుడు ఒక నెల రోజులు మహబూబ్ నగర్ లో వున్నారు. శివాలయములో బస చేసెడివారు. దినమునకు ఒకరి ఆహ్వానముపై మధ్యాహ్నము భోజనమునకు వెళ్ళెడివారు. చౌడూరి గోపాల్ రావు, తెలుగు పండిత్ గారికి కాషాయ వస్త్రములు, స్వాములనిన గిట్టదట. ఆన్యాయముగ ప్రజలను దోచుకుంటున్నారని ఆయన ఆరోపణ. భాబా వారి ప్రసంగము జూనియర్ కళశాలలో విని ఆహా! చక్కర్ మక్కర్ స్వామి కాదు. ఒరిజినల్ సరుకు అని ప్రశంసించి, వారింటికి ఆహ్వానపరచి, ఆతిధ్యమిచ్చి, అతను వ్రాసి ముద్రితములైన గ్రంధములను చూపినారు. స్వంత ముద్రణాలయముగల శ్రీ కిషన్ రావుగారికి స్వామివారి గ్రంధములనుండి ప్రస్తుతము సుజ్ఞాన జ్ఞాన వాక్యామృతమును ముద్రణ గావించండని లేఖ వ్రాశాడు. అనివార్య పరిస్థితులవలన ఆ కార్యక్రమము నెరవేర్చబడలేదు.

స్వామిగారు అవతరించిన కుటుంబము మొదట శ్రీమంతులు. వంద ఎకరముల భూస్వాములు. కాలక్రమేణ ఆస్తులు క్షీణించసాగినవి. భూములను విక్రయించుకొన్నారు. అన్నవస్త్రములకు లోటులేకుండ ఆత్మాబిమాన ధనముతో జీవించినారు.

సర్వవిధముల పేరు నిలుపగలరని భావించి త్రిపురారం ఆశ్రమ సేవ నిమిత్తము ఇల్లు కట్టించి శారీరక రక్త సంబంధ శ్రీవారి తమ్మునిగారి కుటుంబమును ఉంచగా, ఆశ్రమ, స్వామి సిద్ధాంతములకు భిన్నముగ ప్రవర్తించి భ్రష్టులైనారు. చివరికి ఏ సంబంధం లేకుండ గోడ పెట్టించి
వేరుపరచినారు. నటన నానావిధముల చేటు. యోగ్యత ముఖ్యము. అత్యాశ్రమ సర్వాధిపత్యము యం. అరుణ పేరిట వీలునామ వ్రాయించ బడినది. రచన గ్రంధముల ముద్రణ భారము పూర్వాశ్రమ నేతి విజయదేవ్ (నాగులవంచ వసంతరావు) కు అప్పగించబడినది. ఊద్యోగ విరమణ తదనంతరం శేష జీవితం ఈమార్గములో ఆ దంపతులు నిలువగలరు. సేవ చేయగలరు. ఆశ్రమ అధ్యక్షులుగ సర్వవిధముల నాగులవంచ వసంతరావు సలహాలు అరుణకు ఇవ్వబడును. ఆమె వసంతరావుకు ఆత్మీయ సహోదరి. సర్వారములోని సుమతీశ్వరీ దేవి కోల్పోయిన స్థానమును చి.ల.సౌ. యం. అరుణ పూర్తి గావించినది. అది ఆమె అర్హతకు నిదర్శనము. ప్రకృతి పురుషులు బొమ్మ బొరుసు నా స్వరూపములు. పూర్తి నాణెము నేనే సర్వ కేంద్రం అంటారు బాబా.

శ్రీ వసంతరావు ధర్మపత్ని శ్రీమతి రజని (పావని), మొదట ఆమె భర్తగారి ఆంతర్యం గ్రహించలేదు. పిదప స్వామివారి రాకతో విషయం గ్రహించి ధన్యురాలనని నిశ్చయించుకొన్నది. మునుముందు ఆధ్యాత్మిక పరిధిలో ఆమె సహాయం ఎంతో వుంటుంది. కుమార్తె విద్యార్జన పూర్తి మరియు వివాహ తదనంతరం ఆమెకు బాబా మార్గమే సర్వశరణ్యం.

శ్రీమతి కుబ్బిరెడ్డి జ్యోతి, శ్రీ శ్రీనివాస్ రెడ్డి దంపతులు వసంతరావు కుటుంబముతో ఆత్మీయ సన్నిహితులై ఆశ్రమములో శివలింగ విగ్రహ ప్రతిష్ఠ గావింపజేసి ధన్యులైనారు. ప్రతి సంవత్సరము జరిగే ఆశ్రమ వార్షికోత్సవ అన్నదాన ఖర్చులను భరించుచున్నారు.

గుహ్యద్గుహ్య పరపకారణ అనంత విశ్వగర్భులు బాబా సర్వకేంద్రుల శారీరక అవతరణ ఏ విధమైన అద్భుత సూచక క్రియలు లేకుండ జరిగినది. “కాళకాళుడనైన నా వయసు అలేఖ్యం. ఈ శరీరముతోపాటు పుట్టి గిట్టులు నాకెన్నడు లేవు. మీ ఉద్ధారక నిమిత్తం మానవాకారం ధరించవలసి వచ్చినది. ఐనను నాది సాధన మానవత్వం కాదు, సర్వేశ దైవత్వం. నే వికసించిన జీవిని కాదు. స్వత:స్సిద్ధ పరాత్పరుడను అని బాబా సర్వకేంద్రుల యాన. ఫ్రతి దివ్య సత్పురుష జయంతి నాది. నాకు వర్ధంతి లేదు" అంటారు బాబా.

"ఈ లోకములో ధర్మము క్షయించి, మూర్ఖత్వం ప్రబలినపుడు దానిని అణచుటకు అంకుశం లాగ దివ్యశక్తి పనిచేయవలసి వస్తుంది. ఈ ఒడుదుడుకు క్లిష్ట పరిస్థితిలో సాక్షాత్ సర్వకేంద్ర దైవశక్తి ఈ రూపము దాల్చవలసి వచ్చినదని" బాబావారు సెలవిచ్చారు.

"సర్వావతార కూడలి సర్వకేంద్రుడ నైన నాకు తెలియని అవతారము లేదు. మీ ఏ ఆరాధ్య స్థితిగాని నాకు అభిన్నము" అంటారు బాబా సర్వకేంద్రులు. "ఒక్కమాటలో చెప్పాలనిన మీ జయంతియే నా జయంతి. సార్వ కాలం నేను మీతో ఏకీభవించి యున్నాను. నేనులేని కాలము లేదు. సమస్త యుగ జగంబులు నా ఉనికిలో భాసిల్లుచున్నవి" అంటారు బాబా.


ఓం! ఆత్యద్భుత, మహిమాన్విత, సకల భూతప్రియ, సర్వాకర్షణ, సర్వ వశీకర, సర్వస్తంభన, చిన్మయ చైతన్య సర్వ శక్తుల కేంద్రుడనైన నా నుండి సమస్త జీవ జగత్తులు, అఖిలాండకోటి బ్రహ్మాండ దివ్యశక్తులు ఉదయిస్తున్నాయి. అహమచలనంతాత్మ, సర్వ ధరిత, కాళీ దుర్గ విశ్వ గర్భోహం, ఇదియే శ్రీవారి స్థితి.


“నా ఏకాగ్రతలో మీరు ఏవంతు కలిగియున్నను ప్రపంచ విద్యలన్నింటిలో ప్రధమశ్రేణిలో నెగ్గగలరు అంటారు. నాది గురు పరంపర కాదు. జ్ఞానార్జన విషయం లో నేనెన్నడు ఎవరిని ఆశ్రయించలేదు. కారణం సమస్త జ్ఞాన నిధులు నా ఆధీనం లో గలవు".

“సార్వకాలం ఉన్నది నేనొక్కడనే. ఇతరం మిధ్య. నా నేను స్వరూపులుగ వర్ధిల్లుటయే మీ కర్తవ్యం. నా నిజ స్థితికి భిన్నముగ మీరలు ఏ భగవంతుని చూడలేరు, చూపలేరు. ఇది శ్రీవారి శాసనము. పరమ సి.ఐ.డి.గ నా రాక జరిగినది. లోక స్థితిగతులను ప్రత్యక్షముగ తిలకించి, అతీత రచనలు గావించటం వరకే నిర్ణయించుకున్నరు గాన చిల్లర ప్రసంగములతో ప్రజల మధ్యన తిరుగలేదు. నా ఉద్యమ కార్యకతల నేనే ఎన్నుకోగలను.ఆయా సమయ సందర్భానుసారం పంపగలను” అన్నారు బాబా సర్వకేంద్ర భగవన్.

“ఇహ పరంబులు రెండు నా ఆధీనములోనివే. నాకు సాటి నేనే. నన్ను అతిక్రమించి ఏశక్తి నిలువదు. సర్వశక్తులకు ఆకరము నేనే సర్వాకారుడను. ఆకాశవాణి వార్తలను అందించు రేడియో వలె చిన్మయ పరతత్త్వ ఆకాశ వాణిని ప్రసారముగావించు సాధనము నా శరీరము” అంటారు బాబా. “ఏది ఏమైనను ఆత్మవిశ్వాసులు ధన్యులు. మానవుని దైవ స్వరూపిగ ఆవిష్కరింప చేయటమే నా విధి” అంటున్నారు బాబా సర్వకేంద్రులు.

Thursday, December 6, 2007

అనురాగమల్లీ నా ప్రియమైన తల్లి
నాలో నిత్యం వెలిగే శృతి కల్పవల్లి
శృతి కల్పవల్లి నా పాలవెల్లి
నినుమోసె నీతల్లి కనకగర్భమున
అదృష్ట జాతకురాలవు నీవమ్మా
నీ తలిదండ్రుల జన్మ ధన్యమమ్మ
క్రమముగ నీ యోగ్యత ప్రకటితమగునమ్మ
విశ్వమాతృ బాబా కృపకు నోచుకున్నవమ్మ
సమస్త సందేహములు ఇకతీరునమ్మా
నా నిజ దర్శనము ఇక కలుగునమ్మ
అపుడు నీ వైభవమున కంతుండదమ్మా
నీలో నీ తలిదండ్రుల చూస్తున్నానమ్మ
నీ హృదయ దర్పణములో నన్నలా చూపమ్మా
విదుషీమణి శోభతో నీవు వికసించవమ్మ
సుజ్ఞానోదయ ప్రభతో నీవెలుగవమ్మ
ఆ వెలుగులో నే నిన్ను గాంచాలమ్మ
నా చూపులో నీరూపు నిలుపాలమ్మ
ఆ నిలుకడయే నీకు ఆత్మాభిరక్షమ్మ
విశ్వమాతగ నిన్ను దీవిస్తున్నానమ్మ
విశ్వములో నిను మించిన తల్లి లేదమ్మా
యుగజగంబులు నా జడపిన్నులమ్మ
సమస్త సృష్టి నాశిగ పూవమ్మ
అంత తొందరగ నేను అర్ధం కానమ్మ
అర్ధమైతె జన్మలో మరువలేరమ్మ
శిశువుల హృదయాలలో నేనున్నానమ్మ
అందులకై శైశవ స్ధితికి వస్తినమ్మ
ఇది కేవల అతీంద్రియ బాబా పదవమ్మ
ఈ పదవిని మించిన పరమాత్ముడు లేడమ్మా
ప్రతి స్త్రీయు నాకు పసిబిడ్డయేనమ్మ
ఇది విశ్వమాతృ బాబా ఘనతోయమ్మ
ఇది అమ్మల మించిన అమ్మ అనురాగమమ్మ
నా అనురాగ ఊయలలో శయనించవమ్మ
(మత్ప్రియాత్మ పుత్రిక) సరస్వతీ స్వరూపముగ నిను చూస్తున్నానమ్మ
సృష్టిలో ననుమించిన అవతారము లేదమ్మ
మరల మరల మానవ జన్మకు నే రాలేనమ్మా
సర్వజ్ఞులకు సైతము నా అంతు చిక్కదమ్మ
సమస్త యుగముల రక్షక భిక్షగ
సర్వకేంద్ర పిత బోధ ననుగ్రహించితినమ్మ
పావనమైన నా దీవనల గైకొని
ఈ పుడమిలో నీవు ప్రకాశించవమ్మ
నీ నిశ్చయ ప్రజ్ఞకు నే సంతసించితినమ్మ
సంతసించి నీ ఆజ్ఞకు కట్టుబడితినమ్మ
పవిత్ర ప్రేమల పరాభక్తి సూత్రములచేదప్ప
నన్నెవ్వరు బంధించలేరు ఈ జగాన
సరస్వతీ కటాక్షముతో సాగిపోవమ్మా
నా అనుగ్రహశక్తి నీకు సదా తోడమ్మ
సమస్త గుడులు నా ఒడిలో గలవమ్మా
అందులకే నా సన్నిధిని ఎన్నుకోవమ్మా
శుద్ధ సంకల్పమాత్రాన కనిపించెదనమ్మా
కనిపించి దీవెనల కురిపించెదనమ్మ
విశ్వమాతృ బాబాను దర్శించగ
విశుద్ధానంద భాష్పములు వెదజల్లగ
నిత్యపఠనీయముగ ఈ భాష్యమాలికను
(అంతిమ శ్వాసవరకు) నీకంఠహారముగ కాపాడవమ్మ
నీ చిన్ని మాడపై నా కృపదృష్టి ముద్దమ్మ
ఇంతకుమించిన “ఆశీస్సు” ఇక వేరే లేదమ్మ
జై మాతా జై బాబా !
జై మాతా జై బాబా జై జై బాబా !!

- బాబా సర్వకేంద్ర